Monday, December 23, 2024

గర్భాశయ క్యాన్సర్ నివారణకు భారత్ సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బాలికలకు సంక్రమించే గర్భాశయ క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్)ను నివారించడానికి జాతీయ రోగ నిరోధక కార్యక్రమం ( నేషనల్ ఇమ్యునైజేషన్ )కింద హెచ్‌పివి వ్యాక్సిన్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ఏప్రిల్‌లో ప్రపంచ స్థాయిలో టెండర్లను ఆహ్వానించడానికి యోచిస్తోంది. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు జూన్‌లో ఈ వ్యాక్సిన్ అందిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ టెండర్లలో మెర్క్, సీరం ఇన్‌స్టిట్యూట్ సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. సీరం ఇనిస్టిట్యూట్ భారత్‌లో తయారీ కార్యక్రమం కింద సిఇఆర్‌విఎసి (సెర్వావాక్) అనే హెచ్‌పివి ( హ్యూమన్ పాపిలోమా వైరస్ ) వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈ నెల 24న ఆవిష్కరించారు. పూనా కేంద్రంగా ఉన్న సంస్థ సిఇఒ అదర్ పూనావాలా, ఆ సంస్థ ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే 2026 నాటికి 16.02 కోట్ల హెచ్‌పివి వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రపంచ స్థాయిలో టెండర్లు పిలవనుందని, ఇందులో సీరం ఇనిస్టిట్యూట్, ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ ఉత్పత్తి దారు మెర్క్ సంస్థలు కూడా పాల్గొనవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ స్వదేశీయంగా తయారు చేసిన హెచ్‌పివి వ్యాక్సిన్ మార్క్‌ట్ విక్రయానికి గత ఏడాది జులైలో భారత్ డ్రగ్ రెగ్యులేటర్ మంజూరు చేసింది. ప్రభుత్వ సలహా మండలి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) ఈ వ్యాక్సిన్‌ను ప్రజారోగ్య కార్యక్రమం కింద వినియోగించడానికి అంగీకరించింది. అంతర్జాతీయ హెచ్‌పివి వ్యాక్సిన్ కన్నా ఈ వ్యాక్సిన్ సమంజసమైన ధరకు, అందుబాటులో ఉంటుందని గత నెల దక్షిణాసియా సదస్సులో ప్రకాష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం విదేశీ తయారీ హెచ్‌పివి వ్యాక్సిన్ల పైనే భారత్ పూర్తిగా ఆధారపడుతోంది. ప్రపంచ స్థాయిలో హెచ్‌పివి వ్యాక్సిన్లు తయారు చేస్తున్న మూడు విదేశీ సంస్థల్లో రెండు తమ డోసులను భారత్‌కు విక్రయిస్తున్నాయి. మార్కెట్‌లో ఒక్కోడోసు రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీరం

వ్యాక్సిన్ ‘సెర్వావాక్’

కేవలం 200 నుంచి 400 రూపాయలకే లభ్యమౌతుందని సీరం సిఇఒ పూనావాలా 2022 సెప్టెంబర్‌లో వెల్లడించారు. ప్రపంచం మొత్తం మీద మహిళల్లో 16 శాతం భారత్ లోనే ఉన్నారు. వీరిలో నాలుగో వంతు మంది గర్బాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద గర్భాశయ క్యాన్సర్ మరణాల్లో మూడో వంతు మరణాలు భారత్ లోనే జరుగుతున్నాయి. భారత్‌లో ఏటా దాదాపు 80 వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతుండగా, 35 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇప్పటివరకు ప్రపంచ స్థాయిలో ఈ వ్యాక్సిన్ సరఫరా పరిమితం గానే ఉందని ఎన్‌టిఎజిఐ చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా పేర్కొన్నారు. అయితే గత ఐదేళ్లుగా ఈ సరఫరా క్రమంగా పెరుగుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News