రాఫెల్ మెరైన్ విమానాన్ని పరీక్షించిన భారత్!
కోల్‌కతా: రాఫెల్ యుద్ధ విమానం సముద్ర నమూనాను గోవా తీరంలో భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ నావికా యుద్ధ విమానంను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఐఎన్‌ఎస్ యుద్ధ నౌక అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ట్రయల్స్ నిర్వహిస్తోంది. దీనిని ఆగస్టులో ప్రవేశపెట్టనున్నారు. భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ డెక్‌పై నుంచి పరీక్షించిన రాఫెల్ మెరైన్ యుద్ధ విమానం బాగానే పనిచేస్తోందని భారత్‌లోని ఫ్రెంచి రాయబారి ఇమాన్యూల్ లెనిన్ మంగళవారం విలేకరులకు తెలిపారు. రాఫెల్–ఎం జెట్‌ను జనవరి నెల చివరలో 12 రోజులపాటు గోవా తీరంలో ఐఎన్‌ఎస్ హన్సా యుద్ధ నౌక నుంచి కూడా పరీక్షించారు. 283 మీటర్ల ఎత్తు నుంచి స్కై జంప్ రిహార్సలు కూడా చేశారు. భారత వాయుసేన ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తోందని కూడా ఫ్రెంచ్ రాయబారి లెనిన్ తెలిపారు. “ఇప్పటికే మేము 35 రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేశాము. 36వ యుద్ధ విమానాన్ని ఏప్రిల్ చివరికల్లా అందజేస్తాం” అని కూడా ఆయన తెలిపారు.