Sunday, December 22, 2024

కెనడా పౌరులకు వీసా సర్వీస్‌లను నిలిపివేసిన కేంద్రం?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్టు తెలుస్తోంది. నిర్వహణ కారణాలతో కెనడాలో వీసా సర్వీస్‌లను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి.

తదుపరి నోటీస్‌లు ఇచ్చేంతవరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొన్నాయి. ఈ వార్తలపై కేంద్ర విదేశాంగశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే కెనడియన్ల వీసా దరఖాస్తులను ప్రాథమికంగా పరిశీలించడానికి ఏర్పాటైన ఓ ప్రైవేట్ ఏజెన్సీ మాత్రం తమ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. “ నిర్వహణ కారణాలతో సెప్టెంబరు 21 నుంచి తదుపరి నోటీస్ వచ్చే వరకు భారత వీసా సర్వీస్‌లు సస్పెండ్ చేశారు” అని సదరు ఏజెన్సీ వెల్లడించింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్‌కు సంబంధం ఉందనటానికి బలమైన ఆరోపణలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది.

ఈ సమయంలో వీసా సర్వీస్‌ల నిలిపివేత వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా… ఆ దేశంలో మన దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేసింది. ఈ క్రమం లోనే ట్రూడో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్ కూడా మనదేశంలో కెనడా రాయబారిని బహిష్కరించింది. అంతేగాక , కెనడాలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రవాస భారతీయులు , కెనడా వెళ్లాలనుకునేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ బుధవారం ఓ అడ్వైజరీ కూడా జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News