అక్టోబర్‌లో 4.48 శాతం నమోదు
న్యూఢిల్లీ : అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. గత నెలలో వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.48 శాతం నమోదైంది. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 4.35 శాతంగా ఉంది. కేంద్ర గణాంకాల శాఖ శుక్రవారం ఈ డేటాను విడుదల చేసింది. వరుసగా నాలుగో నెలలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) లక్షం పరిధిలోనే ఉంది. ద్వైమాసిక పాలసీ సమావేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగానే ఆర్‌బిఐ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. ఆర్‌బిఐ లక్షం ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం (మైనస్, ప్లస్ 2 శాతం) వద్ద ఉండాలి. అక్టోబర్‌లో కూరగాయల ధరలు, ముఖ్యంగా టొమాటో, ఉల్లి వంటి ఆహార పదార్థాల ధరలు అకాల వర్షాల కారణంగా భారీగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగింది.
పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది..
పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్‌లో పెరిగింది. కేంద్ర గణాంకాల శాఖ(సిఎస్‌ఒ) విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) 3.1 శాతానికి పెరగ్గా, ఇది సెప్టెంబర్‌లో 2.7 శాతంగా ఉంది. ఈ ఏడాది మార్చి నెల నుంచి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ గణనీయంగా పెరుగుతూ వస్తోంది.