న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపు లోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్రహోం మంత్రిత్వశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. అయితే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం అందించారు. కొవిడ్ కట్టడి కోసం 2020 మార్చి 24 న విపత్తు నిర్వహణ చట్టం కింద తొలిసారిగా ఈ నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు కేంద్రం జారీ చేసింది. ఆ తర్వాత కేసుల సంఖ్యను బట్టి పలుమార్లు వీటిల్లో మార్పులు, చేర్పులు చేసింది. అయితే గత ఏడు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యం లోనే నిబంధనలను పూర్తిగా తొలగించాలని హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. కరోనా పరిస్థితులు మెరుగవ్వడంతో పాటు మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తమ సామర్థాన్ని పెంచుకొని సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ పరిగణన లోకి తీసుకుని నిబంధనలు మరికొంత కాలం పొడిగించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. మార్చి 31 న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుంది. ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదు అని కేంద్రహోం కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
India to End All Covid Restrictions from March 31st