భోపాల్: భారత్ కు మరో ఎనిమిది చిరుతలు రానున్నాయి. దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్వానా నుండి రెండు దశల్లో చిరుతలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA).. మే నాటికి నాలుగు చిరుతలను బోట్స్వానా నుండి ఇండియాకు తీసుకురానుందని అధికారులు తెలిపారు. తర్వాత, మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నారు. ప్రాజెక్ట్ చిరుతలో భాగంగా వీటిని తీసుకువస్తున్నట్లు ఎన్టీసీఏ అధికారులు సమాచారం అందించారని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. “దక్షిణాఫ్రికా, బోట్స్వానా, కెన్యా నుండి మరిన్ని చిరుతలను భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రెండు దశల్లో ఎనిమిది చిరుతలను భారతదేశానికి తీసుకురానున్నారు” అని పేర్కొంది.
కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చిరుత ప్రాజెక్ట్ కోసం రూ.112 కోట్లకు పైగా ఖర్చు చేశామని, మొత్తం ఖర్చులో 67 శాతం మధ్యప్రదేశ్‌లో చిరుత పునరావాసానికి వెళుతున్నట్లు NTCA అధికారులు వెల్లడించారు. ప్రాజెక్ట్ చీతా కింద, రాజస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న గాంధీ సాగర్ అభయారణ్యంలో చిరుతలను దశలవారీగా తరలించడం జరుగుతుంది. అందువల్ల, అంతర్రాష్ట్ర చిరుత సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ మధ్య సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరింది.