సిరీస్‌పై ఆస్ట్రేలియా కన్ను, నేడు రెండో టి20
నాగ్‌పూర్: శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో టి20 మ్యాచ్ టీమిండియాకు సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి మరో మార్గం భారత్‌కు లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే తొలి టి20 గెలిచిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. నాగ్‌పూర్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. ఇక టీమిండియా మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. రెండో టి20లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లకు ఈసారి తావులేకుండా చూసి జయకేతనం ఎగుర వేయాలని రోహిత్ సేన తహతహలాడుతోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఆ ఇద్దరు రాణించాల్సిందే..
తొలి టి20లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లిలు ఈ మ్యాచ్‌లో తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న వీరిద్దరూ మొహాలీలో ఘోరంగా విఫలమయ్యారు. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో సీనియర్లు కోహ్లి, రోహిత్ గాడిలో పడాల్సిన పరిస్థితి జట్టుకు ఉంది. వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో రాణిస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. మరోవైపు మొదటి టి20లో మెరుగైన ఆటను కనబరిచిన కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. వీరిద్దరూ తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం.
ఈసారి కూడా హార్దిక్‌పైనే
మరోవైపు మొహాలీలో విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన హార్దిక్ పాండ్య ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. జట్టు హార్దిక్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన హార్దిక్ విజృంభిస్తే టీమిండియా ఎదురే ఉండదు. ఇటు బంతితో అటు బ్యాట్‌తో రాణించే హార్దిక్ ఈ మ్యాచ్‌కు టీమిండియాకు ప్రధాన అస్త్రంగా మారాడు. అతని రాణింపుపైనే జట్టు గెలుపోటములు ఆధారపడి ఉన్నాయడంలో ఎలాంటి సందేహం.
బౌలింగే అసలు సమస్య
టీమిండియాను బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. తొలి మ్యాచ్‌లో 200కి పైగా భారీ స్కోరును సాధించినా ఫలితం లేకుండా పోయింది. బౌలింగ్ వైఫల్యంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితిలో నాగ్‌పూర్ మ్యాచ్‌లో బౌలర్ల ప్రదర్శన ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన నెలకొంది. భువనేశ్వర్, చాహల్, ఉమేశ్, హర్షల్ తదితరులు తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకోవడం కలవరానికి గురి చేస్తోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు పకడ్బంధీగా బౌలింగ్ చేయాల్సిన అవసరం జట్టుకు ఉంది. బౌలర్లు ఈసారి కూడా విఫలమైతే మాత్రం జట్టుకు మరో ఓటమి ఖాయం.
జోరుమీదుంది..
ఇక తొలి మ్యాచ్‌లో రికార్డు విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. కామెరూన్ గ్రీన్, స్మిత్, వేడ్ తదితరులు దూకుడు మీదున్నారు. ఈసారి కూడా బ్యాటర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ ఫించ్ కూడా బాగానే ఆడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. నాగ్‌పూర్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.