Sunday, April 13, 2025

స్నేహబంధం… బలోపేతం

- Advertisement -
- Advertisement -

భారత్- శ్రీలంక మధ్య సుదీర్ఘ చారిత్రక స్నేహ సంబంధాలు ఉన్నాయి. మానవీయ విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఒక పెద్దన్నగా భారత్ ముందుండి శ్రీలంకకు మద్దతు ఇచ్చిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అయితే, గత దశాబ్దంలో మహిందా రాజపక్సే పరిపాలనలో ఈ ద్వైపాక్షిక సంబంధాల్లో కొన్ని అపోహలతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ సమయంలో శ్రీలంక తొందరపాటుతో చైనా వైపు మొగ్గుచూపింది. ముఖ్యంగా ‘బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు’లో భాగంగా ‘హంబన్‌టోట పోర్టు’ను 99 సంవత్సరాల లీజుకు ఇవ్వడం చైనాకు వ్యూహాత్మక ఆధిక్యం ఇచ్చింది. దీని వల్ల శ్రీలంక భయంకరమైన అప్పుల వలలో చిక్కుకుంది. ఈ సంక్షోభ పరిస్థితులనుంచి విముక్తి పొందేందుకు శ్రీలంక ప్రజలు ఇటీవల మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార దిసనాయికేను అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు.

ఆయన డిసెంబర్ 2024లో ఢిల్లీకి వచ్చినప్పుడు భారత భద్రతకు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడనివ్వమని స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఇటీవల ప్రధాని మోడీ శ్రీలంక పర్యటనలో కూడా ఆయన పునరుద్ఘాటించారు. ఈ పర్యటనలో జరిగిన ఒప్పందాలు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చాయి. మోడీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారమైన ‘మిత్ర విభూషణ’ను అందజేయడం గౌరవదాయక పరిణామం. శ్రీలంకను మద్దతు ఇచ్చే దేశం గా, భారత్‌కు ఒక విశ్వసనీయ మిత్రుడిగా నిలుస్తోంది. భౌగోళికంగా శ్రీలంక, భారతీయ సముద్ర జలమార్గాల మధ్య కీలక స్థానంలో ఉంది. ఈ కారణంగా ఇది జియో పాలిటిక్స్‌లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతం.

ఈ ఖాళీని చైనా పూర్తిగా ఆక్రమించకుండా ఉండేందుకు భారత్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఇటీవల జరిగిన రక్షణ ఒప్పందం ద్వారా భద్రతాపరమైన సహకారం మరింత బలపడనుంది. ప్రత్యేకించి త్రికోణమలే ప్రాంతాన్ని యుఎఇతో కలిసి ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న నిర్ణయం, 120 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణం ఇవన్నీ శ్రీలంక విద్యుత్ అవసరాలను తీర్చడంలో మైలురాళ్లుగా నిలుస్తాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లోనూ ఇరుదేశాల మధ్య సహకార ఒప్పందాలు కుదిరాయి. 2022లో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు చైనా, దాని భద్రతలకే ప్రాధాన్యతఇచ్చి పక్కకు నిలబడ్డది. అదే సమయంలో భారత్ మాత్రం నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించి చక్కటి మిత్రధర్మాన్ని చాటింది. 2024 చివర నాటికి భారత్ గత ఆరు నెలల్లో 100 మిలియన్లకుపైగా అమెరికా డాలర్ల రుణాలను గ్రాంట్‌లుగా మార్చిన విషయాన్ని మోడీ ప్రకటించారు.

ఈ చర్యలు శ్రీలంక పునరుద్ధరణకు తోడ్పడే ప్రయత్నాల్లో భాగమే. ఇటీవలి పర్యటనలో ప్రధాని మోడీ శ్రీలంక తూర్పు ప్రావిన్సుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి రూ. 240 కోట్ల స్థానిక కరెన్సీ మద్దతునిచ్చేందుకు హామీ ఇచ్చారు. అంతేగాక, ఇప్పటికే ఉన్న రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ సహకారం నిరంతరం కొనసాగాలంటే శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళుల ఆకాంక్షలను గౌరవించాలి. చట్టసమితి ప్రకారం ప్రావిన్సియల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. భారత్ చేసిన ఈ సహాయాన్ని ప్రగాఢ మైత్రీ బంధంగా మార్చాలి. మొత్తానికి మోడీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశనిచ్చింది. భద్రత, ఆర్థిక అభివృద్ధి, మానవ సంబంధాల పరంగా భారత్ -శ్రీలంక మధ్య తిరిగి విశ్వాసం నెలకొంటోంది. అయితే ఇది స్థిరంగా ఉండాలంటే, పరస్పర గౌరవం, మానవతా విలువలు మార్గదర్శిగా నిలవాలి. ఇదే నిజమైన మిత్రత్వానికి పునాది అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News