అందరికళ్లు భారత్‌పైనే, నేడు మహిళల హాకీ సెమీస్ సమరం
టోకో: సంచలన విజయాలతో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన భారత మహిళా హాకీ జట్టు బుధవారం అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని ముద్దాడాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన భారత్ సెమీస్‌లోనూ అలాంటి ఫలితాన్నే పునరావృతం చేయాలని తహతహలాడుతోంది. ఆస్ట్రేలియాపై గెలుపుతో భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాను ఓడించడం ద్వారా చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. కెప్టెన్ రాణి రాంపాల్, వందన కటారియా తదితరులతో భారత్ చాలా బలంగా ఉంది.
అంతేగాక కిందటి మ్యాచ్‌లో గోల్ కీపర్ సవిత అసాధారణ ఆటను కనబరిచింది. కాగా, వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచిన భారత మహిళా జట్టు ఈ పోరులోనూ గెలిస్తే తొలి ఒలింపిక్ పతకం సొంత మవుతుంది. దీంతో సర్వం ఒడ్డి పోరాడేందుకు మహిళా టీమ్ సిద్ధమైంది. ఇక అర్జెంటీనా కూడా గెలుపే లక్షంగా పెట్టుకోవడంతో ఆసక్తికర పోరు ఖాయమనే చెప్పాలి. రాత్రి ఏడు గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక మరో సెమీస్‌లో జర్మనీబ్రిటన్ జట్లు తలపడనున్నాయి.