దుబాయ్ : భారత్ తన కర్బన ఉద్గారాలను అనుకున్న గడువుకు 11 ఏళ్లు ముందుగానే 2005 నుంచి 2019 మధ్యకాలంలో 33 శాతం వరకు తగ్గించగలిగిందని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వార్షిక అభివృద్ధి రేటు 7 శాతం వరకు పెరగ్గా, ఉద్గారాలు ఏటా కేవలం 4 శాతం వరకు మాత్రమే పెరిగాయని నివేదికలో పేర్కొంది. భూతాపాన్ని పెంచే హరితవాయువుల ఉద్గారాలతో సంబంధం లేకుండా ఆర్థిక వృద్ధిని విజయవంతంగా సాధించగలిగినట్టు నివేదికలో భారత్ వివరించింది. దుబాయ్‌లో ప్రస్తుతం వాతావరణ మార్పులపై జరుగుతున్న చర్చల సందర్భంగా “వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితికి చెందిన మూడో జాతీయ సదస్సు” కు భారత్ ఈ నివేదికను సమర్పించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆయా దేశాల హరితవాయువుల ఉద్గారాలు, వాతావరణ మార్పుపై వాటి ప్రభావం, ఆమేరకు ఉద్గారాలను అదుపు చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇవనీ ఈ సదస్సు కలిగి ఉంటుంది. భారత పర్యావరణ మంత్రి భూపేంద్రయాదవ్ తాము 33 శాతం వరకు ఉద్గారాలను తగ్గించ గలిగామని, ఇవికాక అదే సమయంలో అదనంగా మరో 1.97 బిలియన్ టన్నుల వరకు కర్బని నిక్షేపాలను తగ్గించగలిగామని వివరించారు. 2005 నాటి స్థాయితో పోలిస్తే 2030 నాటికి 45 శాతం వరకు హరితవాయువుల ఉద్గారాలను తగ్గించాలన్న లక్షంగా పెట్టుకున్నామని తెలియజేశారు. అలాగే పచ్చని అడవులను పెంచడం ద్వారా 2.5 బిలియన్ నుంచి 3.0 బిలియన్ టన్నుల కర్బన నిక్షేపాలను తగ్గిస్తామని తెలిపారు.