లంకకు పరీక్ష, నేటి నుంచి పింక్‌బాల్ సమరం
బెంగళూరు: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగే డేనైట్ టెస్టు మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత్‌కు ఇది నాలుగో పింక్‌బాల్ టెస్టు మ్యాచ్ కానుంది. ఇప్పటి వరకు మూడు డేనైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా రెండింటిలో గెలిచి ఒకదాంట్లో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ జయకేతనం ఎగుర వేసింది. అయితే అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో డేనైట్ టెస్టులో పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్‌తో చివరగా ఆడిన గులాబీ బంతి మ్యాచ్‌లో భారత్ జయభేరి మోగించింది. ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో రోహిత్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇక శ్రీలంకకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైన లంకకు ఈ టెస్టు సవాల్ వంటిదేనని చెప్పాలి. టెస్టు సిరీస్‌ను డ్రా చేయాలంటే గెలవడం తప్పించి మరో మార్గం పర్యాటక జట్టుకు లేకుండా పోయింది.
కోహ్లి ఈసారైనా..
ఇక ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. రెండేళ్లుగా కోహ్లి ఏ ఫార్మాట్‌లోనూ శతకాన్ని సాధించలేక పోయాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా ఆ లోటును పూడ్చుకుంటాడా లేదా అనేది సందేహంగా మారింది. ఒకప్పుడూ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లి కొన్నేళ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికాలతో జరిగిన సిరీస్‌లో తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్‌పైనే నిలిచింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతాడో వేచి చూడాల్సిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ మయాంక్ అగర్వాల్, తెలుగుతేజం హనుమ విహారి, వికెట్ కీపర్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే టీమిండియా మరింత బలోపేతంగా మారడం ఖాయం. ఇక బుమ్రా, జడేజా, అశ్విన్, షమి తదితరులతో బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియాను ఎదుర్కొవడం లంకకు శక్తికి మించిన పనిగానే చెప్పాలి.
సవాల్ వంటిదే..
మరోవైపు శ్రీలంకకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. కానీ మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడిన లంకకు ఈసారి కూడా కష్టాలు తప్పక పోవచ్చు. అసాధారణ ఆటను కనబరిస్తేనే ఈ మ్యాచ్‌లో లంకకు మెరుగైన అవకాశాలుంటాయి. ఒకవేళ మ్యాచ్‌ను డ్రాగా ముగించినా అది అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. అయితే యువ ఆటగాళ్లతో కూడిన లంకను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా టీమిండియా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
వంద శాతం ప్రేక్షకుల సమక్షంలో..
లంకభారత్ జట్ల మధ్య జరిగే చారిత్రక డేనైట్ టెస్టు మ్యాచ్‌లో వంద శాతం ప్రేక్షకులకు ప్రవేశం కల్పిస్తున్నారు. దీని కోసం కర్ణాటక క్రికెట్ సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. అయితే మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే ప్రేక్షకులు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..