న్యూయార్క్/ వాషింగ్టన్ : భారత్ అత్యంత అధిక టారిఫ్‌ల దేశం అని యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికన్ సరకులపై సుంకాలు విధించే దేశాలపై ప్రతీకార టారిఫ్‌లను ఏప్రిల్ 2 నుంచి విధించబోతున్నట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘భారీ విధింపు ఏప్రిల్ 2న ఉండబోతున్నది. భారత్ లేదా చైనా లేదా ఏ దేశాలైనా సుంకాలు విధిస్తే ప్రతీకార టారిఫ్‌లు ఆ తేదీ నుంచి విధిస్తాం& భారత్ అత్యంత అధిక టారిఫ్‌ల దేశం’ అని ట్రంప్ చెప్పారు. ‘అధిక టారిఫ్ దేశం ఏదో మీకు చెబుతాను అది కెనడా. మా పాల ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తులపై కెనడా మాపై 250 శాతం చార్జి విధిస్తోంది.
కలప వంటి సామగ్రిపై భారీ టారిఫ్. అయినా మాకు వారి కలప అవసరం లేదు. వారి దగ్గర కన్నా మా దగ్గర ఎక్కువ కలప ఉన్నది. మాకు కెనడా కలప అక్కరలేదు’ అని ట్రంప్ గురువారం ఓవల్ కార్యాలయంలో చెప్పారు. ఆయన కొన్ని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రస్తుతం టారిఫ్‌లు ‘తాత్కాలికం, చిన్నవే’, కానీ, స్వభావరీత్యా ‘ఆధిపత్య టారిఫ్‌లు’ ఏప్రిల్ 2 నుంచి మొదలవుతాయి, అవి మా దేశానికి ‘భారీ మార్పు తెచ్చేవి’ అవుతాయని కూడా ట్రంప్ తెలిపారు. ‘ప్రపంచంలో ప్రతి దేశం మమ్మల్ని పిండుకోవడం ఇందుకు కారణం.
ఇప్పుడు వారు మాపై ఎంత చార్జి చేస్తే, వారు 150 200 శాతం చార్చి చేస్తే, మేము ఏమీ వారిపై ఏమీ చార్జి చేయడం లేదు. కనుక వారు మాపై ఎంత చార్జి చేస్తే మేము వారిపై చార్జి చేయబోతున్నాం. దాని నుంచి ఏమీ పొందడం లేదు. అందువల్ల మేము ఏప్రిల్ 2 కోసం ఎదురుచూస్తున్నాం. నేను చాలా కాలంగా ఆ తేదీ కోసం ఎదురుచూస్తున్నా. అది బాగా పెద్దది కావచ్చు’ అని ట్రంప్ వివరించారు. కాగా, భారత టారిఫ్‌ల గురించి ట్రంప్ వ్యాఖ్యానించడం రెండు రోజుల్లో ఇది రెండవ పర్యాయం. మంగళవారం కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ట్రంప్ భారత్, తదితర దేశాలు చార్జి చేస్తున్న అధిక టారిఫ్‌లను విమర్శించారు. వాటిని ఆయన ‘చాలా అన్యాయం’ అని పేర్కొన్నారు.
వైట్ హౌస్‌లో రెండవ విడత అధికార బాధ్యతలు స్వీకరించిన తరువాత ట్రంఫ్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించడం మొదటిసారి. యుఎస్ క్యాపిటల్ నుంచి శాసనకర్తలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ, ప్రతీకార టారిఫ్‌లు వచ్చే నెల మొదలవుతాయని ప్రకటించారు. ‘మీరు ట్రంప్ ప్రభుత్వం కింద అమెరికాలో మీ ఉత్పత్తిని చేయకపోతే మీరు టారిఫ్ చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో అధికంగానే ఉంటుంది. ఇతర దేశాలు దశాబ్దాల పాటు మనపై టారిఫ్‌లు వాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇతర దేశాలను వాడుకోనారంభించడం మన వంతు’ అని ట్రంప్ చెప్పారు.
‘సగటున, యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్, మెక్సికో, కెనడా వాటి గురించి మీరు విన్నారా? లెక్కలేనన్ని ఇతర దేశాలు మనం చార్జి చేసే స్థాయిని మించి బాగా ఎక్కువ టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి’ అని ట్రంప్ తెలిపారు. ‘అది చాలా అన్యాయం. భారత్ 100 శాతం కన్నా ఎక్కువగా మోటార్ వాహనాల టారిఫ్‌లు చార్జి చేస్తుంటుంది’ అని ఆయన అన్నారు. గతంలో ట్రంప్ భారత్‌ను ‘టారిఫ్ రాజు’ అని, ‘భారీ దుర్వినియోగ దేశం’ అని పేర్కొన్నారు. క్రితం నెల వైట్ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో సంయుక్త విలేకరుల గోష్ఠిలో ప్రసంగించిన సందర్భంలో భారత్ ‘టారిఫ్‌ల విషయంలో అధిక పట్టుదలతో ఉంటున్నది’ అని చెప్పారు. ‘నేను వారిని నిందించను.
కానీ అది వ్యాపారం చేసే విభిన్న మార్గం. భారత్‌లోకి విక్రయించడం చాలా కష్టం. ఎందుకంటే వారికి వాణిజ్య అవరోధాలు, అధిక టారిఫ్‌లు ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో యుఎస్ వాణిజ్య లోటు దాదాపు 100 బిలియన్ డాలర్లు అని, ‘ఒక ఒప్పందం కుదుర్చుకునే లక్షంతో యుఎస్ భారత్ వాణిజ్య సంబంధాల్లో గత నాలుగు సంవత్సరాల్లో పట్టించుకోవలసి ఉన్న దీర్ఘ కాలిక వ్యత్యాసాలను సరిదిద్దేందుకు సంప్రదింపులు ప్రారంభిద్దాం’ అని తాను, మోడీ అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇది ఇలా ఉండగా, యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్‌తో వాణిజ్య చర్చల నిమిత్తం భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ చేరుకున్నారు. భారత్‌తో యుఎస్ వాణిజ్య లోటు 2024లో 45.7 బిలియన్ డాలర్లుగా ఉన్నది. 2023లోని (2.4 బిలియన్ డాలర్లు) స్థాయి కన్నా ఇది 5.4 శాతం అధికం.