Monday, November 25, 2024

 సామాజిక సంఘీయం

- Advertisement -
- Advertisement -

India politics story in Telugu

కమ్యూనిజాన్ని రాజకీయ కమ్యూనిజం, సామాజిక కమ్యూనిజంగా విభజించారు మార్త హర్నెకర్. 18.01.1937న చిలీలో పుట్టిన ఈమె మార్క్సిస్టు మేధావి, మనస్తత్వ, సామాజిక శాస్త్రవేత్త, రచయిత. క్యూబా ప్రవాసంలో ఆ సోషలిస్టు, మార్క్సిస్టు ప్రభుత్వ సలహాదారు. 15.06.2019న కెనడాలో మరణించారు. ఈమె కమ్యూనిజం విభజన కాషాయ సంఘీయానికీ వర్తిస్తుంది. సంఘ్ సంస్థలకు సంఘ్ తాత్విక మాతృక. హిందుత్వ స్థాపన, పరమత శూన్యీకరణ దాని ప్రధాన లక్ష్యాలు. సంఘ్ సభ్యులుకాని హిందు వాదులూ సామాజిక సంఘీయం ఆచరిస్తారు. కమ్యూనిజం సమాజ నిర్మాతల, మతతత్వం సమాజ వినాశకుల ఉత్పత్తి కేంద్రాలు.

ఆధునిక రాజకీయం: పార్టీ సభ్యత్వంతో పూర్తికాల విప్లవకారులుగా పని చేసేవారు రాజకీయ కమ్యూనిస్టులు. సభ్యులు కాక పోయినా కమ్యూనిస్టు పార్టీ బలపడాలనే కోరికతో సహాయ సహకారాలు అందించేవారు సామాజిక కమ్యూనిస్టులు. వీళ్ళ సంఖ్య నేడు తగ్గింది. విద్యార్థి సంఘ ఎన్నికల నిషేధం, చైతన్య కార్యక్రమాలు తగ్గటం, కమ్యూనిస్టుల చీలికలు దీనికి కొన్ని కారణాలు. పాలక పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయి. దీర్ఘకాల ప్రయోజనాలు బలిపెట్టి స్వల్పకాల ప్రయోజనాలు చేపడుతున్నాయి. రాజకీయలబ్ధి పొందుతున్నాయి. పథకాల అవకతవకలతో ఆర్థికంగా బలపడుతున్నాయి. పాలకులు ప్రజలను కులమతాలతో విడదీస్తున్నారు. ప్రయోజనాల కోసం రాజకీయులు పాలక పార్టీకి మారుతున్నారు. దోపిడీ సాగిస్తున్నారు. అమాయక ప్రజలు కసాయి గొర్రెల్లా పెట్టుబడిదారీల స్వార్థానికి బలవుతున్నారు.

రాజకీయ సంఘీయం: భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య సంస్థలన్నీ ప్రధాని ఆధీనమయ్యాయి. అంగరాజ్యాలయ్యాయి. ప్రభుత్వ సంస్థల్లో ఇంత పిరికితనం, అవకాశవాదం మునుపెన్నడూ లేవు. ప్రభుత్వాధినేత కనుసన్నల్లో మెలిగేవారు దేశాధినేతలయ్యారు. కోవింద్‌ను రాష్ట్రపతిని చేసి పీడిత దళితులను బురిడీ కొట్టించారు. మోడీ ప్రధాన స్రవంతి మాధ్యమాలను లెక్కచేయరు. అంబానీల మాధ్యమాలు పాలకపక్షమే. సంఘ్ ప్రధాని, మంత్రుల, ముఖ్యమంత్రుల, అధికారుల మణికట్ల నిండా రంగుదారాలే. సంఘీయులు కాని రాజకీయులూ మెజారిటీ మతస్థుల ప్రాపకం కోసం ఇలాంటి వేషాలు వేస్తారు. సిద్ధాంతకర్తలకూ కొంత సహజాత ఛాదస్తం ఉంటుంది. జన్మసిద్ధ భావాలు నరనరాన నాటుకొని ఉంటాయి. సమస్యల్లో కార్మిక సంఘం పరిష్కార కేంద్రంగా ఉంటుంది. సమస్య తీరగానే అవకాశవాదం తలెత్తుతుంది. సిద్ధాంత సమరశీలురు కూడా కులమతాలతో విడిపోతారు.

మత పార్టీల సంగతి చెప్పనక్కరలేదు. మతమౌఢ్యం తలకే కాదు. శరీరమంతా వ్యాపించింది. మత పాలన నియంతృత్వంగా మారుతుంది. బిజెపి ప్రభుత్వం దళితులు, ముస్లింలపై తప్పుడు కేసులు బనాయించింది. హిందు మతోగ్రవాదులు, గోరక్షకులపై కేసులు ఎత్తేసింది. మార్చి, 2016లో కురుక్షేత్రలో పశు రవాణాదారులపై, గో గూండాల దాడిపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు, శిక్షపడుతుందన్న భయంలేని గోరక్షకులు ఘోర నేరస్థులుగా మారారు. వీరికి రాజకీయుల, పోలీసుల, అధికారుల అండదండలున్నాయి’ అని వ్యాఖ్యానించింది. దేశంలో పోలీసులు, న్యాయవాదులను అనుకూలంగా మార్చుకున్నామని మంగళూరు బిజెపి పూర్వ ఎం.ఎల్.ఎ. కె.జయరామశెట్టి అన్నారు.

సామాజిక సంఘీయం: మతాచారులు ప్రచారానికి మతగుర్తులు ధరిస్తారు. గడ్డాలు, టోపీలు, శిలువలు, తాయత్తులు, మత పుస్తకాలు, బొట్లు, విభూతులు, నామాలు, ముంజేతి రంగుదారాలు, జాతక ఉంగరాలు, ప్రత్యేక రంగు ఆకారాల దుస్తులు ఈ గుర్తుల్లో కొన్ని. ఇళ్ళలో ఉండాల్సిన దేవుళ్ళను బజారుకు ఈడ్చారు. మానవత్వం మరిచారు. సంఘ జీవిగా అవసరాలు తీర్చుకుంటున్న మనిషి వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆధునిక సాంకేతికుల చేతులకూ రంగు దారాలుంటాయి. పూజారులు చెప్పినట్లు తలలు వంచి భావజాల బానిసలయ్యారు. సంపన్నుల సంపద పెరిగితే వారి మోచేతి నీళ్ళు పేదలకు అందుతాయని (ట్రికిల్ డౌన్ థియరీ) కార్పొరేట్ల ఆర్థికవేత్త, సంపన్నుల ప్రధాని మన్ మోహన్ సింఘ్ సిద్ధాంతం.

ఈ మోచేతి నీటి నియమం దేశ ఆర్థిక వ్యవస్థలో అమలు కాలేదు. కాని వలస జీవుల కుటుంబాల్లో అమలయింది. మేము అమెరికా విధానాలకు వ్యతిరేకం కాదన్న బిజెపి సూత్రాన్ని నేర్పింది. హిందుత్వ ఛాందస న్యాయమూర్తులు, అధికారులు, పాత్రికేయులు సంఘ్ పక్షపాతులే. చచ్చిన ఆవు చర్మం వలుస్తున్న సమాచారం పోలీసులే గోగూండాలకందించారు. దాడులు చేసిన వారిని రక్షించారు. సంఘీయ నేరస్థులపై కేసులు పెట్టరు, అరెస్ట్ చేయరు. స్వయంప్రకటిత గోరక్షక బృందాలతో పోలీసులు కుమ్మక్కయ్యారు’ అని గుజరాత్ ముఖ్య కార్యదర్శి జి.ఆర్. గ్లోరియా అన్నారు. హిందూ జిహాదీల ఆధీనంలోని కార్పొరేట్ల మాధ్యమాలు బిజెపికి వీర విధేయతను, పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నాయి. వార్తలను వక్రీకరిస్తున్నాయి. ‘8-30 మధ్య వయసు పిల్లలను విద్యార్థులుగా స్వీకరిస్తాము. మానసిక శిక్షణనిస్తాము. గీత బోధిస్తాము. పునర్జన్మ ఉంటుంది, చావుకు భయపడద్దని ఉద్బోధిస్తాము. 2014 ఎన్నికల్లో మోడీని ప్రధానిని చేసింది, ఆయన అభివృద్ధి కాదు. మోడీ హిందుత్వ ప్రతిరూపం. భారత ప్రభుత్వమే మా ధర్మసేనకు మద్దతునిస్తుంది.

నిధులు సమకూర్చుతుంది’ అని న్యాయవాది, అఖండ భారత మోర్చా ఉత్తర ప్రదేశ్ సమన్వయకర్త, హిందూ స్వాభిమాన్ జాతీయ అధ్యక్షురాలు, విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం ‘దుర్గా వాహిని’ సభ్యురాలు చేతనా శర్మ అన్నారు. ‘అఖరాల పేరుతో రహస్య శిబిరాలు నడుపుతాము. పిల్లలకు తుపాకుల ఉపయోగం, రణ విద్య, యుద్ధకళల్లో శిక్షణ ఇస్తాము. ఐ.ఎస్.ఐ.ఎస్. లాంటి ఉగ్రవాద సంస్థ హిందువులకూ అవసరం. ఏకైక పరిష్కారం హిందూ రాజ్యమే’. ఘజియాబాద్ జిల్లా బంహేత గ్రామ అఖరాల నిర్వాహకుడు అనిల్ యాదవ్ అన్నారు. సెక్టర్ 12, నోయిడాలో ఆర్.ఎస్.ఎస్. నడిపే సరస్వతి శిశుమందిర్ లో యువకులకు యుద్ధ విద్యలు, కరాటే నేర్పుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుండి 15 -25 ఏళ్ల 400 మంది పిల్లలు శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ ఆర్.ఎస్.ఎస్. మేధోమథన తరగతుల్లో మంచి భారతీయులకంటే మంచి హిందువులను తయారు చేయాలన్నది మా తపన’ అని మీరట్ భజరంగదళ్ రాష్ట్ర నిర్వాహకుడు బాలరాజ్ దుంగర్ అన్నారు. శిక్షణాలయంలో గోరక్షణ అవసరం, విధానం, గోహింసకులను శిక్షించే పద్ధతులు నేర్పుతారు. తీవ్రవాదిని ముస్లిం దుస్తు ల్లో ప్రదర్శిస్తారు. దుర్గా వాహిని శిక్షణాలయంలో బ్రైన్ వాష్ చేయబడ్డ హిందు బాలిక, ‘ఆయుధ ప్రయోగం నేర్చుకున్నాము. జనాలను చంపుతాము’ అని ఢిల్లీలో జన్మించిన కెనడా చిత్ర నిర్మాత నిశా పాహుజాతో అన్నది. ఇక్కడ బాలికల మెదళ్ళు మార్చే పద్ధ్దతులు, ముస్లింలు, క్రైస్తవుల పట్ల నేర్పుతున్న గుడ్డి వ్యతిరేకతను, అసహ్యాన్ని చూసి, రక్తాన్ని మరిగించే హిందూవాద, ముస్లిం వ్యతిరేక నినాదాలను విని నిశ దిగ్భ్రాంతికి గురయ్యారు.

 ప్రత్యామ్నాయం: భారత రాజకీయ పార్టీలు లౌకికత్వాన్ని నీరుగార్చాయి. సమాజంలో లౌకికత్వం మాయమైంది. పరమతాల వెలివేతకు, కాషాయ విషం చిమ్మడానికి హిందుత్వ రాజకీయాలకు అవకాశాలు దొరికాయి. అవకాశవాదం, అధికార దాహంతో కొందరు దళిత, ఆదివాసి, ముస్లిం, క్రైస్తవ మైనారిటీ రాజకీయులు తమ తాత్విక వ్యతిరేక బిజెపిని సమర్థించారు. సాటి భారతీయుల కష్టాలు గమనించి ఈ నాయకులు తమ రాజకీయ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. బుద్ధి జీవులు ప్రజల అనుమానాలు తీర్చాలి. విషయాలు వివరించాలి. పేదరిక కారణాలు తెలపాలి. కట్టుకథల నుండి అమాయకులను కాపాడాలి. యువతను మత్తుముక్తం చేయాలి. దార్శనిక భావితరాన్ని నిర్మించాలి. ప్రజలను పోరాటాలకు సమాయత్తపరచాలి. ప్రతిఘటనోద్యమాలు నిర్మించాలి. పోరాటాలకు ఊతమివ్వాలి. ప్రత్యామ్నాయ పార్టీల గమ్యం ఒకటే. మార్గాలే వేరు. మార్గాంతరాలను మరచి గమ్యసాధనకు కలిసి పని చేయటమే నేటి ప్రత్యామ్నాయం.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News