అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ విజేత భారత్
కౌలాలంపూర్: టీమిండియా అమ్మాయిలు అదరగొట్టేశారు. అలవోకగా రెండోసారి అండర్19 వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ప్రారంభ ఎడిషన్(2023)లో టైటిల్ దక్కించుకున్న భారత్ అమ్మాయిలు ప్రస్తుత ఎడిషనలోనూ విశ్వవిజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన అండర్ 19 మహిళల టి20 వరల్డ్ కప్ తుదిపోరులో భారత అమ్మాయిల జట్టు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై సునాయాస విజయం సాధించింది. మరో 52 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్‌రౌండ్ షోతో మరోసారి అదరగొట్టింది.
భారత బౌలింగ్ అదుర్స్
ఈ ఫైనల్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను భారత బౌలింగ్ దళం సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. ఈ టోర్నీలో బ్యాటింగ్‌లో చెలరేగిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఫైనల్లో బంతితోనూ అదరగొట్టేశారు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లను దక్కించుకున్నారు. పరుణిక సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలా రెండు వికెట్ల తీసుకోగా.. షబ్నం షకీల్ ఓ వికెట్ పడగొట్టింది. దీంతో దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు 20 ఓవర్లో 82 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. మీక్ వాన్ వూస్ట్(23), జెమా బోథా(16) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఏడుగురు దక్షిణాఫ్రికా బ్యాటర్ల సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు.
త్రిష ఆల్‌రౌండ్ షో..
అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత్ అమ్మాయిలు అలవోకగా లక్షాన్న అందుకున్నారు. అద్బుత ఫామ్‌లో ఉన్న తెలుగమ్మాయి గొంగడి త్రిష ఫైనల్‌లో దుమ్మురేపారు. 33 బంతుల్లోనే అజేయంగా 44 పరుగులు చేశారు. త్రిష చివరి వరకు నిలిచి టీమిండియాకు చరస్మరణీయ విజయాన్ని అందించింది. స్వల్ప లక్ష్యఛేదనలో కమళిని (8) త్వరగానే ఔటైనా.. త్రిష, సానికా చల్కే (26 నాటౌట్) దూకుడుగా ఆడారు. ముఖ్యంగా త్రిష హిట్టింగ్ చేస్తూ ముందుకు సాగారు. దీంతో భారత్ 11.2 ఓవర్లలో ఒక్క వికెటే కోల్పోయి 84 పరుగులు చేసింది. 52 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా విజయం సాధించింది.
ప్లేయర్ ఆఫ్ ది ట్రోర్నీగా త్రిష
ఈ మెగా టోర్నీలో భద్రాచలం అమ్మాయి, తెలుగు ప్లేయర్ గొంగడి త్రిష అద్భుత ప్రదర్శన చేశారు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 309 పరుగులతో అదరగొట్టారు. 77.25 యావరేజ్ నమోదు చేశారు. అండర్ 19 టి20 మహిళల ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించారు. బౌలింగ్‌లో ఏడు వికెట్లనూ త్రిష పడగొట్టారు. త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది. ఫైనల్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఈ తెలుగమ్మాయికే కైవసం అయింది.
గొంగడి త్రిష నయా చరిత్ర..
అండర్19 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ గొంగడి త్రిష (44 నాటౌట్, 3/15) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో టీమిండియా వరుసగా రెండోసారి ప్రపంచకప్ విజేతగా అవతరించింది. అయితే ఈ టోర్నీలో మన అమ్మాయిల అసాధారణ ప్రదర్శనతో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. తన సంచలన ఆల్ రౌండ్ ప్రదర్శనతో గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది. అంతకుముందు ఇటీవల జరిగిన ఆసియా కప్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచింది తెలుగుతేజం. ఈ యంగ్ బ్యాటర్ 110 పరుగులు చేసి.. మహిళల అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో మూడంకెల స్కోరు సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచింది. తద్వారా సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ గానూ నిలిచింది. ప్రస్తుత టోర్నీలోనూ శతకం బాదిన ఏకైక క్రికెటర్ కూడా ఆమెనే కావడం విశేషం. ఈ టోర్నీలోని అన్ని మ్యాచుల్లో వరుసగా 4, 27, 49, 40, 110, 35, 44 స్కోర్లు చేసింది త్రిష. మొత్తంగా 77.25 సగటుతో 309 పరుగులు సాధించి.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లోనూ రాణిస్తూ 7 వికెట్లతో అదరగొట్టింది.