నిజం తెలుసుకోడం, తెలియనివ్వడం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్య రంగంలో వాస్తవాల సేకరణకు అమితమైన, అనితరమైన ప్రాధాన్యమున్నది. ఏ రోగం మూలమేమిటో, ఏ వైకల్యానికి, ఏ మృతికి కారణాలేమిటో తెలుసుకోడం వల్ల, తెలియజెప్పడం వల్ల సరైన చికిత్సకు ఔషధాలు కనుక్కోడానికి అవకాశం కలుగుతుంది. ముందు ముందు అటువంటి రోగాలను, మరణాలను అరికట్టడానికి వీలు పెరుగుతుంది. దేశాన్ని గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు రెండు విడతలుగా అతలాకుతలం చేసి, ఇంకా చేస్తున్న కరోనా ఇంత వరకు ఎంత మందికి సోకిందో దాని వల్ల చనిపోయినవారి అసలు సంఖ్య ఎంతో ఇప్పటికీ సరైన లెక్కలు లేకపోడం కలవరపెట్టే అంశం. కేసులు, మరణాల సంఖ్యను తక్కువగా చూపడం వల్ల తాత్కాలికంగా ప్రభుత్వాల పరువు నిలబడవచ్చు గాని, నిజం నిలకడ మీద తేలినట్టు వాస్తవ గణాంకాలు నిగ్గు తేలినప్పుడు ప్రపంచం ముందు పలచనబడిపోతాం.అంతకంటే ముఖ్యంగా అంత ఎక్కువ కేసులు, మరణాలకు దారి తీసిన తీవ్రమైన అనారోగ్య మూలాలను ఛేదించడంలో వెనుకబడిపోతాం.
ఈ నెల 21 సోమవారం నాటి తాజా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కొవిడ్ కేసులు 17 కోట్ల 93 లక్షల 26 వేల 777 కాగా, మృతుల సంఖ్య 38 లక్షల 83 వేల 530 కాగా, మరణాలు తేలిన దేశాల వరుసలో 3 కోట్ల 44 లక్షల 6001 కేసులు, 6 లక్షల 17 వేల 166 మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఒక కోటి 79 లక్షల 27 వేల 928 మందితో కేసుల సంఖ్యలో మూడవ స్థానంలో గల బ్రెజిల్ 5 లక్షల 19 వందల 18 మరణాలతో మృతుల విషయంలో రెండోదిగా ఉంది. 2 కోట్ల 99 లక్షల 35 వేల 221 మందితో కరోనా కేసులలో రెండో స్థానంలో గల భారత్ 3 లక్షల 88 వేల 164 మరణాలతో మృతుల సందర్భంగా మూడో స్థానంలో ఉంది. ఈ లెక్కలు నిజమైనవి కావని వాస్తవ గణాంకాలు ఇంతకంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటాయని అంతర్జాతీయ ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. మృతుల అధికారిక సంఖ్య కంటే నిజ సంఖ్య రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉండగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
భారత దేశంలో మరణించిన వారి వాస్తవ సంఖ్య మాత్రం అధికారికంగా ప్రకటించిన దాని కంటే మూడు నుంచి పద్నాలుగింతలు ఎక్కువ ఉండగలదని ప్రజారోగ్య నిపుణులు, పరిశోధక సంస్థల అంచనా. సెకండ్ వేవ్‌లో దేశంలో లక్షకు చేరుకున్న కరోనా కేసులు ఇప్పుడు రోజుకి 60 వేలకు పడిపోయి తెరిపిచ్చాయి. బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ ఎత్తి వేస్తున్నారు. కాని గత ఏప్రిల్, మే నెలల్లో గంగా నదిలో శవాలు గుట్టలుగుట్టలుగా తేలడం, శ్మశానాలు చాలకపోడం మృత దేహాలతో ట్రక్కులు క్యూ కట్టడం, ఊపిరాడక ఆక్సిజన్ కోసం వరుసలో ఎదురు చూస్తూ మరణించిన వారి లెక్కలు భీతికొల్పడం తెలిసిందే. తమకు దగ్గరివారిలో కనీసం ఒకరిద్దరైనా కరోనా రెండో కెరటానికి మృతి చెందారని ఇప్పటికీ ప్రతి ఒక్కరూ చెప్పుకొంటున్నారు. దేశంలోని అసంఖ్యాక పల్లెల్లో మరణాలను రికార్డు చేసే ఏర్పాట్లు లేవు. పట్టణాలు, నగరాసుపత్రుల్లో సైతం కొవిడ్ మరణాలను ఆ రోగికి గల ఇతర జబ్బుల ఖాతాలో నమోదు చేస్తున్నారు.
ఇటువంటి అనేక కారణాల వల్ల దేశంలో కొవిడ్ మృతుల అధికారిక సంఖ్య అసలు దాని కంటే చాలా తక్కువగా ఉండే అవకాశముంది. ఈ విషయం ఇటీవల బీహార్, మహారాష్ట్ర వంటి చోట్ల తీసిన కొత్త లెక్కల్లో స్పష్టంగా రుజువైంది. పాట్నా హైకోర్టు ఆదేశాల మేరకు బీహార్‌లో జరిపిన తాజా గణనలో 40 శాతం అదనపు మరణా లు తేలాయి. మొదట్లో లెక్కించిన 5 వేల 458 మంది మృతులకు తాజా లెక్కింపుతో అదనంగా 3951 మంది చేరారు. దానితో బీహార్ ప్రభుత్వం తన సిబ్బంది తప్పుడు లెక్కలు వేసినట్టు అంగీకరించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, బీహార్, గోవా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కలిసి కొత్త లెక్కల్లో 20 వేల అదనపు మరణాలు తేలాయి. దీనితో దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల కొవిడ్ మరణాలను తక్కువగా లెక్కకట్టి ఉంటారనే అభిప్రాయానికి బలం చేకూరింది. విదేశీ ఆరాల్లో వెలువడిన అంచనాలైతే దేశంలో కొవిడ్ మరణాలను 10 లక్షలకు మించి చూపుతున్నాయి. మే 15 నాటికి భారత్‌లో కొవిడ్ వల్ల 12 లక్షల మంది మరణించి ఉంటారని మిషిగాన్ విశ్వవిద్యాలయం బయోస్టాటిస్టిక్స్ (జీవ గణాంకాలు) విభాగ సారథి భ్రమర్ ముఖర్జీ అంచనా వేశారు.
ఆ తేదీ నాటికి మన అధికార మరణాల సంఖ్య 2 లక్షల 70 వేలు. తన అంచనా కూడా తక్కువేనని భ్రమర్ ముఖర్జీ అంటున్నారు. ఇండియాలో కొవిడ్ మృతుల సంఖ్య తక్కువ తక్కువగా 6 లక్షలు, గరిష్ఠంగా 16 లక్షలని న్యూయార్క్ టైమ్స్ అంచనా వేసింది. విదేశీ సంస్థలు, మీడియా గోరంతలు కొండంతలు చేశాయని అనుకున్నా దేశంలో కొవిడ్ మృతుల అసలు సంఖ్య అధికారిక లెక్క కంటే బాగా ఎక్కువగానే ఉండగలదనే అంచనాను కొట్టివేయలేము. ఆ లెక్కను ఖచ్చితంగా తేల్చడం దేశ ప్రజల మేలుకు, ఆరోగ్యరంగ ప్రగతికి ఎంతో అవసరం.