Sunday, November 17, 2024

పాక్ ‘శాంతి’ మాటలు… భారత్ స్ట్రాంగ్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

India Slams Pakistan PM Speech at UN

వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఎ) 77వ సమావేశాల వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రదాని షెహబాజ్ షరీఫ్‌కు దీటుగా బదులిచ్చింది. ఢిల్లీ, పొరుగు దేశాలతో శాంతిని కోరుకునే వారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించదని స్పష్టం చేసింది. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ … శాంతిని కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాన మంత్రి షరీఫ్ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగుదేశాల తోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత బృందం తొలి సెక్రటరీ వినిటో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు.

“భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేస్తున్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు. పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబైలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా అక్రమంగా పొరుగుదేశాల భూ భాగాలను లాక్కోవాలని చూడరు” అని వినిటో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్ కాంక్షిస్తోందన్నారు. జమ్ముకశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ, మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసి పోయినప్పుడే సాధ్యమౌతుందని స్పష్టం చేశారు.

India Slams Pakistan PM Speech at UN

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News