Monday, December 23, 2024

పపంచ ఆహార సూచీలో మరింత దిగజారిన భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆకలి సూచీ2023లో భారత్ మరింత దిగజారింది. మొత్తం 125 దేశాలతో రూపొందించిన జాబితాలో మన దేశం 111వ స్థానంలో నిలిచింది. 2022లో మొత్తం 121 దేశాల్లో107వ స్థానంలో నిలవగా 2023లో మరో ఆరు స్థానాలు దిగజారి 111వ స్థానంలో నిలిచింది. పొరుగుదేశాలయిన పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకకంటే మన దేశం వెనుకబడి ఉండడం గమనార్హం. ఈ జాబితాలో పాకిస్థాన్(102),బంగ్లాదేశ్(81), నేపాల్(69),శ్రీలంక(60) దేశాలు మనకన్నా మెరుగైన స్థితిలో ఉండడం గమనార్హం. మన దేశంలో ఆకలి సూచీ 28.7గా ఉండడం చూస్తే దేశంలో ఆకలి స్థాయి చాలా తీవ్రంగానే ఉన్నట్లు అర్థమవుతుందని ఈ సూచీ ఆధారంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. కాగా క్షిణ ఆసియా, సహారా ఎడారికి దక్షిణంగా ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు చెరి 27 పాయింట్లతో అట్టడుగుస్థాయిలో నిలిచాయి. దీన్ని బట్టి ఈ ప్రాంతాల్లో ఆకలి ప్రమాదస్థాయిలో ఉన్నట్లు అర్థమవుతుందని ఆ నివేదిక పేర్కొంది. భారత దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా చైల్డ్ వేస్టింగ్(ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం) ఉందని,

దీన్నిబట్టి వారిలో పోషకాహార లోపం చాలా ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుందని ఆ సూచీ పేర్కొంది.ఈ నివేదికను బట్టి భారత్‌లో పోషకాహార లోపం ఇండెక్స్ 16.6 శాతంగా ఉండగా, అయిదేళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతంగా ఉంది. అలాగే 15నుంచి 24 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో రక్త హీనత(అనీమియా) 58.1 శాతంగా ఉన్నట్లు కూడా ఆ నివేదిక తెలిపింది. కాగా 2015నుంచి ఇప్పటివరకు ఎంతో ప్రగతి సాధించినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆకలిపై పోరు మాత్రం చాలా వరకు ఎలాంటి పురోగతి లేకుండా ఉందని కూడా ఈ నివేదికను బట్టి అర్థమవుతుంది. 2023లో ప్రపంచం మొత్తానికి సంబంధించి ప్రపంచ ఆకలి సూచీ 18.3గా ఉంది. 2015తో పోలిస్తే ఇది కేవలం ఒక శాతంకన్నా తక్కువగా ఉంది. 2015లో ఇది 19.1గా ఉంది. అంతేకాకుండా 2017నుంచి పోషకాహార లోపం పెరుగుతూ వస్తోందని, ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజల సంఖ్య 57.2 కోట్లనుంచి 73.5 కోట్లకు పెరిగిందని కూడా ఆ సూచీ తెలిపింది. ప్రపంచ ఆహార సూచీని లెక్కించడానికి ఉపయోగించే సూచీల్లో పోషకాహార లోపాన్ని ఒకటిగా 2017నుంచి వాడుతున్నారు.

తప్పుల తడక విధానం: కేంద్రం
కాగా ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం ప్రపంచ ఆహార సూచీ(జిహెచ్‌ఐ) నివేదికను తప్పుల తడకగా పేర్కొంటూ దాన్ని తోసిపుచ్చింది. సూచీని రూపొందించడంలో తప్పుడు విధానాలను అవలంబిస్తూ ఉన్నారని, ఇందులో ఏదో దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని కేంద్ర మహిళా,శిశుసంక్షేమ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకలిని కొలవడంలో ఈ సూచీ తప్పుడు విధానాన్ని అవలంబిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ అంటూ ఈ సూచీ దేశ నిజమైన పరిస్థితికి అద్దం పట్టడం లేదని పేర్కొంది. పోషణ్ ట్రాకర్‌లో నమోదు చేసిన గణాంకాలను బట్టి దేశంలో అయిదేళ్ల లోపు పిల్లల్లో చైల్డ్ వేస్టింగ్ గత కొన్ని నెలలుగా 7.2 శాతంకన్నా తక్కువగానే ఉంటోందని ఆ ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా అయిదేళ్ల లోపు పిల్లల్లో మరణాలకు పోషకాహార లోపం కారణమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు సాక్షాలు కూడా లేవని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా చైల్డ్ వేస్టింగ్‌కు శానిటేషన్, జన్యుపరమైన కారణాలు, వాతావరణం, తీసుకున్న ఆహారాన్ని ఉపయోగించుకోవడం లాంటి ఇతర అంశాలు కూడా కారణమని పేర్కొంది. అంతేకాకుండా జనాభాలో పోషకాహార లోపం నిష్పత్తిని కూడా కేవలం 3000 మందితో నిర్వహించే శాంపిల్ సర్వే ఆధారంగా నిర్ధారిస్తున్నారని కూడా మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News