రాణించిన పంత్, విహారి, జడేజా, టీమిండియా 357/6
మొహాలీ: శ్రీలంకతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలు శుభారంభం అందించారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. రోహిత్ ఆరు ఫోర్లతో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. మయాంక్ ఐదు బౌండరీలతో 33 పరుగులు చేశాడు. ఇక తెలుగుతేజం హనుమ విహారి, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ను ఆడిన కోహ్లి ఐదు ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో విహారితో కలిసి మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించాడు. అంతేగాక టెస్టుల్లో 8వేల పరుగుల మైలురాయిని సయితం అందుకున్నాడు. విహారి 58 పరుగులు చేసి వెనుదిరిగాడు.
పంత్ సెంచరీ మిస్..
మరోవైపు యువి వికెట్ కీపర్ రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పంత్ 97 బంతుల్లోనే 9 ఫోర్లు, మరో 4 బౌండరీలతో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 4 పరుగుల తేడాతో శతకం సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ (27), రవీంద్ర జడేజా 45 (బ్యాటింగ్) కూడా తమవంతు పాత్ర పోషించారు. ఇక శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో ఆరు వికెట్లకు 357 పరుగులు చేసింది.