ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనుగడ సాగిస్తూ, ప్రజాస్వామ్యంపై మాతృక భారత దేశం అని చెప్పుకుంటున్న సమయంలో, స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లకు, మరో 25 ఏళ్లలో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ‘అమృతకాలం’ లక్ష్యం ముందుంచుకున్న సమయంలో మహిళలకు చట్టసభల్లో 33% సీట్లు రిజర్వ్ చేస్తూ భారత పార్లమెంట్ ఓ బిల్లును ఆమోదింప చేయాల్సి రావడం దురదృష్టకరం. అవకాశాలు లభించినప్పుడు పురుషులకన్నా మెరుగ్గా, అత్యంత ప్రతిభావంతంగా, సాహసోపేతంగా ఏ రంగంలోనైనా పనిచేయగలమని భారతీయ మహిళలు నిరూపిస్తూనే ఉన్నారు. 75 ఏళ్లలో అత్యంత సాహసోపేతంగా పని చేసిన ప్రధాని ఎవరంటే ఇందిరా గాంధీ అని చెప్పక తప్పదు. అగ్రరాజ్యాలను సహితం లెక్కచేయకుండా, తగినన్ని వనరులు, ఆయుధ సంపత్తి లేకపోయినప్పటికీ అమెరికాను ధిక్కరిస్తూ పాకిస్తాన్‌తో తలపడి 1971లో ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చేయగలిగారు.
ఆ విధంగా మత ప్రాతిపదికన దేశాన్ని విభజించిన విధానం తప్పని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులుగా పని చేసిన సుచేత కృపలానీ, నందిని శతపతి, జయలలిత, షీలా దీక్షిత్, మాయావతి, వసుంధర రాజే, మమతా బెనర్జీ వంటివారు సమర్ధవంతమైన నాయకులుగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ రాజకీయాలలో మహిళా ప్రాతినిధ్యం కోసం ప్రత్యేకంగా ఓ బిల్లు తీసుకురావలసి రావడం దేశ నాయకత్వం సిగ్గుతో తలవంచుకోవలసిన అంశం. ముప్పై ఏళ్లుగా అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నా సఫలంకాని ఈ ప్రయత్నం ఇప్పుడు పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ గల పార్టీ అధికారంలో ఉండటంతో ఇప్పుడు సాధ్యమైన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా చెబుతున్నారు. అదే నిజమైతే తొమ్మిదేళ్లుగా అందుకోసం ఎటువంటి ప్రయత్నం చేయకుండా, ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిపి, హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చిందో అన్నది ప్రశ్నార్ధకంగా మారిపోతున్నది. ఇప్పుడైనా వెంటనే మహిళా రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేయకుండా జనాభా గణన సేకరణ, నియోజక వర్గాల పునర్విభజనలతో లింక్ ఏర్పాటు చేసి, కనీసం ఆరేళ్ల వరకు సాధ్యం కాని విధంగా బిల్లు తీసుకు రావడం మహిళలను మోసం చేయడమే కాగలదు.
అందుకే దీనిని ‘పోస్ట్ డేటెడ్ చెక్’ తో పోలుస్తున్నారు. దృఢమైన రాజకీయ సంకల్పం లేదని, ఎన్నికల ముందు హడావుడిగా మహిళలను ప్రసన్నం చేసుకొని, ఏదో విధంగా గెలుపొందాలని ఆత్రుతతో ఈ బిల్లు తీసుకొచ్చారని భావించాల్సి వస్తున్నది. మహిళలను ప్రసన్నం చేసుకోవడం కోసం కొంత కాలంగా పార్టీ లో మూడో వంతు స్థానాలను మహిళలకు బిజెపి కేటాయిస్తున్నది. కానీ ఎన్నికలలో సీట్లు ఇవ్వడంలో మాత్రం ఈ ఫార్ములాను అనుసరించడం లేదు. ఎక్కువగా బిజెపి గెలుపొందడానికి అవకాశం లేని సీట్లు ఇస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. కానీ ఒక రాష్ట్రంలో కూడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడం గమనార్హం.రాజకీయ సంకల్పం ఉంటె ప్రత్యేకంగా చట్టం అవసరం లేదని పశ్చిమ బెంగాల్, ఒడిశాలలోని అధికార పక్షాలు నిరూపిస్తున్నాయి. అక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్న నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులుగా మూడోవంతు మందిని మహిళలనే నిలబెడుతున్నారు. సాధారణ మహిళలను సహితం కీలకమైన నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యేటట్లు వారు చూస్తున్నారు.
సుదీర్ఘ కాలం ఓ మహిళగా కాంగ్రెస్ పార్టీని తన కన్నుసన్నల్లో నడిపించుకొంటున్న సోనియా గాంధీ సహితం అటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు. బిజెపిలో విశేష ప్రజాదరణ పొందిన మహిళానేతగా గుర్తింపు పొంది, ఒంటిచేతితో మధ్యప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన ఉమా భారతిని ముఖ్యమంత్రి పదవి నుండి అర్ధాంతరంగా దించి వేయడమే కాకుండా, కేంద్ర మంత్రి పదవి నుండి కూడా తీసివేశారు. కనీసం గత ఎన్నికల్లో లోక్‌సభ సీటు కూడా ఇవ్వలేదు. ఇక ఆ పార్టీలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వసుంధర రాజేను రాజస్థాన్‌లో పక్కకు నెట్టేయడం కోసం గత ఎనిమిదేళ్లుగా చేయని ప్రయత్నం అంటూ లేదు. ప్రజలతో సంబంధం లేని నాయకులను అందలం ఎక్కిస్తూ, ప్రజాదరణ గల నాయకులను పక్కకు నెట్టివేసి ప్రయత్నాలలో భాగంగా వసుంధరాజెతో పాటు సుష్మా స్వరాజ్‌ను సహితం ఉత్సవ విగ్రహాలుగా మార్చారు.
విదేశాంగ మంత్రిగా అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి గడిచినా ప్రభుత్వంలో మాత్రం ఆమె మాటకు విలువ లేకుండా చేశారు.
చివరకు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా 2019లో ఆమెను మంత్రివర్గం నుండి తప్పించారు. తమిళనాడులో రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుండి వచ్చి, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ప్రజాభిమానం చూరగొంటున్న డా. తమిళసై సౌందరరాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా తీసుకు వచ్చారు. అయితే ఆమె దృష్టి మాత్రం తమిళనాడు రాజకీయాల నుండి మరలడం లేదు. మహిళల ప్రాతినిధ్యం అంటే కుటుంబ సభ్యులు మాత్రమే గుర్తుకు వస్తున్నారు. ప్రజా జీవనంలో క్రియాశీలకంగా ఉండేవారంటే భయపడుతున్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ‘కేంద్ర మంత్రివర్గంలో ఏకైక పురుషుడు ఇందిరాగాంధీ’ అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపాదకుడు ఫ్రాంక్ మోరీస్ రాశారు. ఆమెను సహితం ‘కీలుబొమ్మ’గా పని చేయగలదని భావించి ప్రధానిగా చేశారు. అయితే ఆమె క్రమంగా నిలదొక్కుకొని తిరుగులేని నేతగా ఎదిగారు. మహిళా సాధికారికత అంటే అలంకారప్రాయంగా వారికి ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా సాధ్యం కాదు. నిర్ణయాధికారం వారు భాగస్వాములు కావలి. నేడు మంత్రివర్గాలలో అనేక మంది మంత్రులు ఉన్నప్పటికీ వారి తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలుగుతున్నారా? అయితే నేడు దాదాపు మంత్రులు అందరూ అలంకారప్రాయంగా మారుతూ కేంద్రంలో ప్రధాన మంత్రి కార్యాలయం, రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కార్యాలయం ‘సూపర్ కాబినెట్’ గా మారాయి.
అది వేరే విషయం. సాధారణంగా మంత్రివర్గ సమావేశాలలో మంత్రులు ఎవరైనా, ఏ అంశంపై అయినా తమ అభిప్రాయం చెప్పవచ్చు. కానీ మహిళా మంత్రులు మాట్లాడుతూ ఉంటే ‘మీ శాఖకు కాని విషయం గురించి మీకెందుకు అమ్మా?’ అంటూ అడ్డుకొనేవారంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహిళా మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ఆలోచనతో మొదటగా స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్ లభించింది. పలు రాష్టాలలో 50% వరకు ఈ రిజర్వేషన్లు అమలులో ఉంటున్నాయి.
అయితే రొటేషన్ పద్ధతి మీద రిజర్వేషన్లు ఇస్తుండటం కారణంగా సమర్ధవంతమైన మహిళా నాయకత్వం ఏర్పడకుండా అడ్డుకొంటున్నట్లు స్థానిక సంస్థలలో చూస్తున్నాము. అందుకనే రాజకీయాలలో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు రాజకీయ పార్టీలలో రాజకీయ సంసిద్ధత ఏర్పడనిదే రిజర్వేషన్ బిల్లుల కారణంగా ప్రయోజనం ఉండబోదని స్పష్టం అవుతుంది. పలు రాష్ట్రాల్లో మహిళలు మేయర్, మున్సిపల్ చైర్మన్, సర్పంచ్ వంటి పదవులలో ఉంటున్నప్పటికీ ఆచరణలో అధికారం అంతా స్థానిక ఎంఎల్‌ఎ, మంత్రి, భర్త, కుటుంబం సభ్యులు చెలాయిస్తున్నారు. చివరకు మేయర్ కుర్చీలలో ఎంఎల్‌ఎలు కూర్చొంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుండటం పలు చోట్ల జరుగుతుంది.
ప్రస్తుతం లోక్‌సభలో మహిళా సభ్యుల సంఖ్య 15% ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇదే అధిక శాతం కావడం గమనార్హం. బలమైన ప్రధాన మంత్రిగా పేరొందిన ఇందిరా గాంధీ హయాంలో సహితం అంత మంది మహిళలకు అవకాశం కలగలేదు. మహిళా హక్కుల గురించి గొంతు చించుకొనే వామపక్షాలతో ఇప్పటి వరకు మహిళలు ఎవ్వరు జాతీయ స్థాయిలో కార్యదర్శి పదవి చేపట్టలేదు. సిపిఎం పాలిట్ బ్యూరోలో సహితం కొన్ని ఏళ్ళ క్రితమే ఓ మహిళ ప్రవేశింపగలిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే బిజెపి 43 ఏళ్ళ చరిత్రలో ఓ మహిళను పార్టీ అధ్యక్షురాలిగా చేయలేకపోయింది. ఒక పర్యాయం లోక్‌సభలో పార్టీ నాయకురాలిగా సుష్మా స్వరాజ్‌కు అవకాశం ఇచ్చారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉంటున్నా మమతా బెనర్జీ తప్ప మరెవ్వరూ ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహించలేకపోతున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి సాధనకు రాజకీయాలలో, ప్రజా జీవనంలో మహిళల సమాన ప్రాతినిధ్యం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం జనవరి, 2023 నాటికి కేవలం 31 దేశాలలో మాత్రమే మహిళలు దేశాధినేతలుగా ఉన్నారు.
మంత్రి వర్గాలలో 22.8% మాత్రమే మహిళలు ఉండగా, కేవలం సెహలలో మాత్రమే సగం మందికి పైగా మహిళలు మంత్రులుగా ఉన్నారు. మహిళలు నిర్వహించే శాఖలు సాధారణంగా మహిళా శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, సామాజిక భద్రత వంటివి మాత్రమే. ఇక మహిళా ఎంపిలుగా 1995లో 11% మంది మాత్రమే ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 26.5 శాతానికి పెరిగింది. కేవలం ఆరు దేశాలలో మాత్రమే సగం మందికి పైగా మహిళా ఎంపిలు ఉన్నారు. అవి, రువాండా (61%), క్యూబా (53 %), నికరాగువా (52 %), మెక్సికో (50%), న్యూజీలాండ్ (50 %), యుఎఇ (50) శాతం. ఇక 23 దేశాలలో 40% మంది మహిళా ఎంపిలు ఉన్నాయి. అవి, 13 ఐరోపాలో, 6 ఆఫ్రికాలో, 3 లాటిన్ అమెరికాలో, 1 ఆసియాలో ఉన్నాయి. అంతర్జాతీయంగా 22 దేశాలలో మహిళా ప్రాతినిధ్యం 10% కన్నా తక్కువగా ఉంది. అయితే, స్థానిక సంస్థలలో 136 దేశాల గణాంకాలను పరిశీలిస్తే మహిళలు 34 శాతం ప్రాతినిధ్యం పొందుతున్నారు.