Saturday, December 21, 2024

దేశాన్ని వెంటాడుతున్న పేదరికం

- Advertisement -
- Advertisement -

Global Poverty severe with corona

మన దేశంలో రోజు రోజుకీ పేదరికం, నిరుద్యోగం ప్రధానంగా పెరుగుతున్నాయి. ప్రతి మనిషి ఆదాయ మార్గాలు మాత్రమే పేదరికానికి ప్రధాన కారణం కాదు, ఆహారం, ఇల్లు, భూమి, ఆరోగ్యం పేదరికాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవినీతి, కులతత్వం, ధనికులలో అధిక- తక్కువ, ఉద్యోగ కొరత, నిరక్షరాస్యత, భయంకరమైన వ్యాధులు, మత్తు పదార్థాల వాడకం, మందు, సిగరెట్లు, గుట్కా, కొకైన్, తంబాకు, డ్రగ్ లాంటి విచ్చల విడిగా వాడకంతో దిగువ మధ్యతరగతి యువకులు ఆదాయం కంటే తలసరి ఖర్చులు ఎక్కువై పేదరికంలోకి వెళ్తున్నారు. దీనికి తోడు యువత ఆన్‌లైన్ బెట్టింగ్, అధిక వడ్డీతో ఆన్‌లైన్ లోన్‌లు మనిషిని మానసికంగా కుంగదీసి ఆత్మహత్యకు కారణాలు అవుతున్నారు.

దేశంలో ప్రతి ఏటా కోటీశ్వరుల జాబితా పెరిగిపోతోందని ప్రగల్భాలు పలికినా, ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అమ్మకాలు పెరిగిపోతున్నాయని గొప్పలు చెప్పినా, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలు లెక్కలు వేసినా పేదరికం మాత్రం ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా రెండు పూటలా తిండి లేక అర్ధాకలితో లక్షలాది కుటుంబాలు అనారోగ్యానికి గురి అవుతుండగా నేటికీ ఆకలి చావులు అక్కడక్కడ సంభవించడం అత్యంత దురదృష్టకరం. భారత దేశంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం కూడా ఆశాజనకంగా లేదు. ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని కోట్ల సబ్సిడీలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు వెచ్చించినా రైతుల పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. ఏడాదికేడాదికి మరింత ఊబిలోకి కూరుకుపోతున్నారు.

Global Poverty severe with corona

అయితే కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి భారత్‌లో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించింది కానీ అది సాధ్యం కాలేదు. వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచామని, ఏటా రూ. 1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి వెచ్చిస్తున్నాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నా అవి పేపర్ మీద వున్న లెక్కలు తప్పితే నిజజీవితంలో భిన్నంగా వున్నవి అనేది వాస్తవం. వ్యవసాయ కూలీల పరిస్థితి కూడా దారుణంగా వుంది. పల్లెలు వదిలి నగర బాటపడుతుంటారు. నగరీకరణ ఊహించని విధంగా పెరిగిపోతున్నది. ఫలితంగా మురికివాడల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శుభ్రమైన నీరు అందకపోవడం, పారిశుద్ధ్యం లోపాలు, తదితర సమస్యలు ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీస్తున్నాయి.

భారత దేశంలోనే ఎక్కువ సంఖ్యలో పేదలు ఉన్నట్టు ఐరాస ప్రకటించింది. అయితే ఇండియాలో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారో అంతే కంటే ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. కనీసం వారు తిండికీ, గుడ్డకు నోచుకోని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు మనిషికి సరిపడే ఆహారం దొరికేది దాంతో సుఖంగా బతికేవారు. కాని ప్రస్తుత రోజుల్లో అవేమీ లేవు. పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరపాలని 1992 డిసెంబర్ 22న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికాన్ని అంతమొందించడమే. పేదరికంలో నివసిస్తున్న ప్రజల క్రియాశీల భాగస్వామ్యం ద్వారా వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి చేసే ప్రయత్నాన్ని ఈ రోజు ప్రోత్సహిస్తుంది. అలాగే, వారికి గౌరవప్రదమైన జీవితం అందించేందుకు కృషి చేస్తున్నారు.ఈ సందర్భంగా వివిధ దేశాలు పేదరిక నిర్మూలనకు చేపడుతున్న చర్యలు, అభివృద్ధి, వివిధ కార్యక్రమాలు, పథకాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మంది మానవ హక్కుల కోసం ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఉద్యమాన్ని ఎటిడి ఫోర్త్ వరల్డ్ వ్యవస్థాపకుడు జోసెఫ్ వ్రెంకీ ప్రారంభించారు.

ఇప్పుడు భారత దేశాన్ని వెంటాడుతున్న సమస్య పేదరికమనే చెప్పాలి! ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పిస్తాం అని ఆహార భద్రతా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ప్రకారం రాష్ట్రంలో బిపిఎల్ కార్డులున్న ఒక్కొక్క కుటుంబానికి 6 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు తప్ప ఇతర పథకాలు సరిగా అమలు చేయడం లేదు. పట్టణ ప్రాంతంలో 60 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుండగా, మిగిలిన కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అయితే కేవలం ఆహార భద్రత కార్డులు మాత్రమే ప్రజల ఆకలిని తీర్చలేకపోతున్నాయి.

వారి జీవన ప్రమాణాలు పెరగకపోవడం, పూర్తి స్థాయిలో ఉపాధి లభించకపోవడం వంటి కారణాలు పేదవారిని మరింత పేదలుగా చేస్తున్నాయి. గ్రామీణ భారతాన్ని అనారోగ్యం పట్టిపీడిస్తున్నది. విష జ్వరాలు, రక్తహీనతతో పాటు గుండె జబ్బులు, కంటి వ్యాధులు, ఒకటేమిటి సకల రోగాలు అనేక మందిని బలి తీసుకుంటున్నాయి. ఇంకొకపక్క కనీసం ప్రమాణాలు లేని వైద్యులు, ఆస్పత్రులు పుట్టగొడుగు ల్లా పుట్టుకొచ్చాయి. వచ్చీరాని వైద్యంతో ఆ వైద్యులు చేస్తున్న చికిత్స చివరకు ప్రాణాలు సైతం పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికీ త్రాగు నీరు, విద్య, వైద్యం, రవాణా వ్యవస్థ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, హెచ్‌ఐవి లాంటి వ్యాధుల మీద అవగాహన కల్పించకపోవడంతో మూఢ నమ్మకాలకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరి నిమిషంలో కార్పొరేట్ వైద్యానికి వెళ్లి అప్పులు మూటగట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడంతో కూలీలకు పని దొరకడం లేదు. దీని వల్ల మరింత వలసలు పెరిగిపోతున్నాయి.

ఉపాధి నిధులు దారి మళ్లించటం, రాజకీయ నాయకులు మితిమీరిన జోక్యం చేసుకోవటం, యంత్రాలతో పనులు చేస్తుండడంతో కూలీలకు పని దినాలు తగ్గిపోతున్నాయి. పేదరిక నిర్మూలన అని చెప్పి పేదల కోసం కేటాయించిన చట్టాన్ని నిర్వీర్యం చేయడంతో పేద కూలీలు కడుపు నింపుకోలేకపోతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ వారికి కనీస వసతులు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నాయి. ఈ వాస్తవాలన్నింటిని పక్కనపెట్టి పేదరికాన్ని పారద్రోలామని, దారిద్య్రం తగ్గిపోతున్నదని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమో పాలకులు విజ్ఞతతో ఆలోచించాలి. పేదరికాన్ని పరిహాసం చేయడం ఏ మాత్రం ధర్మం కాదు. ఓట్ల కోసం, సీట్ల కోసం లక్షలాది కోట్లు వెచ్చిస్తూ అర్థం లేని లెక్కలు చెప్తూ కాలం గడిపినంత కాలం సమస్యకు పరిష్కారం దొరకదు. ఎన్నికలు రాగానే దళితుడు ఇంట్లో భోజనం, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల మీద వరాల జల్లు కురిపించడం మామూలే! కానీ వాటితో పేదరికాన్ని నిర్మూలించలేము అని గ్రహించాలి.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరించిన సరళీకరణ ఆర్థిక దివాలాకోరు విధానాలు, కొవిడ్ సంక్షోభ సమయంలో దాని అసమర్థ నిర్వాకం ప్రజల పాలిట పెనుశాపంగా మారాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తోంది. భూమి, ఖనిజాలు, గ్యాస్, స్పెక్ట్రమ్ వంటి దేశ సహజ వనరులను లూటీ చేసుకోవడానికి అనుమతించింది. ఫలితంగా కార్పొరేట్ కుటుంబాలు, ప్రైవేటు కంపెనీలు అసాధారణ రీతిలో లాభాలు సంపాదిస్తున్నాయి. పైగా దేశాన్ని ముందుకు తీసుకుపోతామంటూ కల్లబొల్లి కబుర్లు చెబు తూ లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను నష్టాల పేరుతో కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు పరిశ్రమ. వాస్తవానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందల్లా ఏదన్నా ఉందంటే దేశం ప్రజల సహజ వనరులను కొద్ది మంది బడా పెట్టుబడిదారులకు స్వాధీనపరచడమే.

సంపన్నులకు వర్తించే పన్ను రేట్లు పెంచడం ద్వారా గానీ, పన్ను ఎగవేతపై పెద్దపెట్టున విరుచుకుపడటం ద్వారా గానీ ఆదాయం పెంచుకోడానికి వీలున్నప్పటికీ అలాంటి చర్యలేమీ తీసుకోలేదు అని చెప్పాలి. దారిద్య్ర రేఖకు దిగువన చాలా మంది ఉండగా వారిలోనూ అత్యంత దయనీయ స్థితిలో జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్న వారిదీ పెద్ద సంఖ్యే! వారికంటూ ఆస్తులు లేకపోవడం, పెట్టుబడిలేకపోవడం, ఉపాధి అవకాశాలే కనిపించకపోవడం వంటివి జీవన ప్రమాణాల్ని శాసిస్తున్నాయి. పేదల్లో 46 శాతం మంది నిరక్షరాస్యులని, మరో 25 శాతం మంది ప్రాథమిక స్థాయిలోనే చదువు నిలిపివేసిన వారని ఓ అధ్యయన నివేదిక చెబుతోంది. తాగునీటి సదుపాయం ఉన్నవారు తక్కువే. పౌష్టికాహార లోపం, పరిసరాల అపరిశుభ్రత వారి ఆయుష్షును తగ్గిస్తోంది. జీవనోపాధి కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నా జీవితాలు పెద్దగా మెరుగవడం లేదు. ఒక అధ్యయనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు సగటున మూడు వేల రూపాయలు ఖర్చు చేసే కుటుంబం వలస వెళ్లిన హైదరాబాద్ వంటి ప్రాంతంలో దాదాపు పది వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే వలసల తర్వాత రాబడి మూడింతలు పెరిగినా ఇదివరకటి తరహాలోనే బతుకుతారు తప్ప జీవన ప్రమాణాలేమీ మెరుగుపడవు. ఇక పట్టణ ప్రాంతాలదీ మరో వేదన. సంపద, ఉపాధి అవకాశాలు అక్కడ కొంచెం మెరుగ్గా ఉన్నా ఆర్థిక అంతరాలు మరింత దారుణం. ప్రప్రథమంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని దారిద్య్రాన్ని నిర్మూలించటం. అందుకు ఉపాధిని కల్పించడం. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చుకోవడం.

సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు సాధికారిక కార్యక్రమాలకు నాంది పలకడం. ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయడం. అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచడం. లింగ వివక్ష లేకుండా మహిళలకు స్వావలంబన కల్పించడం. భారత్ వంటి దేశాల్లో తప్పనిసరిగా వ్యవసాయానికి తగిన ప్రాధాన్యమివ్వటం. ఈ రంగంలో సాధించే అభివృద్ధి వల్ల రెండింతలు పేదరికం తగ్గుతుందనేది ఆర్థికవేత్తల అంచనా. నైపుణ్యాల కల్పన, యువతకు విరివిగా ఉపాధి అవకాశాల కల్పన. దీంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడం, పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి పెట్టడం, ఉపాధిపై దృష్టి, విద్య, ఆరోగ్య వ్యవస్థలను అందరికీ అందుబాటులోకి తేవడం.. పేదరికంపై పోరులో చెప్పుకోదగిన ముందడుగులు. అసమానతలను రూపు మాపేందుకు ఆర్థిక విధానాల్లో సమూల మార్పు రావాలి. ప్రైవేటు, కార్పొరేట్ల పక్షాన కాకుండా పేదల, పీడితుల పక్షాన ఆర్థిక విధానాలు ఉండాలి. ప్రధానంగా కుల, మత, లింగ భేదాల మధ్య అంతరాలు పోవాలి. అంతేకాకుండా సమష్టి పని విధానం, సమాన పంపిణీ జరగాలి.. అప్పుడే దేశం నుంచి పేదరికాన్ని, అసమానతలను తరిమికొట్టడం సాధ్యం!

-పీలి కృష్ణ
7801004100

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News