జూన్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 70 లక్షల మంది
రెండు, మూడు స్థానాల్లో చైనా, అమెరికా: ఎరిక్సన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : చౌకైన ఇంటర్నెట్ ఇచ్చేందుకు టెలికాం మార్కెట్లో గట్టి పోటీ నెలకొనడం వల్ల భారతదేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య జూన్ త్రైమాసికంలో 70 లక్షలు పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న దేశంగా భారత్ అవతరించింది. ఎరిక్సన్ నివేదిక ప్రకారం, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో 70 లక్షలకు పైగా మొబైల్ సబ్‌స్క్రైబర్లు పెరిగారు. ఈ జాబితాలో చైనా 50 లక్షల మంది కస్టమర్లను జోడించి రెండో స్థానంలో, అలాగే 30 లక్షల కస్టమర్లతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 40 మిలియన్ల మంది కొత్త సబ్స్క్రైబర్లు చేరారు. ఎరిక్సన్ నివేదిక ప్రకారం, తక్కువ రేట్లకే భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు, టెలికాం మార్కెట్లో గట్టి పోటీ కారణంగా వినియోగదారులు పెరిగారు. ఇదే త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 5జి మొబైల్ వినియోగదారుల సంఖ్య కూడా 130 కోట్లు దాటింది. ఈ ఏడాది జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4 కోట్ల మంది కొత్త సబ్స్క్రైబర్లు చేరారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కస్టమర్ల సంఖ్య 830 కోట్లకు పెరిగింది.
భారత్‌లో 112.5 కోట్ల మంది
భారతదేశంలో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 70 లక్షలు పెరిగి 112.5 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో చైనాలో మొబైల్ చందాదారుల సంఖ్య 5 మిలియన్లు పెరిగి 1,695 మిలియన్లకు చేరుకుంది. దీంతో పాటు జూన్ త్రైమాసికంలో 5జి వినియోగదారుల సంఖ్య 175 మిలియన్లు పెరిగి 130 మిలియన్లకు చేరుకుంది. దేశంలో 260 కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు 5జి సేవలను ప్రారంభించారని, అందులో దాదాపు 35 సర్వీస్ ప్రొవైడర్లు స్టాండలోన్ (ఎస్‌ఎ) నెట్‌వర్క్‌లను ప్రారంభించారని నివేదిక పేర్కొంది. బ్రాడ్‌బ్యాండ్ మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లలో 88 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ త్రైమాసికంలో ప్రత్యేక మొబైల్ కస్టమర్ల సంఖ్య 610 కోట్లకు చేరుకుంది. 2023 రెండో త్రైమాసికంలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి దాదాపు 100 మిలియన్లకు చేరుకుంది. అదే సమయంలో మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లో బ్రాడ్‌బ్యాండ్ వాటా 88 శాతానికి పెరిగింది. 5జితో పాటు 4జి సబ్‌స్క్రైబర్‌లు కూడా 11 మిలియన్లు పెరిగారు.
3.74 లక్షల మంది మొబైల్ వినియోగదారులు
దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నివేదిక ప్రకారం, 2023 జూన్‌లో దేశవ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య 3.74 లక్షలు పెరిగి 114.36 కోట్లకు చేరుకుంది. జియో, ఎయిర్‌టెల్ కొత్త కస్టమర్‌ల పెరుగుదల కొనసాగుతోంది. ఇక బిఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ ఐడియా నిరంతరం తమ వినియోగదారులను కోల్పోతున్నాయి.