కొలంబో : తీవ్ర ఇంధన సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను ఆదుకోనేందుకు మరోసారి 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్‌ను పరపతి కింద పంపినట్టు భారత్ గురువారం వెల్లడించింది. గత రెండు నెలల్లో దాదాపు 4,00,000 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఇంథనాన్ని శ్రీలంకకు భారత్ పంపిందని శ్రీలంక లోని ఇండియన్ హైకమిషన్ తెలియజేసింది. బుధవారం మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ శ్రీలంకకు చేరుకుందని హైకమిషన్ తెలిపింది. ఇంతకు ముందు ఏప్రిల్ 2 న భారత్ పరపతి కింద 40 వేల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు పంపింది. ఈ విధంగా శ్రీలంకకు భారత్ పంపడం నాలుగోసారి.
గత ఫిబ్రవరి 2 న రుణపరపతి కింద పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్‌తో శ్రీలంక 500 మిలియన విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతేకాకుండా మరో బిలియన్ డాలర్ల వరకు శ్రీలంకకు ఆర్థిక సాయం అందిస్తామని భారత్ ఇటీవల ప్రకటించింది. శ్రీలంక దేశమంతా ఇంధనం కొరత సంక్షోభంతో ప్రజాందోళనలు సాగుతున్న క్లిష్ట పరిస్థితుల్లో భారత్ నుంచి ఇంధనసాయం అందడం చెప్పుకోతగ్గది. దీనికి తోడు శ్రీలంకలో ఇంధనం ధరలు పెరగడం కూడా ఆందోళనలకు ఆజ్యం పోసింది. ఆందోళనలను భగ్నం చేయడానికి పోలీస్‌లు కాల్పులు జరపడంతో చెలరేగిన హింసలో రాంబుక్కన నైరుతి ప్రాంతంలో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా గురువారం శ్రీలంక ప్రభుత్వం భద్రతా దళాలను పంపించింది.