Friday, November 15, 2024

మూడో రోజు బౌలర్లదే..

- Advertisement -
- Advertisement -

India scored 327 in the first innings against South africa

చెలరేగిన షమి, సౌతాఫ్రికా 197 ఆలౌట్, తొలి టెస్టులో భారత్ పైచేయి

సెంచూరియన్: భారత్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్టులో మూడో రోజు బౌలర్ల హవా నడిచింది. మంగళవారం ఏకంగా 18 వికెట్లు నేలరాలాయి. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య సౌతాఫ్రికాను 197 పరుగులకే పరిమితం చేసింది. దీంతో భారత్‌కు కీలకమైన 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా మంగళవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ (4)ను జాన్‌సేన్ ఔట్ చేశాడు. కెఎల్.రాహుల్ (5), శార్దూల్ ఠాకూర్ (4) క్రీజులో ఉన్నారు. టీమిండియాకు ఇప్పటికే 146 పరుగుల ఆధిక్యం లభించింది.

ఆరంభంలోనే..

ఇక భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశామనే ఆనందం సౌతాఫ్రికాకు ఎక్కువ సేపు నిలువలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఎల్గర్ (1)ను బుమ్రా వెనక్కి పంపాడు. అప్పటికీ సౌతాఫ్రికా స్కోరు రెండు పరుగులే. ఆ తర్వాత షమి వెంటవెంటనే రెండు వికెట్లు పడగొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పీటర్సన్ (15)ను షమి క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే కుదురుగా ఆడుతున్న ఓపెనర్ మార్‌క్రామ్ (13)ను కూడా షమి ఔట్ చేశాడు. షమి అద్భుత బంతికి మార్‌క్రామ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక జట్టును కుంటాడని భావించిన వండర్ డుసెన్ కూడా నిరాశ పరిచాడు. మూడు పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

బవుమా ఒంటరి పోరాటం..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను బవుమా తనపై వేసుకున్నాడు. అతనికి వికెట్ కీపర్ డికాక్ అండగా నిలిచాడు. ఇద్దరు కుదురుగా ఆడుతూ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడాల్సి వచ్చింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన డికాక్ 63 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేసి శార్దూల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో ఐదో వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. మరోవైపు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బవుమా 103 బంతుల్లో పది ఫోర్లతో 52 పరుగులు చేసి షమి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మిగతావారిలో ముల్డర్ (12), జాన్‌సెన్ (19), రబాడ (25), మహారాజ్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమి ఐదు, ఠాకూర్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు 273/3 స్కోరుతో మంగళవారం మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎంగిడి అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. సెంచరీ హీరో రాహుల్ కిందటి స్కోరుకు ఒక పరుగు మాత్రమే జోడించి రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కొద్ది సేపటికే అజింక్య రహానె (48) కూడా వెనుదిరిగాడు. కుదురుగా ఆడుతున్న అతన్ని ఎంగిడి వెనక్కి పంపాడు. ఆ తర్వాత భారత్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. జట్టును ఆదుకుంటారని భావించిన రిషబ్ పంత్ (8), అశ్విన్ (4), శార్దూల్ ఠాకూర్ (4), షమి (8) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. బుమ్రా 14 ఒక్కడే రెండంకెల స్కోరును అందుకున్నాడు. ఇక సిరాజ్ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 71 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. రబాడకు మూడు వికెట్లు దక్కాయి. కాగా, సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు టెస్టులు జరుగనున్నాయి. మొదటి టెస్టులో తొలి రోజు ఆట సాఫీగా సాగగా, రెండో రోజు ఆట పూర్తిగా వర్షార్పణం అయ్యింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News