అమెరికా నివేదికపై మండిపడ్డ భారత్
న్యూఢిల్లీ: భారత్‌లో 2021 సంవత్సరం పొడవునా మైనార్టీలపై దాడులు జరిగాయంటూ అమెరికా విదేశాంగ శాఖ నివేదిక పేర్కొనడంపై భారత్ తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలియజేసింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం తప్ప మరోటి కాదని వ్యాఖ్యానించింది. అమెరికా నివేదికపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తీవ్రంగా స్పందిస్తూ అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ 2021 నివేదిక, అమెరికా అధికారులు వాస్తవాలు తెలియకుండా చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడడం దురదృష్టకరం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దురుద్దేశపూరిత సమాచారం ఆధారంగా అంచనాలు చేయడం, పక్షపాత అభిప్రాయాలకు రావద్దని మేము అభ్యర్థిస్తున్నాం’ అని ఆయన అన్నారు. భారత్‌లో 2021ఏడాది పొడవునా మైనార్టీలపై హత్యలు, దాడులు, బెదిరింపులులాంటివి చోటు చేసుకున్నాయని పేర్కొంటూ ఈ నెల 2న విడుదల చేసిన నివేదికలో అమెరికా ఆరోపించింది.