ఆసియా అండర్19 కప్
దుబాయి: ఆసియా కప్ అండర్19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 103 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ యువ జట్టును ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. షేక్ రషీద్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రషీద్ 108 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 90 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో కెప్టెన్ యశ్ ధూల్ (26), విక్కి 28 (నాటౌట్), రాజ్ బావా (23) పరుగులు మాత్రమే కాస్త రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 38.2 ఓవర్లలో కేవలం 140 పరుగులకే ఆలౌటైంది. అరిఫుల్ ఇస్లామ్ ఒక్కడే కాస్త రాణించాడు. సమన్వయంతో ఆడిన ఇస్లాం 42 పరుగులు చేశాడు. ఓపెనర్ మైఫుల్ ఇస్లాం (26) పరుగులు సాధించాడు. ఇక భారత బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు. రాజ్‌వర్ధన్, రవి కుమార్, రాజ్ బాదా, విక్కి రెండేసి వికెట్లు పడగొట్టారు. మరో సెమీఫైనల్లో శ్రీలంక విజయం సాధించింది. పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో శ్రీలంక 22 పరుగులతో జయకేతనం ఎగుర వేసింది. శుక్రవారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది.