Wednesday, January 22, 2025

కెనడా పౌరులకు భారత వీసాల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

టొరంటో : కెనడా, భారతదేశం నడుమ ఖలీస్థానీ వ్యవహారం పలు రకాల చిక్కుముళ్లకు దారితీసింది. దౌత్య సంబంధాలు తెగిపోయే పరిస్తితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా కెనడా, భారతదేశాలు వీసాల జారీ ప్రక్రియలను తాత్కాలికంగా నిలిపివేశాయి. కెనడాలో భారతీయ పౌరులకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో ఆ దేశానికి వీసాల జారీ సముచితం కాదని పలు విషయాల విశ్లేషణల తరువాత భారత విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్ణయానికి వచ్చింది. కెనడా పౌరులకు భారతీయ వీసాల జారీని నిలిపివేశారు. కెనెడియన్లు ఎవరైనా ఇతర దేశాలలో ఉండి భారతదేశ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని, ఏ దేశంలో ఉన్న కెనెడియన్లుకు అయినా ఈ వీసా నిలిపివేత నిబంధన వర్తిస్తుందని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి విలేకరుల సమావేశంలో తెలిపారు.

అంతకు ముందు గురువారం ఉదయమే కెనడా నుంచి భారత్‌కు వీసాల నిలిపివేత ప్రకటన వెలువరించారు. ఈ విషయంలో నెలకొన్న సందిగ్ధతలు, ప్రశ్నలపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) గురువారం తగు రీతిలో స్పందిస్తూ, సమాధానాలు వెలువరించింది. వీసాల జారీ నిలిపివేత తిరిగి తదుపరి ప్రకటన వెలువడే వరకూ అమలులో ఉంటుంది. కెనడాలో భారతదేశ వీసా సేవలను నిలిపివేసిన విషయాన్ని నిర్థారించారు. టొరంటో ఇతర ప్రాంతాలలోని భారతీయ హై కమిషన్లు, కాన్సులేట్లకు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున బెదిరింపులు రావడం, కార్యకలాపాలకు ఖలీస్థానీ శక్తులు ఆటంకాలు కల్పించడం వంటి పరిణామాల నడుమ వీసా సేవల ప్రక్రియను నిలిపివేసినట్లు ఎంఇఎ తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని తరువాతి నిర్ణయాలు తీసుకుంటారని బాగ్చి తెలిపారు. అక్కడి ఆకతాయి చర్యల ఫలితంగానే వీసాల ప్రక్రియను ఆపివేసినట్లు వివరించారు.

భద్రత బాధ్యత కెనడాదే
కెనడాలోని భారతీయ కాన్సులేట్లు, దౌత్య కార్యాలయాలకు సరైన విధంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆతిధ్య పాత్రలో కెనడాపైనే ఉంటుంది. అయితే ఇది సరైన విధంగా లేదు. దీనితో సొంత భద్రతకు దిగాల్సి వస్తోంది. దౌత్య సిబ్బంది భయాందోళనకు గురి కావల్సివస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. అయితే భద్రతా విషయాలను బహిరంగంగా వెల్లడించడం సరికాదని స్పష్టం చేశారు. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామం అయిందని, పలు పరిణామాలతో ఈ విషయం స్పష్ఠం అవుతోందని తెలిపారు. ఉగ్రవాద చర్యల అభియోగాలు ఉన్న వారిని కెనడా నుంచి వెళ్లగొట్టాల్సి ఉంది. వారిపై చర్యలకు దిగాల్సి ఉంది. భారత్‌లో విచారణలు ఎదుర్కొనేందుకు వారిని అప్పగించాల్సి ఉందన్నారు. ఇప్పటికే పలు సంవత్సరాలుగా నిర్ధేశిత ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని కెనడాను అభ్యర్థిస్తూ వచ్చినట్లు ,

అయితే ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని,ఏదో మొక్కుబడి చర్యలతో ముగిస్తున్నారని వివరించారు. ఖలీస్థానీ వేర్పాటువాది నిజ్జార్ హత్య తరువాత ప్రధాని ట్రూడో భారతదేశంపై ఆరోపణలకు దిగడం వంటి పరిణామాలు, ఇప్పుడు కెనడాలోనే మరో ఖలీస్థానీ ఉగ్రవాది హత్య జరగడం వంటి పరిణామాల నడుమ ఇరుదేశాల మధ్య దౌత్య వీసా వాణిజ్య విద్యాపరమైన విషయాలలో అగాథం ఏర్పడింది. కాగా కెనెడియన్లకు ఇండియన్ వీసా సర్వీస్‌లను నిలిపివేసినట్లు కెనెడియన్ల వీసా దరఖాస్తుల స్క్రూటిని సంబంధిత ప్రైవేటు ఏజెన్సీ బిఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ సంస్థ తమ వెబ్‌సైట్‌లో గురువారం తెలియచేసుకుంది. ఎప్పటికప్పుడు తమ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉంటే తరువాతి విషయాలు స్పష్టం అవుతాయని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News