సిందునదికి ఉప నది అయిన రావి నదీజలాలను పాకిస్తాన్ కు ప్రవహించకుండా భారత ప్రభుత్వం కట్టడి చేసింది. ఇరు దేశాల మధ్య 1960లో జరిగిన ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులు మన దేశానికి, జీలం, చీనాబ్ నదులు పాకిస్తాన్ కు చెందుతాయి. రావి నదీ జలాలను పూర్తిగా భారతదేశమే వాడుకోవచ్చునని ఒప్పందం పేర్కొంటోంది.
ప్రపంచ బ్యాంకు సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం మేరకు రావి నదిపై ఎగువన రంజిత్ సాగర్ డ్యామ్, దిగువన షాపుర్ కంది బ్యారేజీ నిర్మించేందుకు 1979లో జమ్ముకాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రంజిత్ సాగర్ డ్యామ్ 2001లో పూర్తయినా, షాపుర్ కంది ప్రాజెక్టు ఆగిపోయింది. దీనివల్ల పాకిస్తాన్ కు రావి నదీ జలాల ప్రవాహం కొనసాగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2013లో పునఃప్రారంభమై, ఈ మధ్యనే పూర్తయింది. దీంతో ఆదివారంనుంచి రావి జలాలను పాకిస్తాన్ కు ఆపేశారు.
ఇంతకాలం పాకిస్తాన్ కు వెళ్లిన రావి జలాలను జమ్ము కాశ్మీర్ లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లిస్తున్నారు. డ్యామ్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో 20 శాతాన్ని జమ్ము కాశ్మీర్ కు ఇస్తారు.