Friday, December 20, 2024

సౌతాఫ్రికా గడ్డపై టీమిండియాకు సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సౌతాఫ్రికా గడ్డపై జరిగే మూడు ఫార్మాట్‌ల సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టి20లు, 3 వన్డేలు, మరో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను భారత్ నియమించింది. టి20 టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు కెఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. పరిమిత ఓవర్ల సిరీస్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తదితరులు అందుబాటులో ఉండడం లేదు. అయితే వీరిద్దరూ టెస్టు సిరీస్‌లో మాత్రం జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఇక సౌతాఫ్రికా జరిగే సిరీస్ భారత్‌కు తేలికేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వన్డేల్లో భారత్‌పై దక్షిణాఫ్రికాకు మెరుగైన రికార్డు ఉంది. ఈ సిరీస్‌లోని ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగానే ఉన్నా సొంత గడ్డపై ఆడుతున్న సఫారీలను ఓడించాలంటే అసాధారణ ఆటను కనబరచక తప్పదు. దీనికి తోడు పరిమిత ఓవర్ల సిరీస్‌లో సీనియర్లు చాలా మంది దూరంగా ఉంటున్నారు.ఇలాంటి స్థితిలో ఆతిథ్య జట్టును ఓడించడం భారత్‌కు అంత సులువేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టి20లో కూడా టీమిండియా యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆడిన జట్టునే దాదాపు ఈసారి కూడా ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆసీస్ సిరీస్‌లో మెరుపులు మెరిపించిన యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, శ్రేయస్‌అయ్యర్‌లు ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. తాజాగా శుభ్‌మన్ గిల్ కూడా చేరడంతో జట్టు మరింత బలోపేతంగా మారింది. కెప్టెన్ సూర్యకుమార్‌కు టి20లలో మెరుగైన రికార్డు ఉండడం కూడా సానుకూల పరిణామంగా చెప్పాలి.

కానీ, సౌతాఫ్రికాకు కూడా పొట్టి ఫార్మాట్‌లో మంచి రికార్డే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఆ జట్టులో కొదవలేదు. కెప్టెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కొ జాన్సెన్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, కొయెట్జి, ఎంగిడి, తబ్రేస్ షంసి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉన్నారు. దీంతో టి20లలో సౌతాఫ్రికాతో భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. వన్డేల్లో కూడా సఫారీలు బలంగానే ఉన్నారు. మిల్లర్, మార్‌క్రమ్, హెండ్రిక్స్, వండర్ డుస్సెన్, కేశవ్, క్లాసెన్, షంసి, ముల్లర్, ఫెహ్ల్లుక్‌వాయో, బార్త్‌మన్ వంటి స్టార్లతో జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. టెస్టుల్లోనూ సౌతాఫ్రికా బలమైన జట్టుగానే ఉంది. కెప్టెన్ బవుమా, డీన్ ఎల్గర్, మార్‌క్రమ్, జాన్సెన్,వెర్రిన్నె, పీటర్సన్‌లతో జట్టు సమతూకంగా ఉందనే చెప్పాలి. ఇలా మూడు ఫార్మాట్‌లలోనూ బలంగా ఉన్న సౌతాఫ్రికాతో జరిగే సిరీస్ టీమిండియా పరీక్ష వంటిదేనని చెప్పక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News