ఐఓఆర్ దేశాలతో రాజ్‌నాథ్
బెంగళూరు: క్షిపణులు, యుద్ధరంగంలో ఉపయోగించే ఎలెక్ట్రానిక్ ఆయుధ సంపత్తితోసహా వివిధ ఆయుధ వ్యవస్థలను హిందూ మహాసమ్రుద్ర ప్రాంతంలోని(ఐఓఆర్) దేశాలకు సరఫరా చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గురువారం నాడిక్కడ ఐఓఆర్ రక్షణ మంత్రుల సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ కీలకోపన్యాసం చేస్తూ ఏరో ఇండియా-2021 వంటి అంతర్జాతీయ కార్యక్రమం జరుగుతున్న వేళ ఐఓఆర్ దేశాలతో సదస్సును భారత్ నిర్వహించడం తమ దేశాల మధ్య ఐక్య ప్రగతి, సుస్థిరత, నిర్మాణాత్మక చర్చలపై తమ దృక్పథాన్ని సూచిస్తుందని అన్నారు. రక్షణ పరిశ్రమ, పారిశ్రామిక సహకారంతోపాటు వనరుల వినియోగంపై ఐఓఆర్ దేశాల మధ్య సుహృద్భావ పరిస్థితులు నెలకొనాలని ఆయన అన్నారు.
ఐఓఆర్ దేశాలలో అనేకం ఆధునిక టెక్నాలజీ రూపకల్పనలో అంతర్జాతీయంగా పోటీపడుతున్నాయని, నౌకల నిర్మాణానికి చెందిన రక్షణ నౌకాశ్రయాల టెక్నాలజీ విషయంలో ఎంతో అభివృద్ధి చెందాయని రాజ్‌నాథ్ అన్నారు. ప్రాంతీయ సహకారం ద్వారా సంయుక్తంగా ఐఆర్‌ఓ దేశాలు అభివృద్ధిని సాధించాలని ఆయన అన్నారు. భారతదేశ ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమలు ప్రస్తుతం విదేశీ కంపెనీలు ఆకర్షనీయమైన అవకాశంగా ఆయన పేర్కొన్నారు. వివిధ రకాల క్షిపణి వ్యవస్థలను, తేలికపాటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, బహుళసాధక తేలికపాటి సరకు రవాణా విమానాలు, యుద్ధ నౌకలు, గస్తీ నౌకలు, శతఘ్ని వ్యవస్థలు, యుద్ధ ట్యాంకులు, రాడార్లు, సైనిక వాహనాలు, ఎలెక్ట్రానిక్ యుద్ధ ఆయుధ సంపత్తి, ఇతర ఆయుధ వ్యవస్థలను ఐఓఆర్ దేశాలకు సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ తెలిపారు.