ప్రపంచ ఆకలి సూచీ 2023లో భారత దేశం స్థానం 125 దేశాల్లో 111కి పడిపోయిన చేదు వాస్తవం ప్రజలను ఆకలికి, పోషకాహార లేమికి దూరంగా వుంచడంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా వేలెత్తి చూపుతున్నది. ఆకలి సూచీలో 2014లో 55వ ర్యాంకులో వున్న ఇండియా తొమ్మిదిన్నరేళ్ళలో ఇంతగా దిగజారిపోడం అత్యంత ఆందోళనకరం. తిండి కలిగితె కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నట్టు సాధారణ ప్రజలకు తగిన పౌష్టికాహారం అందుబాటులో వున్న దేశమే అధిక సంపదను సృష్టించగలుగుతుంది. ప్రగతి పథంలో త్వరగా పయనించి అభివృద్ధి లక్షాలను చేరుకోగలుగుతుంది. తాజా ప్రపంచ ఆకలి సూచీ నివేదికలో మన దేశ అధ్వాన స్థితిని గమనిస్తే వాస్తవమైన అభివృద్ధికి మనం ఇంకా చాలా దూరంలో వున్నామని బోధపడుతున్నది. అభివృద్ధి అంటే కార్పొరేట్ శక్తుల, అదానీ, అంబానీల సంపద పెరగడం కాదు. దేశ ప్రజల ఆదాయం పెరిగి ఆకలి కోరల నుంచి వారు పూర్తిగా విముక్తులు కావడం ద్వారానే నిజమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఇతరత్రా ఎన్ని సౌభాగాలున్నా ఆకలిని జయించలేకపోడం ముందు అవన్నీ బలాదూరే.
ప్రధాని మోడీ తరచూ విదేశీ యాత్రలు చిత్తగిస్తూ, అమెరికా ప్రశంసల వర్షంలో తడిసిపోడం, ఇండియా ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గొప్పలు చెప్పుకోడం గాలిని ఆకలి సూచీలో మన అత్యధమ స్థానం తీసివేస్తున్నది. 140 కోట్ల మంది ప్రజలున్న మనకు ఆయుధాలను అమ్ముకొని మన సువిశాల మార్కెట్‌లో తమ ఇతరేతర ఉత్పత్తులనేకం విక్రయించుకొని బాగు పడడం కోసం అమెరికా వంటి దేశాలు తరచూ మనను పొగడ్తలలో ముంచెత్తి ఉబ్బిస్తూ వుంటాయి. దేశ జనాభాలో 11 కోట్ల 50 లక్షల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారని నీతిఆయోగ్ గర్వంగా ప్రకటించింది. అదే సమయంలో మన జనాభాలో 74.1 శాతం మంది ఆరోగ్యప్రదమైన ఆహారం కొరవడి ఈసుకోమంటున్నారు. అంటే దేశంలో వంద కోట్లకు పైబడిన జనం పోషక విలువలు లేని వ్యర్థ ఆహారంతో కడుపులు నింపుకొంటున్నారు. ఈ స్థితిలో వున్న జనం చైనా జనాభాలో కేవలం 10.9 శాతం మంది మాత్రమే. 2030 నాటికి ఆకలిని సమూలంగా తొలగించాలన్న లక్ష సాధనలో ఇండియా విఫలం కానున్నదని యూనిసెఫ్ నివేదిక హెచ్చరించింది. అప్పటికి దేశంలో 60 కోట్ల మంది ఇంకా ఆకలి మంటల్లోనే వుంటారని అంచనా వేస్తున్నది. ఆకలిని అంతమొందించలేకపోడం దేశ ఆర్థిక వ్యవస్థ మీద వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.
2022లో బ్రిక్స్ దేశాలన్నింటిలోనూ ఒక్క ఇండియాలోనే తలసరి ఆదాయం అతి తక్కువగా వున్నట్టు వెల్లడైంది. 2028 వరకు ఇదే పరిస్థితి కొనసాగగలదని చెబుతున్నారు. మధాహ్న భోజనం వంటి పథకాలను అమలు చేస్తున్నప్పటికీ బాలల్లో పోషకాహార లోపం తొలగడం లేదు. పథకాలను రూపొందించడంలో మన పాలకులు చూపించే శ్రద్ధ వాటి సక్రమ అమలులో చూపించడం లేదు. అందుచేతనే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా దేశంలో ఆకలి నానాటికీ విజృంభిస్తున్నది. ప్రధాని మోడీ ప్రభుత్వం కుటుంబానికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం పంపిణీ చేసింది. కాని దాని వల్ల ఆకలి తొలగలేదు. అటువంటి ఉచిత పంపిణీల కంటే సాధారణ ప్రజలకు నమ్మదగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే అవి వారి ఆకలిని శాశ్వతంగా తొలగించగలుగుతాయి. వాటితో వారు జీవన ప్రమాణాలు గణనీయంగా పెంచుకో గలుగుతారు. కాని దేశంలో ఉద్యోగ కల్పన ఎండమావులను తలపిస్తున్నది. తయారీ రంగం పుంజుకొంటే గాని ఉద్యోగాలు లభించే అవకాశాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాలను పూర్తిగా ఊడ్చిపెట్టేశారు. యాంత్రీకరణను గరిష్ఠ స్థాయిలో ప్రవేశపెట్టి గుమస్తా ఉద్యోగాలు కూడా లేకుండా చేశారు.
ఇంకొక వైపు సాంకేతిక విద్యావకాశాలను పెంచామని చెప్పి నాణ్యమైన, నైపుణ్యవంతమైన చదువులను అందించలేకపోతున్నారు. పర్యవసానంగా ఎంతో ఖర్చు పెట్టి సాంకేతిక విద్యల్లో పట్టభద్రులవుతున్న యువత కూడా సరైన ఉద్యోగాలు దొరక్క వీధులు పట్టిపోతున్నారు. ఎగుమతి ప్రధానమైన ఉత్పత్తులను సాధించడంలో పాలకులు విఫలమయ్యారు. మేకిన్ ఇండియా పథకమే ఇందుకు తార్కాణం. విదేశీ పెట్టుబడులు వస్తాయన్న ఆశ చూపి దేశంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే కృషికి తిలోదకాలిచ్చారు. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అవకతవక అమలు ద్వారా వేలాది చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు మూతపడే దుస్థితిని ప్రధాని మోడీ ప్రభుత్వం చేతులారా తెచ్చిపెట్టింది. ఆనాడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ పెద్దనోట్ల రద్దును గురించి ఘనాతిఘనంగా చెప్పుకొన్న ప్రధాని మోడీ ఈ రోజు దానిని ప్రస్తావించే పరిస్థితిలో లేరు. తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో తమ నిర్వాకాల వల్లనే దేశంలో ఆకలి ద్విగుణీకృతమైందని ఎన్‌డిఎ పాలకులు ఇప్పటికైనా తెలుసుకొని తమను తాము సవరించుకొంటే మంచిది.