Wednesday, November 6, 2024

ఎస్‌సిఒ భేటీ

- Advertisement -
- Advertisement -

భారత అధ్యక్షతన జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) శిఖరాగ్ర సభ విడుదల చేసిన న్యూఢిల్లీ డిక్లరేషన్ వాతావరణ, పర్యావరణ పరిరక్షణ రంగంలో సహకారానికి సభ్య దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. వాతావరణంపై వ్యతిరేక ప్రభావం చూపే మార్పులను నిరోధించాలని ప్రకటించింది. 2024ను ఎస్‌సిఒ పర్యావరణ సంవత్సరంగా ప్రకటించడానికి అంగీకరించింది. దీనిని ఎంతైనా హర్షించాలి. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి ముప్పు పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఎంతైనా ప్రాధాన్యమున్నది. అయితే ఇతరత్రా సభ్య దేశాల మధ్య వైరుధ్యాలను ముఖ్యంగా భారత చైనా, భారత పాకిస్తాన్‌ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిని తొలగించడానికి తగు సూచనలేవీ ఈ వేదిక నుంచి రాకపోడం దురదృష్టకరం. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో కాకుండా ప్రత్యక్ష వేదిక మీద జరిపి వుంటే అగ్ర నేతల మధ్య మరింత అవగాహనకు అవకాశం కలిగి వుండేదని భావించడంలో తప్పు లేదు. ఈసారి ఎస్‌సిఒలో ఇరాన్ చేరడం విశేషం.

చైనా, ఇండియా, కజకిస్థాన్, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్‌లు సభ్యులుగా ఉన్న ఎస్‌సిఒలో నాలుగు అణ్వస్త్ర దేశాలున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ కొత్త ప్రచ్ఛన్న యుద్ధం ప్రమాదాన్ని గురించి హెచ్చరించారు. ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేయగల కొత్త ప్రచ్ఛన్న యుద్ధం పట్ల జాగరూకతగా ఉండాలని సూచించారు. ఉగ్రవాదులపై సంయుక్త దాడుల ద్వారా ఉమ్మడి భద్రతను కాపాడుకోవాలన్నారు. జిన్‌పింగ్ మంచి మాటే చెప్పారు. అయితే భారత దేశంపై పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న టెర్రరిస్టుల సంగతి ఏమిటి? వారిపై ఐక్యరాజ్య సమితిలో కూడా ఈగ వాలనివ్వకుండా చైనా ఎందుకు కాపాడుతున్నట్టు? ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేసి వుంటే బాగుండేది. న్యూఢిల్లీ డిక్లరేషన్‌కు రష్యా మద్దతు ఇస్తుందని పుతిన్ హామీ ఇచ్చారు. భారత్ ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించిన తీరును ఆయన మెచ్చుకొన్నారు. ఆంక్షలు, కవ్వింపులను రష్యా వ్యతిరేకిస్తుందని పుతిన్ ప్రకటించారు. ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలకు దారి తీసే పరిస్థితులు మరింత చిక్కబడుతున్నాయని అదే సందర్భంలో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం పొంచి వున్నదని ఆయన అన్నారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ అందరూ కలిసి ఉగ్రవాద బెడదను ఈ ప్రాంతం నుంచి, మొత్తం ప్రపంచం నుంచి తరిమికొట్టడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సభ్య దేశాల మధ్య సామరస్య దృక్పథం వ్యక్తం కావడం సంతోషించవలసిన విషయమే కాని, వైరుధ్యాలను పరిష్కరించుకొనే వైపు తీసుకునే చర్యల ప్రస్తావన లేకపోడం ఒక ప్రధానమైన లోపం. ఇండియా, చైనాలు రెండూ రష్యా నుంచి ఆయిల్ పరంగా విశేషమైన లబ్ధి పొందుతున్నాయి. భారత దేశం ఇటు రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్‌ను పొందుతూనే దానికి బద్ధ శత్రువైన అమెరికాతో సంబంధాలను ఎప్పటి కంటే ఎక్కువగా పటిష్టపరచుకోగలిగింది. ఇది తాత్కాలికమైన పరిస్థితి. దూర దృష్టితో చూసినప్పుడు ఒక తీవ్ర సంక్షోభం తలెత్తితే ఎవరు ఎటువైపు వుంటారనేది ముఖ్యం. భారత, పాకిస్థాన్‌ల విషయంలో చైనా ఎటు వుంటుందో తెలిసిందే. అందుచేత చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్స్ చొరవ ప్రాజెక్టులో చేరడానికి ఇండియా ససేమిరా అంటోంది. గత ఏడాది సమర్‌ఖండ్ డిక్లరేషన్ సమయంలోనూ ఈ విషయంలో ఇదే అభిప్రాయాన్ని ఇండియా ప్రకటించింది.

ఈ ప్రాజెక్టును చైనా, పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌గా భారత్ పరిగణిస్తున్నది. అయితే ఎస్‌సిఒలోని కజక్‌స్తాన్, కిర్గిజ్‌స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉబ్జెకిస్తాన్‌లు ఈ ప్రాజెక్టులో ఇప్పటికే చేరా యి. భారత, చైనాల మధ్య విభేదాలు, దూరాలు కొనసాగినంత కాలం ఎస్‌సిఒ ఒక పటిష్టమైన ప్రాంతీయ సహకార సంస్థగా నిరూపించుకోలేదని చెప్పవచ్చు. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంస్థ సార్క్ కూడా సభ్య దేశాల మధ్య విభేదాల బరువుతో ముందుకు సాగలేకపోతున్న సంగతి తెలిసిందే. పసిఫిక్ సముద్ర జలాలను చైనా పెత్తనానికి దూరంగా వుంచడం కోసం భారత దేశం అమెరికాతో కూడిన క్వాడ్‌లో చేరింది. అమెరికా, రష్యాలకు అమెరికా, చైనాలకు సమాన దూరంలో భారత దేశం వుండగలిగితే ఈ ప్రాంత దేశాల మధ్య మరింత పటిష్టమైన సహకారం సాధ్యమవుతుంది. అలాగే పాకిస్తాన్, ఇండియాలకు సమాన దూరంలో చైనా వుండగలిగితే అది ఎస్‌సిఒ వంటి సంస్థల ద్వారా ప్రాంతీయ సహకారం, శాంతి భద్రతలను కాపాడుకోడానికి దోహదం చేస్తుంది.

ఈసారి ఎస్‌సిఒలో కొత్త సభ్యదేశంగా ఇరాన్ చేరడం ఆనందించవలసిన పరిణామం. ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య మైత్రీ బంధాన్ని నిర్మిస్తున్న ఖ్యాతిని చైనా దక్కించుకొన్నది. అది మరిన్ని మంచి నిర్ణయాల వైపు అడుగులు వేసి భారత దేశంతో గల సరిహద్దు సమస్యను కూడా శాంతియుతంగా పరిష్కరించుకోడానికి తోడ్పడితే ప్రాంతీయ సహకారం వర్ధిల్లుతుంది. వైరుధ్యాల అగ్గిని రాజేస్తూ సహకార స్నేహాల కోసం అర్రులు చాచడం ప్రయోజన రహితం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News