న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) తేవాల్సిన అవసరం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. ఏ ఒక్క ముస్లిం మహిళ కూడా తన భర్తకు భార్యలు ఉండాలని కోరుకోదని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో ముస్లిం మహిళలు గౌరవంగా బతకాలంటే ట్రిపుల్ తలాక్ తరహాలో ఉమ్మడి పౌరస్మృతి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈమేరకు ఆయన విలేఖరులతో మాట్లాడారు. తనను కలిసిన ముస్లిం మహిళలందరూ ఉమ్మడి పౌరస్మృతి కావాలని కోరుతున్నట్టు హిమంత పేర్కొన్నారు.
నేను హిందువుని, నాకు ఉమ్మడి పౌరస్మృతి ఉంది. నా సోదరికి , నా కుమార్తెకు రక్షణ ఉంది. ఇదే తరహాలో ముస్లిం కుమార్తెలకూ రక్షణ కావాలి.” అని హిమంత పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్ తదితర ముఖ్యమంత్రులు ఉమ్మడి పౌరస్మృతిపై ఆలోచన చేస్తున్నారు. బిజేపికి చెందిన ముఖ్యమంత్రులు ఉమ్మడి పౌరస్మృతి గురించి వ్యాఖ్యలు చేయడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖండించింది. ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీ వ్యతిరేక చర్య అని పేర్కొంది.