న్యూఢిల్లీ/న్యూయార్క్ : భారతదేశం ప్రపంచస్థాయిలోనే రష్యాకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. ఐరాస మానవ హక్కుల మండలి (హెచ్‌ఆర్‌సి) నుంచి రష్యాను తీసివేసేందుకు ఐరాస సర్వప్రతినిధి సభలో వచ్చిన తీర్మానం ఓటింగ్‌కు భారతదేశం గైర్హాజరు అయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ప్రతి చర్యగా ఈ మండలి నుంచి రష్యాను గెంటివేసేందుకు అమెరికా ఇతర దేశాలు యత్నించాయి. భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తుందని, ఎవరి పక్షం ఉండదని, శాంతిపక్షం వహిస్తుందని ఓటింగ్ గైర్హాజరీ తరువాత ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ త్రిమూర్తి తెలిపారు. రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో పలు తీర్మానాలు ప్రతిపాదించారు. అయితే భారతదేశం ఎనిమిది సార్లు ఓటింగ్‌కు దూరంగా ఉంది. రష్యాను హక్కుల మండలినుంచి తీసివేయాలనే తీర్మానంపై 193 మంది సభ్యుల సర్వ ప్రతినిధి సభ ఓటింగ్‌కు వెళ్లింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పలు సంక్షోభాలు ఎదురవుతున్నాయని, నివారణకు కీలక చర్యలు అవసరం అని పేర్కొన్న భారత ప్రతినిధి పరస్పర ఆంక్షలు బహిష్కరణలతో ఫలితం లేదని వ్యాఖ్యానించారు.