Monday, December 23, 2024

ప్రతి 12 ఏండ్లకు జనాభా రెట్టింపు

- Advertisement -
- Advertisement -

BC population in india

2022 ప్రపంచ జనాభా దినం సందర్భంగా యుయన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ సోషల్ అఫేర్స్, జనాభా విభాగం విడుదల చేసిన ‘ఐరాస జనాభా అంచనా – 2022 (యుయన్ పాప్యులేషన్ ప్రాస్పెక్ట్ 2022)’ నివేదిక పలు కీలక అంశాల పట్ల ఆసక్తికర అధ్యయన ఫలితాలను వెల్లడించింది. 1950 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి విడుదల చేస్తున్న ఐరాస జనాభా అంచనా నివేదిక 2021లోనే 27వ నివేదిక విడుదల కావలసిందని, కరోనా విపత్తు కారణంగా 2022లో విడుదల చేస్తునట్లుగా తెలుస్తున్నది. 1950- 2022 మధ్య 237 దేశాల/ ప్రాంతాలకు చెందిన 1,758 జన గణనలు, 2,890 సాంపుల్ సర్వేలు, ముఖ్య రిజిస్ట్రేషన్ వ్యవస్థల సమాచారాల ఆధారంగా ‘ఐరాస ప్రపంచ జనాభా అంచనా- 2022’ నివేదికను విడుదల చేసింది.
1975 నుంచి ప్రతి 12 ఏండ్లలో ప్రపంచ జనాభా ఒక బిలియన్ (100 కోట్లు) పెరుగుతున్నదని, 2011లో 700 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 15 నవంబర్ 2022న 800 కోట్ల మైలురాయిని దాటనుందని అంచనా వేశారు. 2030 నాటికి 850 కోట్లు, 2050 నాటికి 970 కోట్లు, 2080ల్లో 1040 కోట్ల ప్రపంచ జనాభా ఉంటుందని, ఆ తరువాత 2100 వరకు జనాభా స్థిరీకరణ జరుగవచ్చని నివేదిక అంచనా వేస్తున్నది. గత దశాబ్ద కాలంగా జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నదని, 2019 నుంచి ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1 శాతం లోపు తగ్గిందని తెలుస్తున్నది. 1960 ల్లో ప్రపంచ జనాభా వృద్ధి రేటు 2.3 శాతంగా ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో సంతానోత్పత్తి రేటు (ఫర్టిలిటీ రేటు) క్రమంగా పడిపోతున్నదనే వాస్తవాన్ని నివేదిక స్పష్టం చేస్తున్నది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా అగ్ర స్థానంలో నిలుస్తూ వస్తున్నది. 1970 నుండి చైనా తీసుకున్న జనాభా నియంత్రణ (ఏక సంతాన కుటుంబాలు) చర్యలతో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోవడం జరుగుతున్నది. నేడు చైనా జనాభా 142.6 కోట్లు, ఇండియా జనాభా 141.2 కోట్లుగా ఉన్నది. 2023లో ఇండియా జనాభా చైనాను దాటుతూ అత్యంత జనాభాగల దేశంగా ప్రథమ స్థానం ఆక్రమించనున్నది. 2050 నాటికి ఇండియా జనాభా 166.8 కోట్లు, చైనా జనాభా 132.7 కోట్లు ఉంటుందనే ఆసక్తికర అంచనా చేస్తున్నది. ఇండియా జనాభా ప్రతి ఏటా ఒక శాతం పెరగడం గమనించారు. ఇండియాలో సంతానోత్పత్తి రేటు 1950ల్లో 5.7 ఉండగా నేడు 2.0 వరకు పడిపోయింది. చైనాతో పోల్చితే భారత్‌లో సంతానోత్పత్తి రేటు తగ్గుదల నెమ్మదిగా జరిగినట్లు వెల్లడవుతున్నది.
భవిష్యత్ జనాభా అంచనాలు
2086 నాటికి ప్రపంచ జనాభా 10.4 బిలియన్లు (1040 కోట్లు), 2100 నాటికి 10.88 బిలియన్లు (1088 కోట్లు) చేరనుందని అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో అల్పాదాయ దేశాల్లో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతుందని, అధిక ఆదాయ దేశాల్లో పెరిగే విదేశీ వలసలతో సంతానోత్పత్తి రేటు పెరగవచ్చని అంచనావేశారు. 2050 వరకు ప్రపంచ జనాభా పెరుగుదల్లో యాభై శాతం కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా అనబడే 8 దేశాలు ప్రధాన కారణం కానున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామంతో పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలు, విద్య వ్యవస్థల అవస్థలు పెరుగుతాయని కూడా వెల్లడించడాన్ని గమనించాలి.
గత దశాబ్దాల్లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 1950లో ప్రతి మహిళకు సగటున 5 శిశు జననాలను నమోదు చేయగా, 2021లో ప్రతి మహిళ 2.3 ప్రసవాలు మాత్రమే నమోదు చేయడంతో సంతానోత్పత్తి రేటు సగానికి పడిపోవడం గమనించారు. దాదాపు 66.6 శాతం దేశాల్లో ఒక మహిళకు 2.1 పిల్లలు ఉండగా, కొరియా, జపాన్, స్పెయిన్ లాంటి దేశాల్లో సంతానోత్పత్తి రేటు 1.3 మాత్రమే నమోదు అవుతున్నది. 2021లో సబ్- సహారా ఆఫ్రికాలో ఒక్క మహిళకు 4.6 జననాలు, ఆస్ట్రేలియాలో 3.1, నార్త్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఆసియాల్లో 2.8, సెంట్రల్ అండ్ సౌథ్ ఆసియాలో 2.3గా నమోదు అయ్యింది. 2021లో 10 శాతం (13.3 మిలియన్లు) శిశువులు 20 ఏండ్ల లోపు వయస్సు కలిగిన యువతులకు జన్మించడం జరిగింది. 2022, 2050ల మధ్య కాలంలో ప్రపంచంలోని 61 దేశాల్లో సంతానోత్పత్తి రేటు 1 శాతం కన్న తక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వయో వృద్ధుల జనాభా
ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి 65 ఏళ్ళు దాటిన వయో వృద్ధుల జనాభా 99.4 కోట్లు, 2050 నాటికి గణనీయంగా పెరిగి 160 కోట్లకు చేరుతుందని తెలుస్తున్నాయి. 65 ఏండ్లు దాటిన వృద్ధుల జనాభా 5 ఏండ్ల బాలల కన్నా రెట్టింపు అవుతుందని, 12 ఏండ్ల లోపు పిల్లల జనాభాతో సమానంగా ఉంటుందని వెల్లడవుతున్నది. 2019లో ప్రపంచ ఆయుర్దాయం 72.8 ఏండ్లుగా ఉన్నది. వైద్య వసతులు పెరగడంతో మరణాల రేటు తగ్గుతూ 2050 నాటికి ప్రపంచ సగటు ఆయుర్దాయం 77.2 ఏండ్లు కానున్నదని తెలుస్తున్నది. 2021 గణాంకాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లో సగటు ఆయుర్దాయం 70 ఏళ్లుగా నమోదు కావడం మనకు తెలుసు. 2022లో జనాభాలో 10 శాతం ఉన్న (65 ఏండ్లు దాటిన) వయోవృద్ధులు 2050 నాటికి 16 శాతానికి పెరగనున్నట్లు తెలుస్తున్నది. పురుషుల ఆయుర్దాయంతో (68.4 ఏండ్లు) పోల్చితే మహిళల ఆయుర్దాయం (73.8 ఏండ్లు) ఎక్కువగా ఉండడంతో వయో వృద్ధుల్లో 55.7 శాతం వరకు మహిళలే ఉండడం విశేషం. 2022 జనాభాలో పురుషులు 50.3 శాతం, మహిళలు 49.7 శాతం ఉండగా రానున్న దశాబ్దాల్లో మహిళల జనాభా పురుషుల కన్నా అధికం కావచ్చని నివేదిక అంచనా వేసింది.
ప్రపంచ దేశాల జనాభాతో అంతర్జాతీయ వలసలు ముడిపడి ఉంటాయని, 2000-20 మధ్య కాలంలో సంపన్న దేశాలకు 80.5 మిలియన్ల ప్రజలు వలసలు వెళ్లారని, దీనితో ఆ దేశాల్లో మరణాల రేటు కన్నా జననాల రేటు పెరగడం గమనించారు. గత కొన్ని ఏండ్లుగా అధిక ఆదాయ దేశాల్లో జనాభా పెరగడానికి ప్రధాన కారణంగా విదేశీ వలసలు నిలుస్తున్నాయి. అల్పాదాయ, స్వల్ప- ఆదాయ దేశాల్లో జనాభా పెరుదలకు కారణంగా అధిక జననాల రేటును గుర్తించారు. 2010- 2021 కాలంలో 40 దేశాలకు 2 లక్షల కన్నా అధిక వలసలు నమోదు కావడం, వీటిలోని 17 దేశాల్లో 10 లక్షల వలసలు దాటడం గమనించారు. ఉద్యోగ ఉపాధులు, అభద్రత, అల్లర్లు, సంక్షోభాలు వంటి పలు కారణాలతో పాకిస్థాన్, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, సిరియా, వెనిజులా, మియన్మార్ లాంటి దేశాల నుండి విదేశీ వలసలు అధికంగా నమోదనాయి. కరోనా విపత్తు కల్లోలంతో విదేశీ వలసలపై తీవ్ర ప్రభావం పడడం మనకు విదితమే.
కొవిడ్-19 విపత్తు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనాభా, దేశ విదేశీ వలసలు ప్రభావితం కావడం గమనించాం. కరోనా మహమ్మారి ప్రళయ గర్జన ధాటికి 2020లో 5 మిలియన్లు, 2021లో 10 మిలియన్ల అధిక మరణాలు నమోదు అయ్యాయని తెలుస్తున్నది. ఇదే రకమైన అధ్యయనాల ప్రకారం ‘ఎకానమిస్ట్’ అంచనాలో 2020-21లో 17.6 మిలియన్లు, డబ్ల్యుహెచ్‌ఒ అంచనా ప్రకారం 14.9 మిలియన్ల అధిక మరణాలు జరిగినట్లు గతంలోనే వెల్లడించడం మనకు తెలుసు.
2023లో ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభా కలిగిన దేశంగా ఆవిర్భవించనున్న భారతదేశ ప్రజలు సంతోషపడాలో, బాధపడాలో తెలియని సందిగ్ధంలో పడుతున్నారు. ఇండియా జనాభా ప్రతి ఏటా 1 శాతం పెరుగుతూ 2050 నాటికి 166.8 కోట్లకు చేరనున్న వేళ మానవ వనరులను దేశాభివృద్ధికి వాడుకునేలా మన ప్రభుత్వాలు శ్రమించాల్సి ఉంటుంది. జనాభా పెరుగుదలను నియంత్రించడానికి ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దేశ జనాభా శాపంగా కాకుండా వరంగా మారాలని, అత్యధిక జనాభా గల దేశంగా భారతం ప్రపంచ దేశాలకు సుస్థిరాభివృద్ధిలో దీప స్తంభం కావాలని ఆశిద్దాం.

డా. బుర్ర
మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News