Sunday, November 17, 2024

పెన్షన్ నిరాకరణ పౌరద్రోహమే!

- Advertisement -
- Advertisement -

సుప్రీం కోర్టు నేటి ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు విష్ణు చంద్రచూడ్ తీర్పునిస్తూ పెన్షన్ యజమాని సద్భావంతో ఇచ్చే భిక్ష, బహుమతి, దయతో ఇచ్చే అదనపు డబ్బు కాదు. గతకాల సేవలకు చెల్లించే సొమ్ము. వృద్ధాప్యంలో బాధలకు గురికారాదన్న హామీతో యౌవనంలో నిర్విరామంగా యజమాని కోసం పని చేసిన వారికి సామాజికార్థిక న్యాయాన్నందించే సంక్షేమ పథకం అని సామాజిక స్పృహతో వ్యాఖ్యానించారు. ఈ తీర్పు విశ్రాంత ఉద్యోగికి పెన్షన్ హక్కునిచ్చింది. ప్రభుత్వంపై పెన్షన్ చెల్లింపు బాధ్యతను మోపింది.

ప్రజావసరాలకు, సమాజ ప్రగతికి, దేశాభివృద్ధికి జీవితాలనర్పించినవారు పెన్షనర్లు. పనిలో ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పట్టించుకోరు. వారు దేశ వనరులు, అనుభవాల కొండలు. భావి తరాలకు విలువైన సలహాలను ఇవ్వగల సమాచార జ్ఞానవిజ్ఞాన ఖనులు. ప్రథమ ప్రధాని నెహ్రూ పెన్షనర్లను ఆర్థిక వ్యవస్థ వాస్తవ స్తంభాలని, వారి కృషితో ఆర్థికాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఐక్యరాజ్య సమితి 2021 -30 ని ఆరోగ్య వయోవృద్ధుల దశాబ్దంగా ప్రకటించింది. వృద్ధుల ఆర్థిక, ఆరోగ్య అసమానతలను తగ్గించమని, జీవన స్థాయిని పెంచమని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. ఉద్యోగ విరమణ చేసిన వారికి, పని చేయలేని వికలాంగులకు, వితంతువులకు, నిరాధార వృద్ధులకు, రోగులకు ప్రభుత్వం/ ప్రైవేట్ యాజమాన్యం/ కార్మికుల జీతాల నుండి డబ్బు వసూలుచేసిన ఆర్థిక సంస్థలు ప్రతి నెలా చెల్లించే డబ్బు పెన్షన్. యుద్ధంలో గాయపడిన సైనికులకు పదవీ విరమణకు ముందే ప్రభుత్వం పెన్షన్ చెల్లిస్తుంది. ప్రభుత్వ పెన్షన్ పథకాలలో కార్పొరేట్ ప్రయోజనాలు, పాలకవర్గ రాజకీయ లబ్ధి ఉంటాయి.

భారత పెన్షన్‌కు 166 ఏళ్ల చరిత్ర ఉంది. 1857 సైనిక తిరుగుబాటు తర్వాత భారతీయుల బుజ్జగింపు పనుల్లో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ‘1857 పెన్షన్ వ్యవస్థ’ను ప్రవేశపెట్టింది. జీతం నుండి కొంత సొమ్మును పెన్షన్ నిధికి వసూలు చేసి దాని నుండి పదవీ విరమణ తర్వాత తిరిగి చెల్లించేవారు. దీని లోపాలను సరిదిద్దడానికి 1871 భారత పెన్షన్ చట్టం ద్వారా ఇంగ్లండ్ పెన్షన్ పద్ధతి ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వ దయాపరిధిలో విశ్రాంత ఉద్యోగులకు కొంత పైకం చెల్లించేవారు. గవర్నర్లు, వైస్రాయ్‌ల దయపై పెన్షన్ ఆధారపడేది. దీన్ని 1 జనవరి, 1922 నుండి అమలైన పౌర ప్రాథమిక హక్కుల్లో చేర్చలేదు. ఈ పద్ధతి ఉద్యోగులను నిరుత్సాహపర్చింది. తర్వాత తాత్కాలిక పెన్షన్ సవరణ, కరువు భత్యం ఇచ్చారు. 1881లో పౌర వ్యవస్థల రాయల్ కమిషన్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించింది. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను స్థిరపర్చాయి. ఇవేవీ వృద్ధులకు సార్వజనిక సామాజిక భద్రతను కల్పించలేదు. స్వాతంత్య్రం తర్వాత ప్రైవేట్ రంగ కార్మికులకు భవిష్య నిధిని ఏర్పాటు చేశారు. 1957లో నెహ్రూ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్ ను తప్పనిసరి చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పాటించాయి. 1981లో కుటుంబ పెన్షన్ సాధించబడింది.

4 వ కేంద్ర వేతన సవరణ సంఘం (సిపిసి) పెన్షన్‌ను సవరించాలని సిఫారసు చేసింది. 40 శాతం పెంపుతో పెన్షన్ ను సవరించాలని నాటి కేంద్ర ప్రభుత్వం 5 వ సిపిసిని ఆదేశించింది. 6 వ సిపిసి పెన్షనర్ల వృద్ధాప్యం, అనారోగ్యాలతో పెరిగే ఆర్థిక భారాలకు అనుగుణంగా 80 ఏళ్ళు నిండిన పెన్షనర్లకు, కుటుంబ పెన్షనర్లకు 20 శాతం అదనపు పెన్షన్, 85 ఏళ్ళకు 30 శాతం, 90 ఏళ్ళకు 40 శాతం, 95 సంవత్సరాలకు 50 శాతం, 100 ఏళ్లు నిండినవారికి 100 శాతం పెన్షన్ సిఫారసు చేసింది. పాత పెన్షన్ పథకం ప్రకారం ప్రభుత్వమే పెన్షన్ చెల్లించేది. ఉద్యోగి జీతం నుండి కొంత సొమ్మును కోసేవారు కాదు. వాజపేయి ప్రభుత్వం అత్యవసరాదేశం (ఆర్డినెన్స్) తో ఈ పథకాన్ని రద్దు చేసింది. 1జనవరి, 2004 నుండి భాగస్వామ్య (జీతంలో కొంత సొమ్మును పెన్షన్ కోసం జమ చేయడం) పద్ధతిలో కొత్త పెన్షన్ ను ప్రవేశపెట్టారు. 2005లో కాంగ్రెస్ అధీన యుపిఎ ప్రభుత్వం పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించింది.

మన దేశంలో 1983 నుండి ప్రతి ఏడాది డిసెంబర్ 17 ను పెన్షనర్ల దినోత్సవంగా ఉద్యోగులు, పెన్షనర్లు జరుపుకుంటారు. 1982లో ఇదే రోజున విశ్రాంత ఉద్యోగుల గౌరవ మర్యాదలకు హామీనిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పును ప్రకటించింది. ఈ దినం ప్రపంచ రికార్డుల గిన్నీస్ పుస్తకంలో నమోదయింది. పదేళ్ళపాటు కోర్టులో పోరాడి 17 డిసెంబర్ 1982 న సుప్రీం కోర్టు తీర్పుతో పెన్షనర్ల జీవితాలను కష్టాల నుండి గట్టెక్కించిన కీ.శే. ధరం స్వరూప్ నకారాను ఈ రోజు పెన్షనర్లు గుర్తు చేసుకుంటారు. పెన్షన్ కోసం కోర్టుల్లో పోరాడిన అనుభవం గల వినియోగదారుల క్రియాశీల కార్యకర్త కీ.శే. హరి దేవ్ శౌరి ధ్రువీకరణ పత్రాల తయారీలో నకారాకు సహకరించారు. నకారా భారత రక్షణ ఆడిట్ – అకౌంట్స్ అధికారి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారుగా 1972 లో పదవీ విరమణ పొందారు. ఇంతటి ఉన్నతస్థాయి అధికారికే పెన్షన్ పెంపు అమలు తిప్పలు తప్పలేదు. విజ్ఞుడు, వెసులుబాటు కలవాడు కనుక కోర్టుకెక్కి హక్కును సాధించారు.

సుప్రీం కోర్టు నేటి ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ తండ్రి నాటి ప్రధాన న్యాయమూర్తి యశ్వంతరావు విష్ణు చంద్రచూడ్ తీర్పునిస్తూ పెన్షన్ యజమాని సద్భావంతో ఇచ్చే భిక్ష, బహుమతి, దయతో ఇచ్చే అదనపు డబ్బు కాదు. గతకాల సేవలకు చెల్లించే సొమ్ము. వృద్ధాప్యంలో బాధలకు గురికారాదన్న హామీతో యౌవనంలో నిర్విరామంగా యజమాని కోసం పని చేసిన వారికి సామాజికార్థిక న్యాయాన్నందించే సంక్షేమ పథకం అని సామాజిక స్పృహతో వ్యాఖ్యానించారు. ఈ తీర్పు విశ్రాంత ఉద్యోగికి పెన్షన్ హక్కునిచ్చింది. ప్రభుత్వంపై పెన్షన్ చెల్లింపు బాధ్యతను మోపింది. విశ్రాంత ఉద్యోగి గౌరవంగా బతకడానికి సరిపడా పెన్షన్ ను ఇవ్వాలంది.

ఈ తీర్పుతో నాటి 20 లక్షల పెన్షనర్లు ప్రయోజనం పొందారు. 31.3.2023 నాటికి 67.95 లక్షల విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ హక్కుగా వస్తోంది. ప్రభుత్వం పెన్షన్ భారాన్ని భరించలేదని 75 ఏళ్లకు పెన్షన్ రద్దు చేయాలని నాటి కేంద్ర మంత్రి వాదించారు. 1984 లో 4 వ కేంద్ర వేతన సవరణ సంఘం (సిపిసి) సిఫారసుల్లో ఈ తీర్పు చోటు చేసుకుంది. దీని ప్రకారం వేతన సవరణతో పెన్షన్ సవరణ జరగాలి. కరువు భత్యం (డిఎ)తో పాటు కరువు ఉపశమనం (డిఆర్) పెరగాలి. జీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేటి నేపథ్యంలో పెన్షన్ సవరణ అనివార్యం. పెన్షన్ సవరణ నిరాకరణ పౌరద్రోహం. ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలను, సేవలను నిజీకరించాయి.

ప్రజా సంపదలను ఆశ్రిత కార్పొరేట్ సంస్థలకు కారుచవకగా అమ్మేస్తున్నాయి. పెన్షన్‌ను రద్దు చేసి భాగస్వామ్య పెన్షన్ పద్ధతిని అమలు చేస్తున్నాయి. పదవీ విరమణ సమయంలో ఒకేసారి కొంత మొత్తాన్ని చెల్లించే భవిష్యనిధి, గ్రాచుయిటి, నెలనెలా కొంత సొమ్మును చెల్లించే పెన్షన్ పథకాలను అమలు చేస్తున్నారు. ఉద్యోగుల భవిష్య భద్రతకు ముప్పు వాటిల్లింది. మోడీ ప్రభత్వం 7 ఏళ్ల నుండి బిఎస్‌ఎన్‌ఎల్‌లో పెన్షన్‌ను సవరించలేదు. నేటి ఉద్యోగులు భవిష్యత్తు పెన్షనర్లు. పెన్షన్ చెల్లింపు, సవరణ నిరసనల్లో వారూ పాల్గొనాలి. అందరూ అసంఘటిత కార్మికులకు మద్దతు పలకాలి. ప్రభుత్వాలు ఆదర్శ యాజమానులుగా వ్యవహరించాలి. సమాజ నిర్మాణంలో, దేశాభివృద్ధిలో శ్రామికుల కృషిని గుర్తించాలి. ప్రజాధనం నుండి పదవులలో, పెన్షన్‌లో తాము పొందుతున్న ప్రయోజనాలను బేరీజు వేసుకోవాలి. ప్రభుత్వ విధానాల తప్పులకు ఉద్యోగులను, పెన్షనర్లను గురి చేయరాదు.

సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News