Friday, November 15, 2024

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 33 కేసులు నమోదు కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్, చండీగడ్, కర్ణాటక, రాష్ట్రాల్లో ఒక్కో కేసు వంతున నమోదయ్యాయి. అంధ్రప్రదేశ్, చండీగడ్ రాష్ట్రాల్లో ఇవే మొదటి కేసులు కాగా, కర్ణాటకలో మాత్రం ఇది మూడో ఒమిక్రాన్ కేసు. దీంతో దేశంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 36 కు పెరిగింది. ఛండీగఢ్ లోని బంధువులను కలిసేందుకు ఓ ఇరవై ఏళ్ల యువకుడు నవంబర్ 22న ఇటలీ నుంచి భారత్ చేరుకున్నాడు. అనంతరం హోం కారంటైన్‌లో ఉన్న ఆయనకు డిసెంబర్1న కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ కనిపించడంతో నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. తాజాగా అందులో ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్ధారణ అయింది. అతడికి లక్షణాలేవీ లేవని, ఇటలీలో ఆ యువకుడు రెండు డోసులు(ఫైజర్) వ్యాక్సిన్ తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతన్ని స్థానిక కొవిడ్ కేంద్రంలో క్వారంటైన్‌లో ఉంచారు. అతనికి సన్నిహితంగా మెలిగిన మరో ఏడుగురిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షిస్తున్నామని వైద్యాధికారులు వెల్లడించారు.

ఇక దక్షిణాఫ్రికా నుంచి కర్ణాటకకు వచ్చిన ఓ 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. తాజాగా ఒమిక్రాన్ వెలుగు చూసిన యువకుడి ఐదుగురు ప్రైమరీ, 15 సెకండరీ కాంటాక్టులను గుర్తించి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. విజయనగరం జిల్లాకు చెంది 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆ వ్యక్తి గత నెల 27 న ఐర్లాండ్ నుంచి ముంబై మీదుగా విశాఖ చేరుకున్నాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్‌టీపిసిఆర్ పరీక్ష చేయగా, కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆ నమూనాఉ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా తాజాగా వచ్చిన ఫలితంలో ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే తొలి ఒమిక్రాన్ కేసు. ఇక ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో ఒక్క మహారాష్ట్ర లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్ ఇప్పటికే 59 దేశాలకు విస్తరించినట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు బ్రిటన్, డెన్మార్, దక్షిణాఫ్రికా లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

India Report 35 Omicron Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News