న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి వైదొలగాలని ఐక్యరాజ్యసమితి ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానానికి భారత్ మద్దతుగా నిలిచింది. తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 91 దేశాల్లో భారత్ కూడా ఉంది. నవంబర్ 28న దీనిపై ఓటింగ్ జరిగింది. తీర్మానం ప్రకారం ఇజ్రాయెల్ ఆక్రమించిన సిరియన్ గోలన్ నుంచి 1967 జూన్ 4కు ముందున్న స్థానానికి వైదొలగాలని పేర్కొంది. ఇజ్రాయెల్, సిరియాల మధ్య గోలన్ ప్రాంతం ఉంది.
ఈ తీర్మానానికి భారత్ మద్దతుగా నిలవడం గమనార్హం. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, లెబనాన్,ఇరాన్, ఇరాక్, ఇండోనేషియాతోసహా మొత్తం 91 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, పలావు, మైక్రోనేసియా , ఇజ్రాయెల్, కెనడా, మార్షల్ ఐలాండ్స్‌తదితర 8 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. ఉక్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, జపాన్, కెన్యా, పోలాండ్, ఆస్ట్రియా, స్పెయిన్ సహా 62 దేశాలు గైర్హాజరయ్యాయి.