న్యూఢిల్లీ: టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం విధించడంతో దాదాపు 91 దేశాలు కొత్త కరోనా వేరియంట్లతో ఇబ్బంది పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాధన్ తెలిపారు. పుణెలోని సీరం సంస్థతోపాటు ఆస్ట్రాజెనెకా సంస్థలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్లు సరఫరా చేయాల్సి ఉందని, వాటిని అతిపేద ఆఫ్రికా దేశాలకు అందించాల్సి ఉందని ఆమె చెప్పారు. కానీ, భారత్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి కాక ఆ 91 దేశాలు టీకాల కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు. బి.1.617.2 వేరియంట్ వైరస్ భారత్‌లో విలయం సృష్టించడంతో భారత్ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అమ్మడానికి నిరాకరించింది.
ఈ వేరియంట్ ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తున్నందున ఆఫ్రికా దేశాల పరిస్థితి దయనీయంగా మారిందని ఆమె పేర్కొన్నారు. డబ్లుహెచ్‌ఒ లోని గవి ఒప్పందం ప్రకారం పేద దేశాలకు ఆస్ట్రాజెనెకా, సీరం సంస్థలు దాదాపు 100 కోట్ల టీకాలను సరఫరా చేయాల్సి ఉండాలని, 2020లోనే ఆ సంఖ్య 40 కోట్లు ఉండాలని, కానీ అలా జరగడం లేదని ఆమె అన్నారు. ఆఫ్రికా దేశాల్లో కేవలం 0.5 శాతం మంది మాత్రమే కొవిడ్ టీకాలు తీసుకున్నట్టు స్వామి నాథన్ తెలిపారు. వ్యాక్సిన్ల పంపిణీలో అసమానతలు ఇలా ఉంటే పేద దేశాలు మరింత తీవ్ర ఇబ్బందుల పాలవుతాయని, చెప్పారు. వాస్తవానికి వ్యాక్సిన్లకు అనుమతి రాక ముందే అమెరికా, బ్రిటన్, కెనడా, ఇజ్రాయెల్, ఐయు, దేశాలు ఆర్డర్లు ఇచ్చాయని, గత ఏడాది ఆగస్టు నాటికే యుకె 15 కోట్ల డోసులకు ఆర్డరు ఇచ్చిందని పేర్కొన్నారు. కనీసం ఈ ఏడాది చివరివరకైనా వ్యాక్సిన్ల ఎగుమతికి భారత్ అనుమతి ఇస్తుందని భావిస్తున్నట్టు సౌమ్యా తెలిపారు.
India vaccine export ban makes affected 91 countries