Monday, December 23, 2024

రష్యాకు వ్యతిరేకంగా భద్రతా మండలిలో మొదటిసారి భారత్ ఓటు

- Advertisement -
- Advertisement -

India votes against Russia in UNSC

వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ మొదటిసారి ఓటు వేసింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలైన తరువాత ఈ అంశంపై భద్రతా మండలిలో జరిగే చర్చలు, ఓటింగ్‌ల్లో భారత్ తటస్థ వైఖరి అవలంబించడం పరిపాటిగా వస్తోంది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఆరు నెలలు పూర్తికావడం, అలాగే ఇదే సమయంలో ఉక్రెయిన్ 31 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యుద్ధ పరిస్థితులను సమీక్షించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బుధవారం సమావేశమై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడానికి అవకాశం కల్పించినప్పుడు అనుకూలంగా భారత్ మొదటిసారి ఓటు వేయడం విశేషం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెలెన్‌స్కీ ప్రసంగించడాన్ని రష్యా వ్యతిరేకించి ప్రొసీజరల్ ఓటింగ్‌ను కోరింది. దీంతో 15 సభ్య దేశాలు కలిగిన భద్రతా మండలిలో 13 దేశాలు జెలెన్‌స్కీ ప్రసంగానికి అనుకూలంగా ఓటు వేశాయి. కేవలం రష్యా మాత్రమే దీన్ని వ్యతిరేకించింది. ఈ ఓటింగ్‌కు చైనా దూరంగా ఉంది. దీంతో 13 సభ్య దేశాల మద్దతుతో జెలెన్‌స్కీ ప్రసంగించారు.

రష్యాతో రాజీపడేదే లేదు : జెలెన్‌స్కీ
రష్యాతో ఆధిపత్యం నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ఇది పునర్జన్మ అని , గత ఆర్నెలల యుద్ధ కాలంలో తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యాతో ఇక రాజీ పడేది లేదని , తాడోపేడో తేల్చుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ భావోద్వేగంతో మాట్లాడారు. ఉక్రెయిన్ 31 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన ప్రసంగించారు. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పంతోపాటు తూర్పున పారిశ్రామిక డాన్‌బాస్ ప్రాంతం లోని కోల్పోయిన భూ భాగాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

ఉక్రెయిన్ ఇండిపెండెన్స్ డే దాడిలో 22 మంది మృతి
ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున డ్నిప్రోపెట్రోవ్‌స్కీ ప్రాంతం లోని రైల్వేస్టేషన్‌పై రష్యా దళాలు రాకెట్‌తో దాడి చేయగా కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారని దాదాపు 50 మంది వరకు మరణించి ఉండవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News