Monday, December 23, 2024

రష్యాతో సుస్థిరబంధం

- Advertisement -
- Advertisement -

Sri Lanka is in an economic crisis

రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఇటీవల ఇండియా వచ్చి వెళ్లారు. చైనా, బ్రిటన్ విదేశాంగ మంత్రులు, అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా వచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాన దేశాల విదేశాంగ మంత్రులు ఇండియాను సందర్శించడం చర్చనీయాంశమైంది. వీరందరి సందర్శనల్లో రష్యా విదేశాంగ మంత్రి రాక ముఖ్యమైనదిగా పరిగణన పొందింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ పర్యటనను భారత ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. సరిహద్దు వివాదం పక్కన పెట్టి ఇతర విషయాల్లో సంబంధాలను గట్టి పరుచుకుందామని చైనా చేసిన ప్రతిపాదనను ఇండియా తోసిపుచ్చింది. 2020 ఏప్రిల్‌లో లడఖ్ సరిహద్దుల్లో మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చి మన సైనికులు 20 మందిని హతమార్చిన చైనా సేన చర్య తర్వాత పలు మార్లు జరిగిన చర్చలను ఒక కొలిక్కి రానీయకుండా దుర్బుద్ధితో చైనా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

వాస్తవాధీన రేఖపై రెండు దేశాలకు ఆమోదమైన పరిష్కారం సాధించుకునే వరకు చైనాతో మామూలు సంబంధాలు నెరపడం కష్టమని భారత్ వాంగ్ ఇ కి స్పష్టపరిచింది. ప్రధాని మోడీని కలుసుకోవాలన్న చైనా విదేశాంగ మంత్రి కోరిక కూడా నెరవేరలేదు. అంతేకాకుండా ప్రధాని మోడీ చైనాలో జరిగే ఎటువంటి శిఖరాగ్ర సభకైనా హాజరు కారని తెలుస్తున్నది. చైనాతో మన సంబంధాలు సాధారణ స్థితికి ఇంకా రాలేదని, వాస్తవాధీన రేఖ వద్ద ఇరువైపులా భారీగా సైన్యాలు మోహరించి వున్నాయని, 199396 నాటి ఒప్పందాలకు భిన్నమైన పరిస్థితి కొనసాగుతున్నదని చైనా విదేశాంగ మంత్రి పర్యటన ముగిసిన తర్వాత మన విదేశాంగ మంత్రి జైశంకర్ మీడియాకు స్పష్టంగా చెప్పారు. అంటే చైనా మనలను అంత సులువుగా లోబరుచుకోజాలదని, సరిహద్దులపై స్పష్టత రానంత వరకు దానితో సన్నిహితంగా ఇండియా వుండబోదని ఆయన సూటిగా, ఎటువంటి దాపరికం లేకుండా స్పష్టం చేశారు.

సరిహద్దులపై చైనా అస్పష్ట వైఖరిని ఆ విధంగా ఖండించారు. భారత్, చైనాలు కలిసి నడిస్తే వాటిని ఎదిరించగల శక్తి ప్రపంచంలో వుండబోదని ఓ తీపి అభిప్రాయం ప్రకటించి వాంగ్ ఇ వెళ్లిపోయారు. ఆయన భారత పర్యటనకు ఇండియా ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. మీడియాలో కూడా అంతగా కనిపించలేదు. ఇదే సందర్భంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ భారత సందర్శనకు విశేష ప్రచారం లభించింది. లావ్రోవ్ మన మీడియాలోని ప్రముఖులు కొంత మందితో మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధం పరంగా రష్యాపై అమెరికా, దాని మిత్ర దేశాలు కఠినమైన ఆంక్షలు విధించి వున్నప్పటికీ లావ్రోవ్‌కు మనమిచ్చిన విశేష ప్రాధాన్యం ప్రత్యేకించి గమనించదగినది.

లావ్రోవ్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుసుకొని వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఐక్యరాజ్య సమితిలో ఇండియా, చైనాలు తటస్థ వైఖరి పాటించాయి. ఇండియా అలీన తటస్థ వైఖరిని రష్యా మెచ్చుకున్నది. ఈ వైఖరి నుంచి ఇండియాను మళ్లించి రష్యాను అది ఖండించేలా చేయడానికి అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. అలాగని ఇండియా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను సమర్థించలేదు. యుద్ధాన్ని విరమించి చర్చల మార్గం పట్టాలని హితవు చెబుతున్నది. రష్యాతో మన సంబంధాలకు ఘనమైన చరిత్ర వుంది. గతంలో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో రష్యా మనకు వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే రష్యా నుంచి మనం ఆయుధాలను భారీగా కొనుగోలు చేస్తున్నాము. 1962లో మిగ్ 21 యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పటి నుంచి అది మనకు నమ్మకమైన ఆయుధ సరఫరా దేశంగా కొనసాగుతున్నది. మనకు అది సరఫరా చేయవలసి వున్న ఎస్ 400 వైమానిక దళ రక్షణ వ్యవస్థతో సహా అనేక ఆయుధాలు ఎప్పుడు మనకు ఇవ్వగలుగుతుందో లావ్రోవ్‌తో చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. రష్యా నుంచి చవకగా వస్తుందనుకున్న ఆయిల్ వాస్తవానికి ఇన్సూరెన్స్ రేట్లు పెరిగినందున మనకు భరించరానంతగా తయారైంది.

అయితే బీమా వ్యయాన్ని కూడా భరించి క్రూడాయిల్‌ను సరఫరా చేస్తామని రష్యా చెప్పిన విషయం విదితమే. ప్రపంచంలో ఆయిల్‌ను అధికంగా వినియోగించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానంలో ఇండియా వుంది. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నది మన మొత్తం చమురు దిగుమతుల్లో (175.9 మిలియన్ టన్నులు) 0.2 శాతమే. అయినప్పటికీ రాయితీ మీద, రూపాయిరూబుల్ మారకం పద్ధతిలో ఆయిల్ ఇవ్వడానికి రష్యా సిద్ధం కావ డం అందుకు మనం అంగీకరించడం విశేష పరిణామం. అమెరికాతో ఇండియా ఎంతగా పెనవేసుకున్నదో ట్రంప్ అధ్యక్షుడుగా వున్నప్పుడు కళ్లారా చూశాము. ఇప్పుడు అమెరికా, చైనాలతో గాని, రష్యాతో గాని, బ్రిటన్‌తో గాని ఆచరణాత్మక దృష్టితో మన ప్రయోజనాల ప్రాతిపదిక మీద మన విదేశాంగ విధానాన్ని వాస్తవికత ఆధారంగా మలచుకున్న విషయం స్పష్టపడుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News