Wednesday, April 30, 2025

పాక్ ఎయిర్‌లైన్లకు భారత గగనతలం మూసివేత

- Advertisement -
- Advertisement -

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ తమ గగనతలంపై మనదేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించగా, భారత్ కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తోంది. పాకిస్థానీ నౌకలు కూడా భారత్ పోర్టుల్లోకి రాకుండా నిషేధం విధించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించినట్టు సమాచారం. ఒకవేళ భారత్ దీనిపై నిర్ణయం తీసుకుంటే అది పాక్ ఎయిర్‌లైన్లపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేసియా లోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగన తలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు భారత్ నిషేధం విధిస్తే.. దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది.

అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతోపాటు నిర్వహణ పైనా అదనుపు భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్‌లైన్లకు ఇది మరింత శరాఘాతంగా మారనుంది. మన విమానాలకు పాక్ తమ గగన తలాన్నిమూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత ఎయిర్‌లైన్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో విమానాలు నడుపుతున్నాయి. అయితే ఈ నిర్ణయంతో ఆర్థికంగా మనకంటే పాక్‌కే ఎక్కువ నష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు భారత్ నుంచి పాక్ గగనతలం మీదుగా వారానికి 800 లకు పైగా అంతర్జాతీయ విమానాల రాకపోకలు సాగించేవి. ఇందుకోసం ఓవర్‌ఫ్లైట్ ఫీజు కింద పాక్ రోజుకు 1,20,000 డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పాక్ నష్టపోవాల్సిందే. 2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాల నేపథ్యంలో దాదాపు 5 నెలల పాటు పాక్ తమ గగనతలంలో భారత విమానాలపై ఆంక్షలు విధించింది. దీంతో అప్పట్లో ఆ దేశం 100 మిలియన్ డాలర్ల పైగా నష్టపోయినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News