న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. ముందు రోజు గత ఏడాది మేనాటి స్థాయికి తగ్గిన కొత్త కేసులు తాజాగా పెరిగాయి. మంగళవారం 11,57,697 మందికి కొవిడ్ నిర్ణారణ పరీక్షలు నిర్వహించగా, 9283 మందికి వైరస్ సోకింది. ఒక్క కేరళ లోనే 4972 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరింది. మంగళవారం 10,949 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం రికవరీలు 3.39 కోట్ల (98.33 శాతం)కు పైగా ఉన్నాయని బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడి లోనే ఉండడం, కోలుకునే వారి సంఖ్య మెరుగుపడుతుండడంతో క్రియాశీల కేసులు 537 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,11,481 (0.32 శాతం) గా ఉంది. 24 గంటల వ్యవధిలో 437 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో నమోదైన మరణాల సంఖ్యే 370గా ఉంది. మనదేశంలో కరోనా ప్రారంభమైన దగ్గరి నుంచి 4,66,584 మరణాలు సంభవించాయి. మరోపక్క మంగళవారం 76,58,203 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు డోసుల పంపిణీ 118 కోట్ల మార్కును దాటింది.
India Report 9283 new corona cases in 24 hrs