Thursday, January 23, 2025

కెనడా పౌరులకు వీసా సర్వీసులు భారత్ పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

టొరంటో : దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ వీసా సేవల్ని నిలిపివేసిన భారత్ .. తిరిగి కెనడా పౌరుల కోసం ఆ సేవల్ని పునరుద్ధరించింది. ఈమేరకు ఒట్టావా లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఎంట్రీవీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 26 (గురువారం) నుంచి ఈ వీసా సేవల్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది. భద్రతా కారణాల వల్ల ఇంతకాలం వీటిని నిలిపివేయాల్సివచ్చిందని, సమీక్ష అనంతరం తిరిగి ఈ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది.వీసా సర్వీస్‌ల్ని గురువారం నుంచి పునరుద్ధరించాలన్న భారత్ నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. ఈ ఆందోళనకర సమయంలో కెనడా వాసులకు ఇది సానుకూల సంకేతమని అభిప్రాయపడింది. ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంలో భారత్‌కెనడా మధ్య దౌత్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత వీసాల జారీ ప్రక్రియను భారత్ నిలిపివేసింది. బుధవారం ఆ నిర్ణయాన్ని కొంత మార్చుకుంది. “ భారత దౌత్యవేత్తల రక్షణ విషయంలో తాజాగా కెనడా తీసుకున్న కొన్ని నిర్ణయాలను పరిగణన లోకి తీసుకొని, భద్రతా పరిస్థితిని సమీక్షించాం. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా, సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించాం” అని ఒట్టావా లోని భారత్ హైకమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిపై కెనడా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ స్పందించారు. ఆందోళనకర సమయాల తర్వాత భారత్ చర్య సానుకూల సంకేతమని, ఎందరో కెనడా వాసులకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని స్పందించారు. భారత్‌తో దౌత్యపరమైన ఆందోళన ఎన్నో వర్గాల్లో భయాన్ని సృష్టించిందని, ఇలాంటి పరిణామాల సమయంలో రద్దు అనేది మొదటి నిర్ణయం కాకూడదన్నదే తమ అభిప్రాయంగా పేర్కొన్నారు. భారత్ నిర్ణయంపై మరో మంత్రి హర్జిత్ సజ్జన్ స్పందిస్తూ ఇది మంచి నిర్ణయమన్నారు. అయితే దీనివెనుక ఉన్నభారత్ ఉద్దేశమేంటో తమకు తెలియదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News