Wednesday, March 12, 2025

వాణిజ్య ఒప్పందం సంప్రదింపులకు భారత్,యుఎస్ యోచన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్, యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులకు యోచిస్తున్నాయని, మార్కెట్ సదుపాయం పెంపు, దిగుమతి సుంకం, నాన్ టారిఫ్ అవరోధాలు తగ్గింపు, సప్లయి చైన్ సమీకృతం హెచ్చింపుపై రెండు దేశాలు దృష్టి కేంద్రీకరిస్తాయని ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లోక్‌సభలో ఒక ప్రశ్నకులిఖితపూర్వక సమాధానం ఇస్తూ, ప్రస్తుతానికి భారత్‌పై యుఎస్ ప్రతీకార లారిఫ్‌లు విధించడం లేదని వెల్లడించారు. ‘పరస్పర ప్రయోజనకర, బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు జరపాలని రెండు దేశాలు యోచిస్తున్నాయి. మార్కెట్ సదుపాయం పెంపు, టారిఫ్, నాన్‌టారిఫ్ అవరోధాల తగ్గింపు, సప్లయి చైన్ సమీకృతం హెచ్చింపుపై రెండు దేశాలు దృష్టి కేంద్రీకరించగలవు’ అని ఆయన తెలిపారు.

యుఎస్ ఫిబ్రవరి 13న ప్రతీకార వాణిజ్య, టారిఫ్‌ల మెమోరాండం జారీ చేసింది. ఆ మెమోరాండం ప్రకారం, వాణిజ్య భాగస్వాములు అనుసించిన ఎటువంటి ప్రతీకారేతర వాణిజ్య ఒప్పందాల నుంచి అమెరికాకు ఎదురయ్యే హానిపై దర్యాప్తునకు యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి, యుఎస్ వాణిజ్య ప్రతినిధి సముచిత చర్యలు తీసుకుని, ప్రతి వాణిజ్య భాగస్వామికి వివరణాత్మక ప్రతిపాదిత పరిష్కారాలతో ఒక నివేదిక అందజేస్తారు. ప్రభుత్వం విధించే, వసూలు చేసే, దేశంలోకి విదేశీ సరకులు తీసుకువచ్చే సంస్థలు చెల్లించే దిగుమతి సుంకాలే టారిఫ్‌లు. క్రితం నెల ప్రధాని నరేంద్ర మోడీ వాషింగ్టన్ పర్యటన సమయంలో 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు ద్వివిధ వాణిజ్యాన్ని రెండింతలు పైగా చేయాలని, 2025 శీతాకాలం నాటికి పరస్పర ప్రయోజనకర, బహుళ రంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశపై సంప్రదింపుల జరపాలని రెండు దేశాలు కృతనిశ్చయాన్ని ప్రకటించాయి.

పరస్పర ప్రయోజనకరమైన, నిష్పాక్షికమైన రీతిలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల పెంపుదలకు, విస్తరణకు యుఎస్‌తో భారత్ సమాలోచనలు సాగిస్తూనే ఉంటున్నదని కూడా జితిన్ ప్రసాద తెలియజేశారు. ‘ఇది ప్రస్తుతం సాగుతున్న ప్రక్రియ. వాణిజ్య బంధాలు, ఎగుమతి గమ్యస్థానాలు విస్తృతి దిశగా భారతీయ ఎగుమతిదారులు కృషి చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. వాణిజ్యం క్రమబద్ధీకరణ, దేశీయ పరిశ్రమల పరిరక్షణ, దిగుమతి, ఎగుమతి సరకులపై పన్నుల ద్వారా రెవెన్యూ సాధించడం భారత టారిఫ్ విధానం అని మంత్రి మరొక ప్రశ్నకు సమాధానంలో వివరించారు. ‘టారిఫ్ వ్యవస్థను క్రమబద్ధీకరించడం, వాణిజ్యానికి వీలు కల్పించడంపైనే ఇటీవలి సంస్కరణలు దృష్టి కేంద్రీకరించాయి’ అని జితిన్ ప్రసాద తెలిపారు. ప్రస్తుతం భారత్ ఇయు, యుకె, ఓమన్‌లతో సంప్రదింపులు జరుపుతుండడంతో పాటు 13 ఎఫ్‌టిఎలు, 9 పిటిఎలలో సభ్య దేశంగా ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News