Monday, December 23, 2024

రష్యన్ ఆయిల్‌కు అంతరాయం?

- Advertisement -
- Advertisement -

రష్యాతో ఇండియా ఆయిల్ స్నేహానికి చైనా నుంచి తీవ్రమైన ముప్పు ఎదురవుతున్నదా? రూపాయిల్లో కొనుగోలుకు ఇంత కాలం సునాయాసంగా అందుబాటులో వున్న రష్యన్ ఆయిల్ ఇక నుంచి ఇండియాకు ముఖం చాటుచేయనున్నదా? చైనా కరెన్సీ యువాన్లలో చెల్లిస్తే తప్ప మనకు రష్యా ఆయిల్ లభించదా? ప్రస్తుత పరిస్థితులను గమనించినప్పుడు ఈ ప్రశ్నలకు ఔనని సమాధానం చెప్పుకోక తప్పడం లేదు. కొన్ని రష్యన్ ఆయిల్ కంపెనీలు తమ ఆయిల్‌కు ఇండియా యువాన్‌లలోనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు ఇద్దరు సీనియర్ భారత అధికార్లు చెప్పినట్టు వచ్చిన వార్తలు ఈ సందర్భంలో గమనించదగినవి. ఈ ఇద్దరు అధికార్లు తమ పేర్లను బయట పెట్టరాదని కోరినట్టు తెలుస్తున్నది. అయితే యువాన్లలో చెల్లింపులకు భారత ప్రభుత్వం బొత్తిగా సిద్ధంగా లేదు. దీనితో రష్యా నుంచి చవక ఆయిల్ లభ్యతకు పూర్తిగా తెరపడగలదనే అభిప్రాయం బలపడుతున్నది. ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల రష్యా ఆయిల్ ఆర్థిక వ్యవస్థ అమెరికన్ ఆంక్షల దెబ్బకు తీవ్రంగా నష్టపోయింది. దాని నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్ళకు అమెరికాయే కాకుండా యూరపు దేశాలు కూడా పూర్తిగా స్వస్తి చెప్పాయి.

ఈ పరిస్థితుల్లో ఇండియాకు, చైనాకు ఆయిల్‌ను చవక ధరలకు విక్రయించడానికి రష్యా ముందుకు వచ్చింది. దానిని ఈ రెండు దేశాలు వినియోగించుకొంటున్నాయి. చైనాకు దాని కరెన్సీలోనూ, ఇండియాకు రూపాయిల్లోనూ రష్యా ఆయిల్‌ను సరఫరా చేస్తున్నది. దీనితో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు వరకు తన అవసరాల్లో కేవలం 0.2 శాతం రష్యా ఆయిల్‌నే దిగుమతి చేసుకొంటూ వచ్చిన ఇండియా విశేష స్థాయిలో కొనడం ప్రారంభించింది. ఈ కొనుగోలు గత జులైలో భారత అవసరాల్లో 42 శాతానికి పెరిగిపోయింది. అయితే ఇందు వల్ల రష్యా వద్ద రూపాయి నిల్వలు అసాధారణంగా పెరిగిపోయాయని, ఆ సొమ్మును ఏమి చేసుకోవాలో తెలియక అది యువాన్లలో చెల్లింపులను డిమాండ్ చేస్తున్నదని వార్తలు చెబుతున్నాయి. చైనా కరెన్సీ అమెరికన్ డాలర్‌తో పోటీ పడే స్థితిలో వున్నందున దానిని పెట్టి అక్కడి నుంచి సరకులను కొనుగోలు చేసుకోడం మాస్కోకు సులభతరం అవుతున్నందున అది యువాన్లలో చెల్లింపుల కోసం ఇండియాపై ఒత్తిడి తెస్తున్నదని బోధపడుతున్నది. ప్రస్తుతం ఏడు విడతల రష్యన్ ఆయిల్ దిగుమతులకు మనం బాకీ పడి వున్నట్టు తెలుస్తున్నది.

సరిహద్దు పేచీల కారణంగా చైనా నుంచి దిగుమతులనే పరిమితం చేసుకొంటున్న ప్రధాని మోడీ ప్రభుత్వం రష్యన్ ఆయిల్ కోసం యువాన్లను చెల్లించేందుకు ససేమిరా నిరాకరిస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రైవేటు కంపెనీలు యువాన్లలో రష్యన్ ఆయిల్ దిగుమతికి సిద్ధపడితే వేరు మాట గాని, ప్రభుత్వ రంగ కంపెనీలు అందుకు ఎంత మాత్రం అంగీకరించరాదని మన ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం. భారత చమురు శుద్ధి కర్మాగారాల్లో 70% వరకు ప్రభుత్వ రంగంలోనివే. ఆయిల్ దిగుమతుల కోసం వాటికి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావలసి వుంది. అందుచేత యువాన్లలో చెల్లింపు షరతును అవి అంగీకరించే అవకాశాలు బొత్తిగా లేవు. యువాన్లలో రష్యా నుంచి ఆయిల్‌ను దిగుమతి మనకు అప్రతిష్ఠాకరంగా పరిణమించడమే కాకుండా రూపాయిల్లో అంతర్జాతీయ వాణిజ్యం చేపట్టడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కూడా విఘాతం కలిగించే ప్రమాదం వున్నది. ఇండియాతో ఇంత వరకు రష్యా సాగించిన ఆయిల్ వ్యాపారం వల్ల దాని వద్ద వందల కోట్ల కిమ్మత్తు రూపాయిలు పోగుపడినట్టు తెలుస్తున్నది.

అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో డాలర్లలో మార్పిడి చేసుకొనే అవకాశం రూపాయికి లేనందున మన కరెన్సీని ఉపయోగించి బయటి మార్కెట్‌లో కొనుగోలు చేసుకొనే అవకాశాలు రష్యాకు లేవు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్షంగా ప్రకటించిన యుద్ధాన్ని అమెరికా, పాశ్చాత్య దేశాలు ఖండిస్తున్నప్పటికీ ఇండియా అందుకు తొందరపడలేదు. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రతిపాదించినప్పుడు కూడా వాటికి ఇండియా మద్దతు తెలుపలేదు. ఇండియా తీసుకొన్న ఈ వైఖరి రష్యాకు నైతికంగా తోడ్పడింది. ఒకవైపు సౌదీ అరేబియా, రష్యా ఆయిల్ ఉత్పత్తిని తగ్గించుకోడానికి నిర్ణయం తీసుకొన్నందున అంతర్జాతీయ ధరలు ఎగబాకే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ దశలో రష్యా నుంచి రూపాయిల్లో ఆయిల్ దిగుమతులు ఆగిపోతే అది మనకు కష్ట కాలాన్ని దాపురింప చేస్తుంది. తిరిగి సౌదీ అరేబియా, ఇరాక్‌ల నుంచి డాలర్ చెల్లింపులపై ఆయిల్‌ను దిగుమతి చేసుకోవలసి వస్తుంది. ఇరాన్ గతంలో మనకు అనువైన పద్ధతిలో ఆయిల్‌ను సరఫరా చేస్తూ వచ్చింది. డోనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఆంక్షలు విధించగలనని బెదిరించడంతో ఇరాన్ నుంచి ఆయిల్‌ను తెచ్చుకోడం మానుకోవలసి వచ్చింది. ఇటువంటి సమయాల్లో ఇరాన్‌తో ఆ దారి తెరుచుకొని వుంటే అది బాగా ఉపయోగపడి వుండేది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News