ప్రాణాలు నిలుపుకోడానికి ఏదో ఒకటి తిని కడుపు నింపుకునే అవకాశం అందరికీ ఉండొచ్చు, కాని పోషకాహార లభ్యత లోపించిన కొద్దీ దేశ జన సంపద నిర్వీర్యమైపోయి, జాతి జవసత్వాలు అడుగంటిపోతాయి. యువతరం అత్యధికంగా ఉన్న భారత దేశంలో ఆకలి అపూర్వ స్థాయిలో తాండవిస్తున్నదన్న చేదు వార్త ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. తాజాగా విడుదలైన ప్రపంచ ఆకలి సూచీ నివేదికలో భారత దేశం ఏడు మెట్లు కిందికి పడిపోయి 94వ స్థానానికి దిగజారిందన్న సమాచారం రక్షణ సహా అన్ని రంగాల్లో అత్యాధునిక హంగులతో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదని చెప్పుకునే గొప్పల గాలి తీసేస్తున్నది. ఐరిష్ ఎయిడ్ ఏజెన్సీ, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంస్థ కలిసి తయారు చేసిన ప్రపంచ ఆకలి నివేదికలో చైనా, బ్రెజిల్, కువైట్ సహా 18 దేశాలు ఆకలిని జయించిన వాటి జాబితాలో ఉండగా, భారత దేశం తన పొరుగు చిన్న దేశాలైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే వెనుకబడిపోడం మన విశేషాభివృద్ధి చాటింపును మన పాలకులు, విధాన కర్తల విజ్ఞతను బోనులో నిలబెడుతున్నది. 130 కోట్లు పైబడిన జనాభా గల దేశాన్ని సుభిక్షంగా ఉంచడం చిన్న పని కాదు.
కాని దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఐదు వేళ్లూ సమగ్రంగా నోటికి అందని దుస్థితి ప్రజలకు తొలగకపోడం బాధాకరం. ఇది దేశ ప్రజల విజ్ఞతను కూడా ప్రశ్నిస్తున్నది. ఐదేళ్లకొకసారి అమూల్యమైన ఓటు హక్కు ద్వారా తమను పాలించే ప్రభుత్వాలను ఎన్నుకునే అవకాశం తమకున్నా తమ బతుకులను బాగు చేయగలవారిని పాలక పీఠాల్లోకి పంపించలేకపోతున్న ప్రజల అసమర్థత కూడా ఈ నివేదిక అద్దంలో ప్రస్ఫుటమవుతున్నది. స్థూలంగా చూస్తే దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న పాలకుల ప్రాధాన్యాల్లోని అసాధారణమైన లోపాల వల్లనే ఆకలి కేకలు పెరిగాయని భావించవలసి వస్తోంది. కొవిడ్ 19 అన్ని దేశాలనూ ఇంచుమించు ఒకేరకంగా కొరుక్కుతిన్నది. అయినా కొన్ని దేశాలు ఆకలి సూచీలో మనకంటే ఎంతో ముందుండగా మనం గతం కంటే అధ్వాన స్థాయికి ఎందుకు పడిపోయామన్నది కీలక ప్రశ్న. ఒకవైపు కొవిడ్ మొదటి, రెండో వేవ్‌లు అనూహ్యంగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను వరుస పెట్టి హరిస్తున్న సమయంలోనే ప్రధాని మోడీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంస్కరణల అమలుకు బడా పెట్టుబడులను, కార్పొరేట్ శక్తులను గరిష్ఠ స్థాయిలో సంతృప్తి పరిచే నిర్ణయాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన సంగతిని ఎవరూ కాదనలేరు.
ప్రజలను కొవిడ్ సహా అన్ని రకాల దాడుల నుంచి, పేదరికం నుంచి, ఆకలి నుంచి కాపాడడమే ప్రధాన, పరమోత్తమ ధ్యేయంగా పని చేయవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అత్యంత అపసవ్యమైన విధానాలను అవలంబిస్తున్నది. పోషకాహార లేమి, ఏడేళ్లలోపు పిల్లల్లో ఎంత మందిలో ఎత్తుకు తగ్గ బరువు లోపించిందో, అలాగే ఎంత మందిలో వయసుకు తగిన ఎత్తు లేదో, ఐదేళ్ల లోపు బాలల మరణాల శాతం అనే అంశాల పాత్రిపదికగా ఆకలి సూచీలో ఆయా దేశాల స్థానాన్ని నిర్ధారిస్తారు. భారత దేశంలో ఆకలి తీవ్రత ఆందోళనకరమైన స్థాయిలో ఉన్నదని సూచీ నివేదిక వ్యాఖ్యానించింది. 2020లో 107 దేశాలలో భారత్ 94 వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 116 వరుసలో 101 స్థానానికి జారిపోయింది. 1998 2002 మధ్య దేశంలో 17.1 శాతం మంది ఐదేళ్ల లోపు పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు లేనట్టు గుర్తించగా, 20162020 మధ్య ఇది 17.3 శాతానికి పెరిగిందని ఆకలి స్పష్టం చేసింది. మన పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లు సూచీలో 76వ స్థానంలో ఉండగా, మయన్మార్ 71, పాకిస్తాన్ 92వ స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల్లో కూడా ఆకలి ఆందోళనకరమైన స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి తమ పౌరులకు సరైన ఆహారం అందేలా చూడడంలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయని ఈ నివేదిక వివరించింది.
2021లో కూడా ఈ పరిస్థితిలో మార్పు ఆశించలేమని చెబుతూ అందుకు మూడు కారణాలను నివేదిక ఎత్త్తి చూపింది. ఘర్షణలు, వాతావరణ మార్పులు, కొవిడ్ 19 కారణంగా 2021 పరిస్థితి కూడా ఇంతే సంగతులని హెచ్చరించింది. సహజంగానే మన కేంద్ర ప్రభుత్వం ప్రపంచ ఆకలి సూచీ భారత్‌కు ఇచ్చిన ర్యాంకును తీవ్రంగా విమర్శించింది. ఎవరి లోపాలనైనా ఎత్తి చూపినప్పుడు అటు నుంచి వచ్చే స్పందన సాధారణంగా ఇలాగే ఉంటుంది. విజ్ఞత గల సంస్థలు, ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకొని ఆ లోపాలను సవరించుకుంటాయి. అటువంటి మంచితనాన్ని మన కేంద్ర పాలకుల నుంచి ఆశించలేము. కాని ప్రజలను భాగస్వాములను చేసుకొని సాగించే అభివృద్ధి కృషి మాత్రమే ఆకలిని సమూలంగా అంతమొందించి దేశ సంపదను విశేషంగా పెంచి భారత్‌ను ప్రపంచ దేశాల మధ్య సగర్వంగా నిలుచోబెడుతుంది. ఈ సూకా్ష్మన్ని మన పాలకులు గ్రహించనంత వరకు ఆకలి నుంచి మనకు మోక్షం లభించదు.