Wednesday, January 22, 2025

భారత్‌లో 5 శాతం పెరిగిన తలసరి కర్బన ఉద్గారాలు

- Advertisement -
- Advertisement -

అయినా ప్రపంచ తలసరిలో సగమే
అగ్రస్థానంలో అమెరికా

దుబాయి: దేశంలో తలసరి కర్బన ఉద్గారాలు 2022లో 5 శాతం పెరిగి 2 టన్నులకు చేరుకున్నప్పటికీ ప్రసంచ సగటుతో పోలిస్తే ఇది ఇప్పటికీ సగమే ఉందని మంగళవారం ఇక్కడ విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో కూడిన గ్లోబల్ కార్బన్ పాకరజెక్టు ఈ నివేదికను విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతివ్యక్తీ 14.9 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తున్నాడు. అమెరికా తర్వాతి స్థానాల్లో రష్యా(11.4 టన్నులు), జపాన్ (8.5), చైనా(8), యూరోపియన్ యూనియన్(6.2) ఉన్నాయి. ప్రపంచ తలసరి సగటు4.7 టన్నులుగా ఉంది.

పారిశ్రామిక విప్లవం తర్వాత 1850 2022 మధ్య కాలమంతా కూడా అమెరికా కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేయడంలో ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉంటోంది. ఈ అన్ని సంవత్సరాల్లో కలిపి అమెరికా విడుదల చేసిర కార్బన్ డయాక్సైడ్ మొత్త కలిపి 115 గిగాటన్నులు అంటే మొత్తం ప్రపంచం విడుదల చేసిన కార్బన్ డయాక్సైడ్‌లో 24 శాతం ఉంది. 80 గిగా టన్నులతో(17 శాతం), యూరోపియన్ యూనియన్ రెండో స్థానంలో, 70 గిగా టన్నులతో(15 శాతం) చైనా మూడో స్థానంలో ఉన్నాయి. 1850నుంచి ఇప్పటిదాకా భారత్ 15గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసింది. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు విడుదల చేసిన జాబితా ప్రకారం 2021లో భారత దేశంలో తలసరి కార్బన్ డయాక్సైడ్ విడుదల 5.1 శాతం పెరిగి 2 టన్నులకు చేరుకుంది.

అయితే 2022లో చైనా, అమెరికా తర్వాత అతి పెద్ద కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేసిన మూడో దేశంగా భారత్ ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొత్తం ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ విడుదలలో 31 శాతంతో చైనా అగ్రస్థానంలో ఉండగా 17 శాతంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. భారత్‌లో ఇది 8 శాతంగా ఉంది. కాగా మొత్తం ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ విడుదలలో యూరోపియన్ యూనియన్ వాటా7 శాతం ఉండగా , రష్యా 4 శాతం, జపాన్ 3 శాతం ఉంది. 2022లో భారత్‌లో కార్బన్ డయాక్సైడ్ విడుదల సగటున 8.2 శాతంపెరిగింది.

బొగ్గుద్వారా అత్యధికంగా 9.5 శాతం పెరగ్గా, చమురు ద్వారా 5.3 శాతం, సహజవాయువు ద్వారా 5.6 శాతం. సిమెంట్ ద్వారా 8.8 శాతం పెరిగినట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడం, కొత్తగా ఏర్పాటయిన పునరుత్పాదక(సౌరశక్తి, పవన శక్తి) ఇంధన సామర్థ్యం డిమాండ్‌ను తీర్చగలిగే స్థాయిలో లేకపోవడం కారణంగా బొగ్గు వినియోగం భారీగా పెరిగిందని, ఫలితంగా ఈ రంగం ద్వారా కార్బనడయాక్సౌడ్ విడుదల కూడా ఆ మేరకు పెరిగినట్లు వారు పేర్కొన్నారు.

2022 ఏడాది చివరి నాటికి ప్రపంచ దేశాలు 36.8 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణంలోకి కుమ్మరించాయని, గత ఏడాదితో పోలిస్తే ఇది 1.1 శాతం ఎక్కువని ఆ నివేదిక తెలిపింది. 2030 నాటికి కర్బన ఉద్గారాలను43 శాతం మేర తగ్గించడానికి, అలాగే భూతాపాన్ని 1.5 సెల్సియస్‌ల మేర తగ్గించడానికి ఒక కచ్చితమైన ప్రణాళికను రూపొందించడానికి దుబాయిలో ప్రపంచ దేశాల మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ నివేదిక వెలువడడం గమనార్హం. ఈ బృందంలో యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, సిఇసిఆర్‌ఓ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిసెర్చ్, మ్యూనిచ్‌కు చెందిన లుడ్విగ్‌మ్యాక్సిమిలన్ యూనివర్సిటీతో పాటుగా మరో 90 సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News