Wednesday, January 22, 2025

మోడీ విజన్ 2047!

- Advertisement -
- Advertisement -

2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లతో భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా అలరారగలదని ప్రస్తుతం రూపొందుతున్న కేంద్ర ప్రభుత్వ 2047 విజన్ డాక్యుమెంట్ (దార్శనిక పత్రం) ప్రాథమిక అంచనాల వల్ల తెలిసిందని నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం చెప్పినట్టు సమాచారం.విజన్ డాక్యుమెంట్ అంటే బాగా గుర్తొచ్చేది ఒకనాటి విజన్ -2020, ఈ డాక్యుమెంట్ల లక్ష్య సాధనకోసం నిర్ణయించుకొన్న వ్యవధి ముగిసేనాటికి దానిని తయారు చేసిన పాలకులు అధికారంలో కొనసాగే అవకాశముండదు. కాని ఇటువంటి పత్రాలను తయారు చేసి వదిలిపెట్టడం ద్వారా తమ పాలనా సామర్ధ్యం వల్లనే దేశ ఆర్ధిక వ్యవస్థ సరైన గాడిలో ముందుకు దూసుకుపోతున్నదని పాలకులు ప్రజలను నమ్మింప జూస్తారు. విజన్ 2047 డాక్యుమెంట్ ను వచ్చే మూడు మాసాల్లో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేస్తారని తెలుస్తున్నది. అంటే వచ్చే లోక్ సభ ఎన్నికలకు మూడు, నాలుగు మాసాల ముందు ఈ పత్రం ప్రజల ముందుకు వస్తుంది. అందు చేత ఈ దార్శనిక పత్రం విడుదల చేయడం వెనుక గల ఉద్దేశం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

24 సంవత్సరాల తర్వాత ఉండే పరిస్థితులను ఇప్పుడే ఊహించడం కష్టం. ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి ) 3.7 ట్రిలియన్ డాలర్లు, అంటే అప్పటికి ఇది 9 రెట్లు పెరగనున్నది అని అనుకోవాలి. మనది వ్యవసాయధార దేశం. మన దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా కేవలం 17 శాతం మాత్రమే. దేశ జనాభాలో 58 శాతం మంది ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్నారు. అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగానికి జిడిపిలో అత్యధిక వాటా కల్పించాలంటే దానిని గరిష్ఠ స్థాయి ఉత్పాదకంగా తయారు చేయాలి, లాభసాటి రంగంగా తీర్చి దిద్దాలి, రైతుకు తాను నిలబడిన నేలపై భరోసాను పెంచాలి. వచ్చే 24 సంవత్సరాల్లో ఇది జరుగుతుందా, అందుకు తగిన వాతావరణాన్ని, ముందస్తు రంగాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదా? 2003-04లో జిడిపి లో 20 శాతం గా ఉన్న వ్యవసాయం వాటా 17 శాతానికి ఎందుకు పడిపోయింది? వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించి రైతు కాళ్ళ కింది భూమిని కదిలించివేయాలని ప్రధాని మోడీ వ్యూహ రచన చేశారు. ఏడాది పాటు సాగిన రైతు పోరాటానికి భయపడి ఆ మూడు చట్టాలను గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపసంహరించుకొన్నారు. అయినా రైతులపై ఆయనలోని అయిష్టత తగ్గినట్టులేదు.

రైతులు తమ పోరాటం విరమించుకొన్నప్పుడు వారికిచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదు. అలాగే వ్యవసాయోత్పత్తి త్వరగా పెరగడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన నత్తనడకన సాగుతున్నది. నదుల అనుసంధానం సంగతి సరే, ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్న నీటినయినా గరిష్ఠ స్థాయిలో సాగు క్షేత్రాలకు తరలించే కృషి జరగడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి రెండు దశాబ్దాల్లో జిడిపి లో వ్యవసాయం వాటా 48 నుంచి 60 శాతం గా ఉండేది మళ్ళీ ఆ స్థాయిని అందుకోగలమా? వ్యవసాయం నుంచి వచ్చే లాభాల్లో తల వాటా పండించిన రైతుకి చెందినప్పుడే అది సాధ్యమవుతుంది. జిడిపిలో సర్వీసుల రంగం వాటా అత్యధికంగా 53.89 శాతం. అయితే ఆ స్థాయిలో దేశ ప్రజలకు అది ఉపాధి కల్పించడం లేదు 2021 లెక్కల ప్రకారం కేవలం 30 శాతం పైచిలుకు జనాభా యే సర్వీసుల రంగం మీద బతుకుతున్నారు. పారిశ్రామిక రంగం బాగా వెనుకబడి ఉన్న సంగతి సుష్పష్టం. తయారీ రంగం బొత్తిగా నీరసించిపోయింది. ఈ నేపథ్యంలో జిడిపి ప్రాధాన్య క్రమంలో మార్పులు రావాలి. పారిశ్రామిక, తయారీ రంగాల వాటా బాగా పెరగాలి.

అందుకు మనం చేస్తున్నది తక్కువ. ఇప్పుడే కాదు ఎప్పుడైనా జిడిపి పెరుగుదల అత్యంత హర్షణీయమే కాని అదే రీతిలో దేశ ప్రజల పేదరిక నిర్మూలన జరుగుతున్నదా, నిరుద్యోగుల సంఖ్య తగ్గిందా, అర్హతకు తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయా అనే ప్రశ్నలు సమాధానం లేనివిగా ఉన్నాయి. 25 ఏళ్ల లోపు 42.3 శాతం పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారు. కనీవినీ ఎరుగని నిరుద్యోగం తాండవిస్తున్నది. పేద పిల్లల్లో పోషకాహారలేమి ఇంకా పెద్ద సమస్యగా వున్నది. నాణ్యమైన విద్య వైద్యాలు సాధారణ జనానికి బహుదూరంగా ఉన్నాయి.ఈ దుర్భర జన జీవన పరిస్థితుల నేపథ్యంలోనే ఏ గొప్పతనాన్నైనా చూడాలి. ప్రధాని ఘనంగా చెప్పుకొన్న స్వావలంబన, మేక్ ఇన్ ఇండియా వంటి ఆలోచనలు గొంగళిని తలపిస్తున్నాయి.భవిష్యత్ విజన్ పత్రాలు తయారు చేయడం సుళువే కాని ప్రజల బతుకుల్లో మెరుగైన మార్పు తీసుకురావడం సులభం కాదు. మన ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో మూడోదిగానో, రెండోదిగానో అభివృద్ధి చెందడంకంటే దేశ ప్రజలు ఏ మేరకు సుభిక్షంగా ఉన్నారన్నది ముఖ్యం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News