Wednesday, December 25, 2024

కంచెతో ఘర్షణలు కంచికి చేరేనా?

- Advertisement -
- Advertisement -

భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛా రవాణా వ్యవస్థ (ఎఫ్‌ఎంఆర్)ను రద్దు చేయాలని, మెరుగైన నిఘాకు వీలుగా 1640 కిలోమీటర్ల నిడివి గల సరిహద్దులో కంచె వేయాలని, గస్తీ మార్గం నిర్మించాలని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయం పట్ల తిరుగుబాటు సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఐజాక్ ముయివా గ్రూప్) (ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం) సహా నాగా సంస్థలు, మిజో సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్ ముఖ్యమంత్రులు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు.

కానీ మిజోరామ్, నాగాలాండ్ ముఖ్యమంత్రులు రెండు దేశాల మధ్య సరిహద్దు పొడుగునా ముళ్ల కంచె వేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ఒక్క అసో మాత్రమే మయన్మార్‌తో సరిహద్దును పంచుకోవడం లేదు. ఎటువంటి వీసా లేకుండా పరస్పర భూభాగంలోకి 16 కిమీ వరకు వెళ్లడానికి సరిహద్దువాసులను అనుమతిస్తున్న ఎఫ్‌ఎంఆర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ 2023 సెప్టెంబర్‌లో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 2023 మే 3 నుంచి మణిపూర్‌లో జాతుల మధ్య హింసాకాండ రెచ్చగొట్టడానికి తీవ్రవాదులు ఎఫ్‌ఎంఆర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని మణిపూర్ సిఎం బీరేన్ సింగ్ వాదించారు. భారత్, మయన్మార్ మధ్య 1640 కిలోమీటర్ల నిడివి గల అంతర్జాతీయ సరిహద్దు పొడుగునా కంచె వేయడానికి, రోడ్లు నిర్మించడానికి కేంద్రం రూ. 31 వేల కోట్లు ఖర్చును ఆమోదించినట్లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.

బీరేన్ సింగ్ వాదనతో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఏకీభవిస్తూ, భారత్‌మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మాణం మణిపూర్‌లో హింసాకాండ కట్టడికి కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాల్లో ఒకటి అని చెప్పారు. మణిపూర్‌లో జాతుల మధ్య హింసాకాండకు ప్రధాన కారణమైన సరిహద్దులో 30 కిలోమీటర్ల మేర కంచె పని పూర్తి అయిందని అమిత్ షా తెలియజేశారు. మణిపూర్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి వాదనను సహేతుకమైన వ్యక్తులు అంగీకరించడం లేదు. స్వాత్రంత్య్రం ముందు కాలం నుంచే ఎఫ్‌ఎంఆర్ అమలులో ఉన్నదని, ఈ ప్రాంతంలో వివిధ జాతి, వర్గాల మధ్య ఆ విధంగా భారీ స్థాయిలో హింసాకాండ చోటు చేసుకోలేదని వారు వాదిస్తున్నారు. మైతైలు కుకీల జాతుల ఘర్షణలు 2023 మేలో మాత్రమే మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందువల్ల మణిపూర్ సిఎం, కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఆందోళనలు నిర్హేతుకమని భావిస్తున్నారు.
ఎఫ్‌ఎంఆర్ రద్దుకు రెండు దేశాల మధ్య సరిహద్దుల పొడుగునా కంచె వేయడానికి తీసుకున్న నిర్ణయం మయన్మార్, ఆగ్నేయాసియాతో సన్నిహిత వాణిజ్యం, అనుసంధానం, ప్రజల మధ్య సంబంధాల పెంపునకు ‘పొరుగు దేశాలు ముందు’ విధానం, ‘తూర్పు వైపు కార్యాచరణ’ అన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటిత సిద్ధాంతాలకు భిన్నమైనది.

వలస పాలకుల సమయం నుంచి కూడా ఉనికిలో ఉన్న మయన్మార్‌తో మన సరిహద్దు రవాణా వ్యవస్థను కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తిరగతోడుతున్నట్లు అయింది. అది మన సన్నిహిత పొరుగు దేశంతో సరిహద్దును సీల్ చేసినట్లు అయింది. ఇప్పుడు మణిపూర్ మయన్మార్‌తో పంచుకుంటున్న 390 కిమీ సరిహద్దులో దాదాపు పది కిమీ మేర కంచె వేయడమైంది.
మిజోరామ్ ప్రధాన విద్యార్థుల సంస్థ మిజో జిర్లాయ్ పావల్ (ఎంజడ్‌పి) భారత్ మయన్మార్ సరిహద్దులో కంచె వేయాలన్న, స్వేచ్ఛా రవాణా వ్యవస్థను రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయం పట్ల ఐజాల్ నిరసన తెలియజేసింది. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ మధ్య బ్రిటిష్ వారు రూపొందించిన అంతర్జాతీయ సరిహద్దులు మిజో ప్రజలను, వారిని సంప్రదించకుండానే వేరు చేశాయని ఎంజడ్‌పి నాయకులు వాదించారు.

ఎఫ్‌ఎంఆర్‌ని వినియోగించుకుంటూ భారత్‌లోకి అక్రమంగా వలస వచ్చేందుకు మయన్మార్‌లోని తమ బంధువులకు సాయం చేస్తున్నారని మణిపూర్ కుకీలపై ఆరోపణలు ఉన్నాయి. ‘మయన్మార్‌కు చెందిన చిన్ కుకీ నార్కో ఉగ్రవాదులు’ మణిపూర్‌లో హింసాకాండకు బాధ్యులని మైతైలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ మణిపూర్ సమైక్యత సమన్వయ కమిటీ (సిఒసిఒఎంఐ కొకొమి) ఆరోపించింది. మయన్మార్ నుంచి ‘అక్రమ వలస’ మైతైల సంస్కృతి, అస్తిత్వానికి ముప్పుగా పరిణమించిందని కొకొమి నేత ఒకరు ఆరోపించారు. కుకీలు మయన్మార్‌లోని ‘డ్రగ్ లార్డ్’ ప్రేరేపణతో మణిపూర్ కొండల్లో గంజాయి అక్రమంగా సాగు చేస్తున్నారని, ఆ డ్రగ్స్‌ను తక్కిన భారతానికి, ఇతర ఆగ్నేయాసియా దేశాలకు పంపుతున్నారని మైతైల సంస్థలు ఆరోపిస్తున్నాయి. కుకీ సమాజ సంస్థలు ఆ ఆరోపణలను గట్టిగా తిరస్కరించాయి.

మణిపూర్‌లో అసోం తరహా ఎన్‌పిఆర్‌ను కోరడం ద్వారాను, భారత్‌లో కుకీల చరిత్రను చెరిపివేయడం ద్వారాను కుకీలు అందరినీ అక్రమ వలసదారులుగా చిత్రించేందుకు మైతైలు ప్రయత్నిస్తున్నారని కుకీలు ఆరోపించారు. భారత్‌లో, మయన్మార్‌లో నివసిస్తున్న గ్రేటర్ జో సమాజాలకు చెందిన ప్రజలను ఒకే సంస్థ కింద ‘ఏకీకరణ చేయాలన్న’ డిమాండ్‌ను జాతి భావనలను పంచుకునే మిజోలు, కుకీలు, హమర్‌లు తీవ్రతరం చేశారు. భారత్, మయన్మార్ రెండింటిలోనూ ఉన్న కుకీలు, మిజోలు, హమర్‌లు, మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన చిన్‌లు గ్రేటర్ జో సమాజంలో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి సుమారు వెయ్యి మంది చిన్ కాందిశీకులకు మిజోరామ్ కూడా ఆశ్రయం కల్పించింది. ‘తిరుగువాటువాదులు’, బంగ్లాదేశ్ భద్రత బలగాల మధ్య సంఘర్షణ అనంతరం వారు చిట్టగాంగ్ పర్వత శ్రేణులకు పారిపోయారు.

శతాబ్దాల తరబడి సీమాంతర గిరిజన సమాజాల మధ్య సన్నిహిత సాంప్రదాయక, ఆచారగత, బంధుత్వ సంబంధాలు, వలస పాలన నాటి సరిహద్దుల కృత్రిమ, నిరంకుశ స్వభావాన్ని గుర్తిస్తూ ఎఫ్‌ఎంఆర్ రూపొందింది. బ్రిటిష్ వారు అసోం, మణిపూర్‌లను (మొదటి బర్మా యుద్ధం తరువాత బర్మీస్ కాన్‌బాంగ్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకున్న ఇతర ప్రాంతాలతో పాటు) తమ అధీనంలో తీసుకున్నప్పుడు 1826లో యండబో సంధి దరిమిలా భారత్, అప్పటి బర్మా మధ్య సరిహద్దులను బ్రిటన్ గీసినప్పటికీ సీమాంతర సంబంధాలను, విభజిత జాతివర్గాల మధ్య కదలికలను పరిమితం చేసే ఏ ప్రయత్నమైనా ఇబ్బందులు సృష్టిస్తుందని వారు భయపడ్డారు.

ప్రధానంగా మణిపూర్, నాగాలాండ్‌లో ఉండే ఎన్‌ఎస్‌సిఎన్ ఇజాక్‌ముయివా వర్గం సరిహద్దుకు రెండు వైపుల నివసించే నాగాలతో సంబంధం తెంచుతుందనే భావనతో కంచె ప్లాన్‌ను వ్యతిరేకించింది. అదే విధంగా మయన్మార్‌లో ఉండే ఖప్లాంగ్ యుంగ్ ఆంగ్ వర్గం కూడా కంచె నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నది. భారత్ మయన్మార్ సరిహద్దులో ముళ్ల కంచె ఏర్పాటును మిజోరామ్ ముఖ్యమంత్రి లాల్దుహోమా, నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియు రియో కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్లాన్ ‘ఆమోదయోగ్యం కాదు’ అని లాల్దుహోమా అన్నారు.

మిజోరామ్, మయన్మార్‌లో నివసిస్తున్న జో సమాజం ప్రజలకు తమ మధ్య ఎటువంటి అడ్డంకీ లేకుండా నివసించే హక్కు ఉందని ఆయన ఉద్ఘాటించారు. భారత్ మయన్మార్ సరిహద్దులో కంచె వేయాలన్న, పొరుగు దేశంతో స్వేచ్ఛా రవాణా వ్యవస్థ (ఎఫ్‌ఎంఆర్) రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మిజోరామ్ అసెంబ్లీ ఇటీవల ఒక తీర్మానం ఆమోదించింది. ‘వివిధ దేశాల్లో చీలిపోయిన జో జాతి ప్రజలు ఒక పరిపాలన విభాగం కింద ఏకీకృతం అయ్యేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ తీర్మానం కోరింది.

ఎఫ్‌ఎంఆర్‌కు స్వస్తి చెప్పాలన్నా, భారత్ మయన్మార్ సరిహద్దులో కంచె వేయాలన్నా కేంద్రం నిర్ణయం అసాధ్యమైనదే కాకుండా అమానవీయం అని, ప్రజలను విభజించే ప్రమాదకర యత్నం అని నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి జమీర్ కూడా అన్నారు. ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, గోవా గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన జమీర్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. భారత్‌వైపు నాగాలాండ్, మయన్మార్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు గీసినప్పుడు అది ఊహా మాత్రంగానే ఉందని, దాని వల్ల ‘అసలైన’ నాగా గ్రామాలు అనేకం మయన్మార్‌లోకి వెళ్లగా కొన్ని నాగాలాండ్‌లో ఉండిపోయాయని ఆయన తెలిపారు.

నాగాలాండ్ మోన్ జిల్లాలోని లోంగ్వా గ్రామాన్ని కొన్ని సంవత్సరాల క్రితం సందర్శించినప్పుడు ఈ రచయిత ఒక గ్రామస్థుని ఇంటి మధ్య గుండా ‘ఆ లైన్’ వెళుతుండడం చూశారు. సరిహద్దులకు రెండు వైపులా విస్తరించి ఉన్న లోంగ్వా గ్రామాన్ని ఒక గ్రామాధికారి పాలిస్తుండడం, అతను భారత్ వైపు నివసిస్తుండడం గమనార్హం. నాగాలాండ్ నోక్లాక్ జిల్లాలో రమణీయమైన డాన్ గ్రామం పొడుగునా ఊహాత్మ సరిహద్దుకు కంచె నిర్మాణంలో సహకరించుకోవాలని 2016లో రెండు దేశాల ప్రభుత్వాలు నిర్ణయించాయి. పశ్చిమాన నాగాలాండ్‌లో సారామతి ఎగువ ప్రాంతాల మధ్యలో ఉన్న డాన్ కుగ్రామం, పంగ్షా వంటి పొరుగు గ్రామాలు వాటి మధ్యగా వెళ్లే దాదాపు మూడు కిలోమీటర్ల ఊహాత్మక సరిహద్దులో కంచె వేయడానికి మయన్మార్ ప్రభుత్వం విఫలయత్నం చేసినప్పుడు అవి వార్తల్లో నిలిచాయి. డాన్, పంగ్షా, ఇతర గ్రామాల ప్రజలు, పలు నాగా సంస్థలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో నిలచిపోయిన కంచె పని జరిగి ఉంటే అది దాదాపు 3600 హెక్టార్ల సాగు ప్రాంతాన్ని ఎవరికీ చెందిన భూమిగా మార్చే, ఆ పర్వత ప్రాంతాల్లో నివసించే ఖియామ్‌నియుంగన్ నాగా కుటుంబాలను విభజించే ముప్పు ఉండేది.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మకంగా ఆ సమస్యను పరిశీలించాలి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది సంబంధితులు అందరినీ సంప్రదించి, విస్తృత స్థాయిలో ఏకాభిప్రాయంతో జరగాలి. నిరంకుశంగా నిర్ణయాన్ని రుద్దడం సంక్షోభాన్ని తీవ్రం చేస్తుంది. భౌగోళిక ప్రాంతాలను విభజించవచ్చు కానీ చారిత్రక జాతి అనుబంధం, వారి సంస్కృతి, సంప్రదాయాలను విభజించరాదన్నది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం భారత్‌లో ఈ భాగంలోగల, మయన్మార్‌లో వారి పాలనలో నివసించే అన్ని జాతి వర్గాలను చర్చల్లో భాగస్వాములను చేయాలి.

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News