Thursday, January 23, 2025

సంస్కరణలకు కాలం చెల్లిందా?

- Advertisement -
- Advertisement -

నేడు భారత్ అంతర్జాతీయంగా ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు, కొద్ది కాలంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందనే భరోసా కలగడానికి 1991 ప్రాంతంలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలే కారణం. ఈ సంస్కరణలు బహుముఖంగా పలు రంగాలకు విస్తరించాయి. కీలకమైన రక్షణ రంగంలో కూడా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అయితే, కారణాలు ఏమైతేనేమి దేశంలో ఇప్పటికే 60 శాతానికి పైగా ప్రజలకు జీవితాధారంగా ఉంటున్న వ్యవసాయ రంగంలో మాత్రం సంస్కరణలు తీసుకు రాలేకపోతున్నారు. మొదటిసారిగా ప్రధాని మోడీ సాహసించి మూడు వ్యవసాయ బిల్లులు తీసుకురావడం ద్వారా ఈరంగంలో కూడా సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు సాహసోపేత చొరవ చూపారు. కానీ, ఆయన మాటలలోనే ‘కొందరు రైతులను ఒప్పించడం’లో విఫలం కావడంతో ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకో వలసి వచ్చింది. ఈ చట్టాల ప్రధాన లక్ష్యం రైతులకు తమ ఉత్పత్తులను అమ్ముకోవడంలో స్వేచ్ఛ కలిగించడం.

పారిశ్రామిక ఉత్పత్తుల మాదిరిగా రైతులు సహితం తమ ఉత్పత్తులను ఎక్కడై నా, ఎప్పుడైనా తమ షరతులకు లోబడి అమ్ముకొనే సౌలభ్యం కలిగించడమే వ్యవసాయ సంస్కరణల ఉద్దేశం. మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ‘సులభతరం వాణిజ్యం’లో కూడా మన దేశం గణనీయంగా ముందు వరసలకు ఎగబాకుతూ వస్తున్నది. దేశంలో కంట్రోల్ ఆర్ధిక వ్యవస్థ నుండి స్వేచ్ఛాయుత వ్యవస్థ వైపు సాగుతున్న ప్రయాణానికి అద్దంపట్టే విధంగా ఈపరిణామం మన ఆర్థిక వ్యవస్థ మరింతగా బలోపేతం అయ్యేందుకు దోహద పడుతున్నది. అయితే, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే మనం సంస్కరణలతో, ముఖ్యంగా వ్యవసాయ సంస్కరణలతో తిరోగమనంలో ప్రయాణం చేస్తున్నామనే ఆందోళన కలుగుతుంది. తాజాగా బాస్మతేతర బియ్యం ఎగుమతుల నిషేధం. అలాగే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులను పరిమితం చేస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ నిర్ణయాలు మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యేందుకు ఏమాత్రం తోడ్పడబోవని స్పష్టం అవుతున్నది. అంతకు మించి వాణిజ్య, పరిశ్రమల రంగాలను తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి.

దేశంలో ఆహార ధరలను అదుపులో ఉంచాలనే పేరుతో బియ్యం ఎగుమతులను నిషేధించారు.ఇక ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై పరిమితులు విధించడానికి ప్రధానంగా వ్యవస్థల భద్రత, దేశీయ వస్తువులను ప్రోత్సహించడం, ఈ రంగంలో పెద్దన్నగా ఉన్న చైనాతో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం అనే మూడు కారణాలు కనిపిస్తు న్నాయి. కానీ అంతకు వారం రోజుల ముందే స్వదేశీ లాప్‌టాప్ ఉత్పత్తి చేస్తున్నామని రిలయన్స్ ప్రకటించడం, ఆ తర్వాత వాటి దిగుమతులపై ఆంక్షలు విధించడం గమనిస్తే వారి ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు కలుగుతున్నా యి. ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత కంప్యూటర్లు, ట్యాబ్‌లు నేడు మన జీవితంలో భాగంగా మారాయి. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు, వ్యాపారుల నుంచి రైతుల దాకా అందరికీ ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అత్యంత అవసరం. వీటిని దిగుమతి చేసుకోవడానికి లైసెన్సులు తీసుకోవాలని ఈ కంపెనీలను హటాత్తుగా ఆదేశించ డం వల్ల ఈ సరఫరాలపై కచ్చితంగా ప్రభావం చూపించడంతో పాటుగా వాటి ధరలు కూడా పెరుగుతాయి.

ఈ నిర్ణయం దేశ ఆర్థిక పురోగతిని సైతం దెబ్బతీస్తుంది. పరిశ్రమలతో కానీ, పార్లమెంటులో కానీ సరైన చర్చ లేకుండా ఒక వంక పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండగా హటాత్తుగా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు. ఏదేమైనా దేశ హితం కోసం ఈ నిర్ణయం తీసుకున్న ట్లు అనిపించడం లేదు. మరోవంక ప్రపంచ బియ్యం ఎగుమతుల తో 40% వాటా కలిగిన భారత్ బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే అంతర్జాతీయ ఆహార సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గత కొన్నేళ్లుగా భారత్ పెద్ద మొత్తంలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. దీంతో మన వ్యాపారులు దాదాపుగా 60 దేశాలకు సుమారుగా 4550 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతి చేయడం ప్రారంభించారు. ఈ ఎగుమతులు వ్యాపారులకే కాకుండా రైతులకు కూడా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అయితే హటాత్తుగా బియ్యం ఎగుమతులను నిషేధించడం ఈ రంగానికి మంచి రాబడులు రాకుండా చేయడమే కాకుండా నమ్మకమైన సరఫరాదారుగా భారత్ పట్ల ఇప్పటి వరకు బియ్యాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బ తీసింది.

దేశంలోని ప్రభుత్వ గోడౌన్లలో నిర్దేశిత 1.50 కోట్ల టన్నులకు మించి దాదాపు 2.59 కోట్ల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ నిషేధం ఎందుకు అవసరమైందో ప్రభుత్వ వర్గాల నుంచి సరైన వివరణ కూడా లేదు. ఏదేమైనా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పరంగా మన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన ఘనత పొందిన ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలకు అనువుగా మాత్రం లేవని చెప్పాలి. గత ఏడాది మే లో గోధుమల ఎగుమతులను నిషేధించారు. పంచదార ఎగుమతులపై ఆంక్షలు విధించారు. ఆ తర్వాత బియ్యం, నూకల ఎగుమతులపై నిషేధం విధించారు.ఈ విధంగా తరచుగా ఆహార ఉత్పత్తులపై ప్రభుత్వం అకారణంగా ఆంక్షలు విధించడం ద్వారా రైతులే విపరీతంగా నష్టపోతున్నారు. మరో వైపు అకాల వర్షాల కారణంగా ఈ సీజన్‌లో చెరకుసాగు భారీగా తగ్గుతుందని, దానితో అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ లో పంచదార ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందన్న అంచనాలతో ప్రభుత్వం త్వరలో పంచదార ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు పంచదార పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగితే మొదటగా లాభపడేది రైతులే. వారి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, వారికి కొంచెం ఎక్కువ ధర గిట్టుబాటు అవుతుంది. కానీ వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగినప్పుడల్లా కొరతలు పేరుతో, వినియోగదారులపై భారం పెరుగుతుందనే పేరుతో వెంటనే ఎగుమతులపై ఆంక్షలు విధించడం లేదా దిగుమతులకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఉదాహరణకు మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు కొంచెం పెరగగానే ప్రభుత్వం ఎగుమతులు రద్దు చేస్తుంది. పైగా దిగుమతులకు అనుమతి ఇస్తుంది. ఆ విధంగా చేయడంతో ఎక్కువగా నష్టపోయేది రైతులే కావడం గమనార్హం. మోడీ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెడుతూ రైతులకు తమ ఉత్పత్తులను అమ్ముకొనే స్వేచ్ఛ కలిగించడం ద్వారా వారు తమ ఆదాయాలను పెంచుకొనే అవకాశం కల్పించాలనే ప్రాథమిక లక్ష్య సాధనకు శ్రీకారం చుట్టారు. కానీ అందుకు భిన్నంగా ప్రభుత్వం విధానాలు సాగుతున్నాయి. మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను కొన్ని వత్తిడుల కారణంగా, అన్నింటికీ మించి రాజకీయ కారణాలతో ఉపసంహ రించుకుంది.

అంతటితో ఆగకుండా వ్యవసాయ చట్టాల స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రభుత్వ విధానాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యాపార, వాణిజ్యాలలో ప్రభుత్వ నియంత్రణలు అక్రమ నిల్వలకు, బ్లాక్ మార్కెట్ వ్యాప్తికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని మన దశాబ్దాల అనుభవాలు స్పష్టం చేస్తున్నా యి. పైగా, పలుకుబడి గల కొన్ని కార్పొరేట్ వర్గాలు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని తమకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు రూపొందే విధంగా ప్రభావితం చేస్తున్నాయి. ఐదేళ్లలో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని ప్రధాని మోడీ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడా విషయాన్ని ప్రస్తావించడం లేదు. కనీసం ఆ లక్ష్య సాధనలో ఏ మేరకు ముందడుగు వేసారో కూడా సమీక్ష జరిపే సాహసం కూడా చేస్తున్నట్లు లేదు. రైతుల జీవన ప్రమాణాలలో చెప్పుకో దగిన మార్పులు మాత్రం రావడం లేదు. వివిధ ప్రాంతాలలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.ఏదేమైనా అడిగితే మద్దతు ధరలు పెంచుతున్నామని అంటుం టారు. కానీ మద్దతు ధరలు ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులు దళారుల చేతులకు చేరిన తర్వాతనే అమలు జరుగుతూ ఉండటాన్ని చూస్తున్నాము.

పైగా, దేశంలో వందల కొలది రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఉంటే కేవలం 26 ఉత్పత్తులకు మాత్రమే మద్దతు ధర వర్తిస్తుంది. వాటిల్లో సహితం మూడు లేదా నాలుగు ఉత్పత్తులకు మాత్రమే ధర తగ్గినప్పుడు కొనుగోలు జరిపి, రైతులకు ఉపశమనం కల్పించ గల యంత్రాంగం ప్రభుత్వం వద్ద ఉంది. వినియోగదారులపై భారం తగ్గించాలనే ప్రభుత్వం ఆందోళనను అర్థం చేసుకోగలము. కానీ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారైన రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉండకూడదని గ్రహించాలి. ఇటువంటి విధానాలు మొత్తం మీద వ్యవసాయ, గ్రామీణ రంగాలకు పిడుగుపాటు వంటివని తెలుసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News